కాశీ రాజ్యాన్ని పాలించే బ్రహ్మదత్తుడికి నలుగురు కొడుకులు ఉండేవాళ్ళు.
వాళ్లలో మొదటివాడు ఒకసారి అడవికి పోయినప్పుడు, పెద్ద చెట్టు కాడం ఒకటి చూసాడు. బోడిగా, ఎండిపోయినట్లు నిలబడి ఉందది. అతను తనతో పాటు ఉన్న రథసారధిని 'ఇదేం చెట్టు, ఇట్లా ఉంది?' అని అడిగాడు.
"దీన్ని 'పలాశ చెట్టు' అంటారు యువరాజా!" అన్నాడు సారధి.
ఆ తర్వాత కొంత కాలానికి రెండో యువరాజు అదే ప్రాంతంలో తిరుగుతూ, కొమ్మలతోటీ-రెమ్మలతోటీ విస్తరించి ఉన్న పెద్ద చెట్టును ఒక దాన్ని చూసి, "ఆదేం చెట్టు?" అని అడిగాడు సారధిని.
దాన్ని 'పలాశ చెట్టు' అంటారు యువరాజా!" అన్నాడు సారధి.
మళ్లీ కొన్నాళ్లకి యీసారి మూడోవాడు వెళ్లాడు, అటువైపు. అక్కడొక చెట్టు ఎర్రెర్రని పూలతో, నిండుగా కనిపించింది. "అదేం చెట్టు, అట్లా ఉంది?" అని అడిగాడు అతను.
దీన్ని 'పలాశచెట్టు' అంటారు ప్రభూ!" అన్నాడు సారధి.
కొద్ది రోజులకు నాలుగో వాడు అటు వెళ్లి చూసి, అదే ప్రశ్న వేసాడు: 'ఇంతలేసి కాయలు కాసింది పచ్చగా, ఇదేం చెట్టు?' అని.
దీన్ని 'పలాశ చెట్టు' అంటారు యువరాజా!" అన్నాడు సారధి.
ఆ తరువాత యువరాజులు నలుగురూ మాట్లాడుకుంటుంటే ఏదో సందర్భంలో పలాశ చెట్టు ప్రస్తావన వచ్చింది:
"నేను చూసాను. అది బోడి కాండంలాగా ఉంటుంది" అన్నాడు మొదటివాడు.
"కాదు! మర్రి చెట్టులాగా పెద్ద వృక్షం అది! దాని నిండా ఆకులుంటాయి!" అన్నాడు రెండవ వాడు.
"ఉహూ! మాంసం ముద్దల్లాగా పూలుంటాయి. నాకు తెలుసు!" అన్నాడు మూడోవాడు.
"లేదు, లేదు! ఆకుపచ్చ కాయలుంటై!" అన్నాడు నాలుగోవాడు.
నలుగురూ "నేను కరెక్టంటే నేను కరెక్టు" అని గొడవపడుతుండగా, వాళ్ల నాన్న అటుగా వచ్చి, వాళ్ళ మాటలు విని, నవ్వాడు:
"మీరంతా దాన్ని చూశామనుకున్నారు; బాగానే గుర్తు పెట్టుకున్నారు; కానీ దాన్ని 'ఏ సమయంలో చూశాం' అనేది గమనించలేదు. ప్రపంచంలో 'కాలం' అనేది మహాద్భుతమైన వస్తువు. కాలంతో పాటు మారిపోనివి యీ సృష్టిలో ఏవీ లేవు. అన్నీ అనుక్షణం మార్పుకు లోనయ్యేవే!" అని చెప్పి సర్దుబాటు చేశాడు.
ఇందులో మనం పిల్లలం గమనించాల్సింది ఒకటుంది: రాను రాను అందరం పెద్దవాళ్ళం అవుతాం కదా, ఎలాగూ? అయితే 'ఎట్లాంటి పెద్దలం అవుతున్నాం?' అని గమనించుకుంటుంటే చాలు- అందరం బాధ్యత గల వాళ్ళగా ఎదుగుతాం.
బాధ్యతగా ఎదిగే పిల్లలందరికీ అభినందనలతో,
కొత్తపల్లి బృందం.