మామిళ్ళపల్లిలో పెద్ద మర్రి చెట్టు ఒకటి ఉండేది. ఆ చెట్టు తొర్రలో ఒక పిట్ట, దాని పిల్ల నివసిస్తూ ఉండేవి. తల్లి పక్షి రోజూ పోయి, తన పిల్ల కోసం ఆహారం వెతికి తెచ్చేది. "చిట్టి పిల్ల, పాపం ఇంకా రెక్కలు రాలేదు" అనేది. పక్షి పిల్ల ఆ పురుగులను తిని చాలా సంతోషంగా ఉండేది.

కొన్ని రోజులకు పిల్ల రెక్కలు గట్టిపడసాగాయి. అది గుర్తించిన తల్లి పక్షి మెల్ల మెల్లగా దాన్ని గూటి చివరి వరకూ వచ్చేందుకు, ఒక రెక్కను తెరిచేందుకు, మెల్లగా రెండో రెక్కను కూడా తెరిచేందుకు శిక్షణనివ్వటం మొదలెట్టింది:

"ఇదిగో, నేను ఎలా ఎగురుతానో చూడు! అయితే ఎగరాలంటే రెక్కలు గట్టిపడాలి. నీవి ఇంకా లేతగానే ఉన్నాయి. ఇంకొంచెం గట్టిపడ్డాక, అప్పుడు ఎగురుదువు- తొందరపడి ఎగిరితే ప్రమాదం, అర్థమైందా?! క్రింద పడిపోతావు! అందుకని జాగ్రత్తగా ఉండాలి: నేను ఎగరమన్నప్పుడే ఎగరాలి! ఇప్పుడు మటుకు, నేను ఎలా ఎగురుతానో బాగా గమనించు.." అని ఎగిరి చూపించేది.

అట్లా పిల్లకు ఎగరటం ఎలాగో చూపించింది కానీ, దాన్ని సొంతగాఎగరనివ్వలేదు తల్లి. దానికి కావలసిన ఆహారాన్ని కూడా తనే తెచ్చి ఇచ్చేది. తల్లిని చూసి "నేనూ ఎగురుతా త్వరలో" అనుకుంటూ రెక్కలు అల్లాడించేది పిల్ల పిట్ట.

ఆ సమయంలో ఒకరోజు ఉదయాన్నే పిల్లకి ఆహారం తెచ్చి ఇవ్వటం కోసం పోయిన తల్లి పక్షి ఇక తిరిగి రాలేదు!

సమయం గడుస్తున్న కొద్దీ పిల్లకు కడుపులో ఆకలి మొదలైంది. దాంతోపాటు 'తల్లికి ఏమైందో' అని ఆందోళన మొదలైంది.

మధ్యాహ్నం కావస్తుండగా ఇక ఆగలేక, అది మెల్లగా గూటి చివరికి వచ్చింది. ఒక్కో రెక్కనీ అల్లాడించి చూసుకున్నది. ఆ పైన రెండు రెక్కల్నీ ఒక్కసారి అల్లాడిస్తూ ధైర్యం చేసి ముందుకు దూకేసింది! ఒక్క సారిగా రెక్కలు కలుక్కుమన్నాయి! బలే నొప్పి పుట్టింది. కానీ ఒక్క క్షణం మాత్రమే! ఆ తర్వాత చూసేసరికి తను ఎగురుతున్నది! క్రింద పడిపోలేదు! అట్లా మెల్లగా క్రిందికి వాలి, నేలకు దగ్గరగానే కొంచెం కొంచెంగా ఎగురుతూ ఆ ప్రాంతం అంతటా కలయ తిరిగింది పక్షి పిల్ల.

"అమ్మా! అమ్మా!" అని అరుస్తూ, తక్కువ ఎత్తు కొమ్మల మీద వాలుతూ పోయిన పిల్ల పిట్టకు చివరికి అక్కడికి దగ్గర్లోనే కనబడింది తల్లి. పిల్ల పిట్ట సంతోషంగా తల్లి మీదికి దూకబోయింది.

"దగ్గరికి రాకు! అక్కడే నిలబడు!" అరిచింది తల్లిపిట్ట భయంతో వణికిపోతూ.

"ఏమైంది? ఎందుకు?" అడిగింది పిల్ల పిట్ట, అక్కడే నిలబడిపోయి.

"కనిపించట్లేదా, నా మీద అంతా ఒక వల పరచుకొని ఉన్నది. నేను ఎంత కదిలితే అది నాచుట్టూ అంతగా బిగుసుకుపోతుంది! వేటగాళ్ళు వలలు వేసి పెడుతుంటారు ఇలా. మనం ఆ వలల దగ్గరికి రాకూడదు. నేను చూసుకోక, ఇట్లా వచ్చి, ఇందులో‌ చిక్కుకుపోయాను!" అంది తల్లిపిట్ట ఏడుస్తూ. అప్పుడు గానీ పిల్ల పిట్టకు అక్కడొక వల ఉందని తెలీనే లేదు! దాన్ని చూస్తే పిల్ల పిట్టకు కూడా ఏడుపొచ్చింది.

అయినా అది ఏడుపును ఆపుకొని వలని జాగ్రత్తగా పరిశీలించి చూసింది.

గట్టి దారాలతో పేనారు వలను. దారాల మధ్య దూరం ఎక్కువ లేదు.

అయితే వలకు ఒకవైపుగా కొన్ని దారాలు తెగిపోయి ఉన్నాయి. తల్లి జాగ్రత్తగా అటువైపు నడిస్తే, ఆ దారాల మధ్యలోంచి బయట పడచ్చు.."

అది తల్లికి ధైర్యం చెప్పి, దాన్ని మెల్లగా ఆ తెగిపోయిన దారాల వైపుగా నడిపించింది. ఆ దారాల మధ్య సందులు నిజంగానే పెద్దగా ఉన్నాయి! అక్కడ దూరుకొని, పిల్ల సాయంతోటి వలలోంచి పూర్తిగా బయటికొచ్చేసింది తల్లి!

తల్లి పిట్ట, పిల్ల పిట్ట రెండూ ఆ దగ్గర్లోనే ఉన్న నీళ్లతో‌ ముఖం కడుక్కుని సేద తీరాక, రెండూ కలిసి ఎగిరి, సంతోషంగా తమ గూటికి చేరుకున్నాయి!

"నేను నీలాగా ఆలోచించనే లేదమ్మా!‌ వలలో చిక్కు పడే సరికి నా మెదడు స్తంభించిపోయింది. నువ్వు బలే తెలివిగా ఆలోచించావు- ఆపదలు వచ్చినప్పుడు నిజంగానే, అస్సలు కంగారు పడకూడదు!" అని పిల్లని మెచ్చుకున్నది తల్లి.