కాలం 1958... అంతరిక్షంలో ఒక వింత జరిగింది. ఆ వింతలో నుండి రెండు శక్తులు బయటికి వచ్చాయి.. ఒక శక్తి మంచిని కోరేది, ఇంకొక ‌శక్తి మంచిని అంతం చేయాలి అనుకునేది. వాళ్ళలో మంచిని కోరేది సూపర్‌డాల్ . ఇంకోదాని పేరు విలన్ డాల్ - చెడుని కోరేది. *

అంతకు కొన్నేళ్ళ ముందు , భూమి మీద..

రమేష్ చాలా మంచివాడు. ఒక పెద్ద కుటుంబంలో పుట్టాడు. బాగా చదువుకున్నాడు. భూమి గురించి బాగా తెలుసుకున్నాడు. భూమిపైన ఉండే చెడును అంతం చేయాలని అతనికి కోరిక. చాలా కష్టపడి అతను ఒక పరీక్షా కేంద్రం ఏర్పాటు చేసుకున్నాడు. అందులోని అధునాతన ఉపకరణాల సహాయంతో‌ భూమి చుట్టు ప్రక్కల జరిగే పరిణామాలన్నిటినీ అతను గమనిస్తూ ఉన్నాడు.

భూమి పైనే మరొకడు కూడా ఉన్నాడు- అతని పేరు నితిన్. భూమిని తన స్వాధీనంలోకి తెచ్చుకోవాలని అతనికి చాలా కోరిక. తన కోరికను నెరవేర్చుకోవటం కోసం అతను ఎన్నో ప్రయోగాలు చేశాడు. చాలా చెడ్డవాడు అతను. ఒకవేళ భూమి తన ఆధీనంలోకి రాకపోతే దాన్ని అంతం చేసేందుకు కూడా వెనకాడడు ! అతను కూడా తన పనులకోసం ఒక పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేసుకున్నాడు.

అంతరిక్షంలో..
సూపర్‌డాల్ , విలన్‌డాల్ ల మధ్య తీవ్రంగా పోరాటం జరిగింది. రెండు సంవత్సరాలపాటు ఎడతెరపి లేకుండా, సర్వ శక్తులూ వినియోగించి పోరాడుకున్నారు వాళ్ళు. ఇద్దరూ బాగా అలిసిపోయారు.. ఇద్దరి శక్తులూ క్షీణ దశకు చేరుకున్నాయి. అదే సమయంలో భూమ్యాకర్షణలో పెను మార్పులు సంభవించాయి. ఇద్దరూ జారి, గిరగిర తిరుక్కుంటూ‌ భూమి మీద పడిపోయారు!

విలన్‌డాల్ నితిన్‌కి దొరికింది. సూపర్‌డాల్ రమేష్‌కి దొరికింది.

విలన్‌డాల్‌ ని చూడగానే గుర్తుపట్టాడు నితిన్. దాన్ని తీసుకువెళ్ళి బాగు చేద్దామనుకు-న్నాడు. దాన్ని బాగుచేసే లోపల దాని శక్తులు అన్నిటినీ తను సొంతం చేసుకోవాలని పథకం వేశాడు. అయితే ఆలోగానే అనుకోకుండా సృహ వచ్చింది విలన్‌డాల్‌కు.. వెంటనే దానికి తెలిసిపోయింది- నితిన్ తన శక్తుల్ని సొంతం చేసుకోవాలనుకుంటున్నాడు! "నన్నే అంతం చేద్దామనుకున్నావా" అని దుర్మార్గుడైన నితిన్‌ను చంపేసింది విలన్ డాల్. నితిన్ తయారు చేసుకున్న పరీక్షా కేంద్రం అంతా ఇప్పుడు విలన్‌డాల్ సొంతం అయ్యింది!!

సూపర్ డాల్‌ను రమేష్ తన పరీక్షా కేంద్రానికి తీసుకువెళ్ళి బాగు చేశాడు. అప్పుడు సూపర్ డాల్‌కి సృహ వచ్చింది. రమేష్ తన గురించి చెప్పుకొని, సూపర్‌డాల్‌ని అడిగాడు- "నువ్వెవరు? ఇక్కడికి ఎలా చేరుకున్నావు?" అని. "నేను మంచిని రక్షించడానికి పుట్టాను- అలాగే చెడుకి గుర్తుగా విలన్ డాల్ పుట్టింది. అంతరిక్షంలో మేము ఇద్దరమూ చాలా సంవత్సరాలపాటు పోరాడుకున్నాం. ఆ పోరాటం కారణంగా మేం ఇద్దరం చాలా బలాలను కోల్పోయాం. శక్తిహీనులం అయ్యాం. అంతలో భూమ్యాకర్షణలో‌ పెనుమార్పులేవో సంభవించాయి. బలహీనులం అయిపోయిన మేము ఇద్దరం ఆ తాకిడికి తట్టుకోలేక, భూమి మీద పడిపోయాం. నేను నీ చేత చిక్కటం నా భాగ్యం. మరి విలన్‌డాల్ ఎవరికి

చిక్కిందో తెలీదు.. బ్రతికే ఉందో, లేదో కూడా తెలీదు.." అని చెబుతున్నది సూపర్ డాల్..
అంతలో సూపర్‌డాల్ మైండ్‌కి ఒక సిగ్నల్ వచ్చింది. నగరం మధ్యలో విధ్వంసం మొదలైంది.. కొద్దిసేపట్లోనే ఆ విధ్వంసం మరిన్ని ప్రాంతాలకు విస్తరించనున్నది. సూపర్‌డాల్‌కు వెంటనే అర్థమైంది- దీని వెనక ఉన్నదెవరో. తక్షణం అది బయలుదేరి వెళ్ళింది నగరం మధ్యకు. అక్కడ విలన్‌డాల్ సైనికులు కొందరు నిలబడి విధ్వంసం చేస్తున్నారు. ఎదురొచ్చినవాళ్లందరినీ తరిమి కొడుతు-న్నారు. సూపర్‌డాల్ మరుక్షణం తన శక్తుల్ని ప్రయోగించింది. దుర్మార్గులందరినీ మట్టుపెట్టింది.

అయితే దాంతో సూపర్ డాల్ విషయాలన్నీ‌ విలన్ డాల్‌కు తెలిసిపోయాయి. సూపర్ డాల్‌కి తను కోల్పోయిన శక్తులన్నీ తిరిగి వచ్చాయి కానీ, విలన్ డాల్‌కి ఇంకా అన్ని శక్తులూ రాలేదు. అందువల్ల, విలన్ డాల్ ఏం చేద్దామనుకున్నా సూపర్‌డాల్‌ వాటినన్నిటినీ అలవోకగా నిరోధించగలిగింది. మన సూపర్‌డాల్ అలా ఎన్నోసార్లు విలన్‌డాల్ సైనికులనుండి భూమిని రక్షించింది.

ఇక చేసేదేమీలేక, విలన్‌డాల్ నేరుగా రంగం లోకి దిగింది. సూపర్ డాల్ కూడా దానికి ఎదురు నిలచి పోరాడింది. ఇద్దరూ మళ్ళీ ఒక ఐదు సంవత్సరాల పాటు పోరాడుకున్నారు. చివరికి మన సూపర్‌డాల్ విజయం సాధించింది. విలన్‌డాల్‌ను మట్టుపెట్టింది.

ఆనాటినుండి సూపర్‌డాల్‌ అలాగే భూమిని సమస్యల నుండి కాపాడుతూ ఉన్నది. అప్పటినుండి భూమికి ఇక ఏలాంటి సమస్యలూ రాలేదు; ప్రజలందరూ భూమిమీద సుఖంగా బ్రతకటం మొదలు పెట్టారు.