జువ్వలదిన్నె తాండాలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఉంది. నాగరిక సమాజానికి దూరంగా, కనీస వసతులు కూడా లేని తాండా అది. పాఠశాల సైతం పాడుబడిన భవనంలో, నేడో రేపో కూలిపోతుందన్నట్లు శిధిలావస్థలో ఉంది.
స్రవంతి అనే పాప ఆ బడిలో రెండవ తరగతి చదువుతోంది. అమ్మానాన్నలు ఇద్దరూ వ్యవసాయం, కూలి పని చేస్తారు. వాళ్లకు స్రవంతి ఏకైక సంతానం. చాలా చురుకుగా, చలాకీగా, తోటి పిల్లలతో సరదాగా ఉంటుంది. ఆటలు ఆడుతుంది; పాటలు పాడుతుంది. బడికి అందరికంటే ముందు వచ్చి, చేదబావిలోంచి నీళ్ళు చేది, బడి చుట్టూ ఉన్న చెట్లకు పోస్తుంది.
ఒకరోజు స్రవంతి బడికి వచ్చి కూర్చొని, చక్కగా పలకమీద తెలుగు చూచివ్రాత రాయటం మొదలు పెట్టింది. పుస్తకం కేసి చూడటం, మళ్ళీ పలక మీద రాయటం- ఆ పనిలో ఎంత మునిగిపోయిందంటే, ఆ పాప బలపం అక్కడినుండి జారి దగ్గర్లోనే ఉన్న ఓ చిన్న బొరియలోకి పడిపోయింది.
అయితే అట్లా పడటం గమనించింది స్రవంతి. అదేదో ఎలుకలు చేసిన బొరియ అనుకున్నది. 'బలపం ఎక్కువ లోతుకు పోయి ఉండదు' అనుకున్నదో ఏమో, ఆ బొరియలోకి చెయ్యి పెట్టింది. బలపం దొరకలేదు సరికదా, విష క్రిమి ఒకటి తనను చటుక్కున కాటు వేసింది.
"నొప్పి-నొప్పి! పాము! పాము!" అని అరుచుకుంటూ పరుగులు తీసింది స్రవంతి. పక్కనున్న పిల్లలు భయపడిపోయి కేకలు పెట్టారు; తాండా జనమంతా బడి వద్దకు చేరారు. స్రవంతి అమ్మానాన్నలు ఏడ్చి ఏడ్చి తలలు బాదుకున్నారు. కరిచింది తేలు అయి ఉండచ్చు, పాపకి తెలీక ఎక్కువ భయపడుతున్నది అనుకున్నారు తాండావాళ్ళు.
అయితే అంతలోనే ఆ బొరియలోనుంచి ఒక నాగుపాము జరజరా బయటికి రావటం చూసి జనమంతా అదిరి పోయారు. వాళ్లలో కొందరు పామును పట్టుకొని బంధించారు; 108 అంబులెన్సు వారికి ఫోన్ చేసి పిలిపించారు. చకచకా స్రవంతిని పట్టణంలోని ఆస్పత్రికి తరలించారు.
అయితే అదృష్టం బాగుంది. వాళ్ళు అసుపత్రికి చేరుకునే సరికే అక్కడ డాక్టర్లు విషపు విరుగుడు ఇంజక్షనుతో సిద్ధంగా ఉన్నారు. సరైన సమయానికి వైద్యం లభించటంతో స్రవంతి కాస్తా బ్రతికిపోయింది.
కాబట్టి, జాగ్రత్త పిల్లలూ! ఆటలైనా, పాటలైనా, చదువులైనా, చాకిరీ అయినా, జాగ్రత్తగా ఉండాలి. విషక్రిములు ఉండే ప్రదేశాలలో అప్రమత్తతతో వ్యవహరించాలి.
ఎప్పుడైనా విషక్రిములు కరిచినట్లు అనుమానం వస్తే తక్షణం దగ్గరలోని ప్రభుత్వ డాక్టర్లను సంప్రదించాలి.