యువరాణి మయూరీదేవికి యుక్తవయసు వచ్చింది. ఆమెకు వివాహం చేయాలని అనుకున్నారు రాజుగారు. యువరాణి కూడా సరేనన్నది; కానీ తండ్రిని చిత్రమైన కోరిక ఒకటి కోరింది:
"ఈ రోజు నుంచి నేను ఎవ్వరితోటీ మాట్లాడను. పూర్తిగా మౌనం పాటిస్తాను. నా యీ మౌనవ్రతాన్ని ఎవరైతే భంగం చేస్తారో ఆ వ్యక్తినే నేను పెళ్ళి చేసుకుంటాను" అని. రాజుగారు సరేనని, ఆ సంగతినే దేశదేశాలా చాటించారు.
రాకుమారి అందచందాల గురించి విన్న యువకులు ఎందరెందరో వచ్చి, ఆమె మౌనవ్రతాన్ని భంగపరచాలని ప్రయత్నిం-చారు. వారిలో ఎందరో అందగాళ్లూ, వీరులూ, శూరులూ అయిన యువరాజులు ఉన్నారు. కానీ ఎవ్వరికీ ఆ భాగ్యం దక్కలేదు. రోజులు గడిచిపోతున్న కొద్దీ రాజుగారికి బెంగ పట్టుకున్నది: "ఇక నా కుమార్తెకు వివాహం జరగదేమో!" అని.
ఆ సమయంలో యువకుడు ఒకడు వచ్చాడు సభలోకి. అతడి శరీరం బలంగా, కండలు తిరిగి ఉన్నది. చూసేందుకు 'ఇతనెవరో యోధుడు' అనే అనిపిస్తున్నది; కానీ అతని దుస్తులు మాత్రం 'ఇతనొక పేదవాడు' అని తెలియజేస్తున్నాయి.
ఆ యువకుడు నేరుగా మహారాజు దగ్గరకు వచ్చి నమస్కరిస్తూ "మహారాజా! యువరాణీవారు కొంత కాలం క్రితం వేటకు వచ్చినప్పుడు, అతి సామాన్యుడినైన నన్ను వివాహం చేసుకున్నారు. అయితే నా పేదరికం కారణంగా ఆ విషయాన్ని మీకు చెప్పలేక, ఇలా 'మౌనవ్రతం' అంటూ కాలం వెళ్లబుచ్చుతున్నారు!" అన్నాడు. సభ అంతటా ఒక్కసారిగా నిశ్శబ్దం అలుముకున్నది.
రాజుగారు సభలోనే ఒక ప్రక్కగా కూర్చున్న మయూరీదేవి వైపు చూసారు. ఆమె "కాదు" అన్నట్లు అడ్డంగా తల ఊపింది.
అంతలోనే యువకుడు తన జేబులోంచి ఒక ఉంగరాన్ని తీసి చూపుతూ, "మా ప్రేమకు గుర్తుగా నాకు ఆమె ఇచ్చిన ఉంగరం ఇదిగోండి!" అన్నాడు.
వెంటనే మయూరిదేవి లేచి నిలబడి ఆవేశంగా "అంతా అబద్ధం! ఇతను ఎవరో నాకు తెలియదు! ఆ ఉంగరం నాది కాదు!" అంటూ గట్టిగా అరిచింది.
ఆ యువకుడు కూడా చిరునవ్వు నవ్వుతూ "అవును- నేనెవరో మీకు తెలియదు. నేను అవంతీ దేశపు యువరాజును. వివేకవర్ధనుడు అంటారు నన్ను. మీ మౌనవ్రతాన్ని భంగం చేసేందుకే ఇలా ఉంగరాన్ని తెచ్చాను" అంటూ తన మారువేషాన్ని తొలగించాడు.
సభికుల హర్షధ్వానాల మధ్య యువరాణి వివేకవర్ధనుడిని వరించింది.