అనగనగా ఒక కోడిపుంజు ఉండేది. అది ఉత్త సోకులాడి. సోకులన్నా, బంగారం అన్నా దానికి చాలా ఇష్టం.
ఒకరోజు సాయంత్రం అది గింజలు వెతుక్కొని తింటూ తింటూ చాలా దూరం పోయింది.

అకస్మాత్తుగా దానికి ఒక బంగారు గింజ కనిపించింది బాట ప్రక్కనే, మెరుస్తూ.

"ఎంత బాగుందో!" అనుకుంటూ కోడి అటూ ఇటూ చూసింది. ఆ దగ్గర్లో వేరే ఎవ్వరూ లేరు.

చకచకా వెళ్ళి దాన్ని ముక్కున కరచుకోబోయింది. ఎన్ని సార్లు పట్టుకున్నా, అది నోటికి చిక్కినట్లే చిక్కి, క్రిందికి జారిపోసాగింది.

కోడి దాన్ని వొడిసి పట్టుకునేందుకు ప్రయత్నిస్తూ ప్రయత్నిస్తూ గుండ్రాలు గుండ్రాలుగా తిరిగింది.

అది ఎంత గట్టిగా ప్రయత్నిస్తే ఆ గింజ అంత దూరం ఎగిరి పడసాగింది. కోడి దాని వెంట పరుగెత్తింది.

అట్లా కొద్ది సేపటికి చూస్తే కోడిపుంజుకు తను ఎక్కడున్నదో అర్థమే కాలేదు. అంతలోనే చీకటి పడసాగింది. చివరికి ఆ చీకట్లో ఆ బంగారు గింజ ఏమైందో, కనిపించనే లేదు!

తడుముకుంటూ‌ తడుముకుంటూ‌ పోతే ఎంత దూరం‌ పోయినా అడవి వచ్చింది తప్ప, దాని ఇల్లు రానే లేదు.

చివరికి అది భయపడి, ఓ చెట్టెక్కి కూర్చొని, రాత్రంతా జాగరణ చేసింది.

"బంగారు గింజ ఎంత పని చేసింది! దీని కంటే ఒక మామూలు గింజ దొరికి ఉంటే ఎంత బాగుండేది, కడుపన్నా నిండేది కదా!" అనుకుంది బుద్ధి తెచ్చుకున్న కోడిపుంజు, తూరుపు తెలవారుతుండగా.