"లాలా లలాల లాలా.. లలలా లలా లలాలల లలలా" అరుస్తూ స్నానం చేస్తున్నాడు విష్ణు. బయటి నుండి వింటున్న తాతయ్య చిన్నగా నవ్వాడు.
"అంత నవ్వేందుకు ఏముంది? మీరు కూడా రోజూ తీస్తారుగా, బాత్రూం రాగాలు?" సాగదీసింది బామ్మ.
"అవునవును- మనవడు కదా, జీన్స్ ఎక్కడికి పోతాయి?" అన్నాడు తాతయ్య నవ్వుతూ. "నువ్వు మరీ అతి, తాతయ్యా! పాటలు పాడుకోటంలో కూడా జీన్స్‌నే చూస్తున్నావంటే ఇంకేం చెప్పాలి?” అంది అక్కడే ఉన్న సుధ.
సుధ ఇంటర్లో చేరింది, ఇప్పుడే. "జీన్స్ వేసుకునేందుకు బాగుంటాయి గానీ చదువు కునేందుకు బాగుండవు" అనేది తన నిశ్చితాభిప్రాయం.
"ఏమో తల్లీ, కొన్ని కుటుంబాల్లో సంగీతం ప్రవహించటం, కొందరు పాట వినబడగానే వెన్నపూసల్లాగా కరిగిపోవటం, మరి కొందరు బండల్లాగా ఎలాంటి స్పందనా లేకుండా ఉండటం చూస్తే నాకు అట్లా అనిపిస్తుంది. కొందరు లలిత సంగీతం వింటారు, కొందరికి కర్నాటక సంగీతం ఇష్టం; కొందరు హిందుస్తానీ సంగీతాన్ని ఇష్టపడతారు; కొందరు పాశ్చాత్య సంగీతాన్ని మెచ్చుతారు- 'లోకో భిన్న రుచి:. అయినా ఈ మధ్య అందరూ సినిమా సంగీతం వెంట పడ్డారనుకో, చెవుల్లో స్పీకర్లు పెట్టుకొని సమయమూ సందర్భమూ లేకుండా ఒకటే మ్రోగించుకుంటున్నారు!' అన్నాడు తాతయ్య.
"అవునవును. అట్లాగే వాళ్ళ చెవులకు చిల్లులూ పడిపోతున్నాయట- మా ఈయన్టీ డాక్టరుగారు చెప్పారు. మీరు ఎన్నైనా అనండి. ఈ కాలపు సినిమా పాటల్ని కూడా మీరు సంగీతం అంటారుగానీ, అదో రణగొణ ధ్వనిలా తప్ప మరోలాగా ఉండదు!" అన్నది బామ్మ.
"అట్లా అనిపించేది నీ జీన్స్‌కు బామ్మా; నిజంగా ఆ రకం సంగీతాన్ని ఇష్టపడే వాళ్లని అడిగితే వాళ్లు ఇంకోలా చెబుతారు" అన్నాడు తాతయ్య నవ్వుతూ.
'అవున్లెండి! ఆ రోజుల్లో ఏదో 'రిఫ్‌రాఫ్' అంటూ ఎగర్లేదూ, మీరు కూడానూ? ఇప్పుడంటే కీళ్లు వదులైపోయినై కాబట్టి, ఇట్లా నిలకడగా 'రాగం' కడుతున్నారు గానీ?!' వెటకరించింది బామ్మ.
"'రిఫ్‌రాఫ్' కాదోయ్ 'హిప్ హాప్'! రాగం, తాళం, బీట్, నోట్ అన్నీ సంగీతమే కదటోయ్, తేడాలేమీ లేవు! అయినా వయసు పెరిగే కొద్దీ రాగం రక్తి కడుతుందట- ఎవరోచెప్పారు" అన్నాడు తాతయ్య, తగ్గకుండా.
"వయసు కాదు, అనుభవం! అయినా యీ రోజుల్లో పిల్లలంతా సినిమా పాటలు పెట్టుకొని వినే వాళ్లే గానీ, నిజంగా గొంతెత్తి పాడి అనుభవం తెచ్చుకుంటున్న వాళ్ళెందరు? సంగీత జ్ఞానం ఉన్నవాళ్ళెందరు? ఏదైనా ఓ సంగీత వాయిద్యాన్ని చక్కగా వాయించే వాళ్లెందరు? సినిమా పాటల రొదలో మన రాగ-తాళాల గతి ఏమౌతుందో తెలీకుండా ఉందసలు!" వాపోయింది బామ్మ.
"అదేం లేదులే బామ్మా! మా బళ్లో వారానికి రెండు రోజులు మ్యూజిక్ క్లాస్ జరుగుతుంది. రకరకాల సంగీతాలు నేర్పిస్తారు మాకు. శాస్త్రీయాలు, జానపదాలు, భక్తి గీతాలు, సినిమా పాటలు- ఏవంటే అవి! అంతేకాదు- మాకు ఏ వాయిద్యం ఇష్టమైతే అది నేర్పిస్తారు మా సర్- తెలుసా? అసలు ఆయనకు రాని వాయిద్యమే లేదు!" చెప్పింది ఎనిమిదో తరగతి చదివే వైష్ణవి.
"అమ్మో! ఎందరో మహానుభావులు! మీ సంగీతం సార్‌ని ఒక సారి మనింటికి భోజనానికి పిలువమ్మా! అట్లాంటి వాళ్లని దర్శించుకుంటే చాలు- పాపాలన్నీ పోతాయి!" అన్నది బామ్మ, ఇతరులెవ్వరికీ కనబడని సంగీతం దేవతకి మొక్కుకుని చెంపలు వేసుకుంటూ.
"సంగీతకారుల్ని మెచ్చుకుంటేనూ, దర్శించుకుంటేనూ, మొక్కుకుంటేనూ చాలదు, వాళ్ళకు శిష్యరికం చెయ్యాలి! వాళ్లనుండి విద్యను గ్రహించి, అభ్యాసం చేయాలి. అనగ ననగ రాగ- మతిశయిల్లుచునుండు!” అంటూనే, ‘సంగీత జ్ఞానము- భక్తి వినా, సన్మార్గము కలదే?” అని కృతి ఎత్తుకున్నాడు తాతయ్య.
పిల్లల ప్రపంచంలో సంగీతాన్ని పండించే మహానుభావులందరికీ పేరుపేరునా వందనాలు!
కొత్తపల్లి బృందం