చంద్రిక చాలా బాగా చదువుతుంది; చక్కగా ఆటలు ఆడుతుంది. సంగీతం, నాట్యం నేర్చుకుంటున్నది; అంతే కాకుండా బొమ్మలు కూడా బాగా గీస్తుంది. తన దస్తూరీ ముత్యాల- లాగా ఉంటుంది.

తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు తనని బాగా ప్రోత్సహించేవాళ్ళు. సందర్భానుసారంగా ఏది మంచి-ఏది చెడు అని చెప్పేవాళ్ళు. చంద్రికకు మొదట్లో వాళ్లు చెప్పే మంచి సంగతులు నచ్చేవి. అయితే తను పెద్దవుతున్నకొద్దీ "వీళ్ళెందుకు, ఇట్లా అన్ని సంగతుల్లోనూ చెయ్యి పెడతారు? నేను ఏం చెయ్యాలో, చెయ్యకూడదో అన్నీ ఈ పెద్దవాళ్ల ఇష్టమేనా? నా ఇష్టం వచ్చినట్లు నేను ఉంటాను!" అనుకోవటం మొదలు పెట్టింది.

పదో తరగతిలో తనకు చాలా మంచి మార్కులు వచ్చాయి. వాళ్ల అమ్మానాన్నలు ఆ పాపని "నువ్వు ఇప్పుడు ఏం చదువుతావు?" అని అడిగారు. "డాక్టరును అవుతాను" అంది చంద్రిక. అందుకని వాళ్ళ అమ్మ, నాన్న చంద్రికను వాళ్ల ఊరికి దూరంగా, ఎంట్రన్సు పరీక్ష కోసం కోచింగ్ ఇచ్చే కాలేజి హాస్టల్లో చేర్చారు.

హాస్టల్‌లో చంద్రికతో పాటు ఉండే అమ్మాయి చాలా బద్ధకిస్టు. అస్సలు చదవదు: ఎప్పుడూ దొంగతనంగా సెల్‌ఫోన్‌ చూస్తూనే ఉంటుంది; ఏవో ముచ్చట్లని, పార్టీలని తిరుగుతూనే ఉంటుంది; ఎప్పుడూ చంద్రికను కదిలిస్తూనే ఉంటుంది. అంతేకాక, ఇప్పుడు చంద్రికను శాసించే వాళ్ళు కూడా ఎవ్వరూ లేరు! దాంతో మామూలుగా చాలా పద్ధతిగా ఉండే చంద్రిక కూడా, కొన్ని రోజులకి ఆ పాపతో చెయ్యి కలిపింది: "నాకు ఇదే యిష్టం!" అనుకున్నది.

ఆ సంవత్సరం చదువులో మెల్లగా వెనక పడుతూ పోయింది చంద్రిక. ఆ సంగతి తను గుర్తించినా, 'కాలేజి బాగా లేదు- టీచర్లు బాగా చెప్పట్లేదు' అనుకున్నది తప్పిస్తే, 'నా పద్ధతులు తప్పు' అనుకోలేదు ఆ అమ్మాయి. అలా వెనకపడి, వెనకపడి చివరికి మొదటి సంవత్సరం పరీక్షల్లో తప్పింది!

చంద్రిక వాళ్ల అమ్మ, నాన్న బాధపడ్డారు; కానీ చంద్రికను వాళ్ళు ఏమీ అనలేదు. "మెడికల్ సీటు రాకపోయినా ఏమీ‌ పర్లేదమ్మా! మామూలు కాలేజీలో బీయస్సీలో చేరచ్చు" అన్నారు. అయినా చంద్రిక మటుకు చాలానే చిన్నబోయింది: 'ఎందుకు ఇట్లా అయ్యాను? నాలో ఏమి మార్పు వచ్చింది?' అని ఆలోచించుకున్నది.

చిన్నప్పుడు తమ ఇంట్లోవాళ్ళు, బడిలో ఉపాధ్యాయులు తనకు ఏమేం‌ చెప్పారు, తను ఎలా చదివేది, అన్నీ‌ గుర్తు చేసుకున్నది; ఇప్పుడు తన సమయాన్ని వృధా చేసే అలవాట్లను అన్నిటినీ గుర్తించి, దూరం చేసుకున్నది. పట్టుదలగా చదవడం మొదలుపెట్టింది. త్వరలోనే అన్ని సబ్జక్టులలోనూ‌ చక్కని మార్కులతో పాస్ అయ్యింది. సంవత్సరాంతంలో 'నీట్' పరీక్ష కూడా చాలా చక్కగా రాసి మెడిసిన్ లో సీటు తెచ్చుకోవటమే కాదు; అక్కడ కూడా బాగా చదివి మంచి వైద్యురాలు అయ్యింది!

మన అలవాట్లు బాగుంటే చాలు, మనం అనుకున్నవి ఏమైనా సాధించగలం.