చిన్నోడు బాగా 'చూస్తాడు’.

ఇప్పుడే కాదు. మొదటి నుండే వాడికి చూడటం బాగా వచ్చేది.

పుట్టాక, మొదటి సారి వాళ్ల అమ్మని చూశాడు కదా, అప్పుడే వాడు ఆమె కనుపాపల రంగు చూసేడు. ఆమె పెట్టుకున్న బొట్టు రంగు చూశాడు. రెండూ ఒకటి కాదని ఆశ్చర్య పోయాడు. అయితే ఇవేవీ వాడికి గుర్తు లేవిప్పుడు.

మొదట్లో చీరల్నే ఉయ్యాలగా వేసి పడుకో బేట్టేది వాళ్ళమ్మ. ఇంట్లో ప్యాన్‌ హుక్కుకో, బయట చెట్టు కొమ్మకో చీరలు వ్రేల్లాడదీసి, అందులో వీడిని పడుకో బెట్టి తన పనులు తను చేసుకునేది. అవే నాలుగైదు రంగులు - తెలుపు, పసుపు, ఆకుపచ్చ, నీలం, వంకాయరంగు వీటినే మళ్లీ మళ్లీ చూస్తూ వచ్చాడు వీడు. ఆ సమయంలోనే ఉయ్యాల సందుల్లోంచి బయటి ప్రపంచం కనబడ్డది. గాలికి ఊగుతున్న చెట్ల ఆకులు, నిశ్చలంగా ఉన్న ఆకాశపు నీలం.

అప్పుడే వాడికి అర్థమైంది- 'రంగులకి అంతం ఉండదు - ఎన్ని రంగుల్ని చూడ గల్గితే అన్ని కనిపిస్తాయి' అని. ఎండా కాలంలో వాళ్లు ఆరుబయట మంచాలు వేసుకొని పడుకునే వాళ్లు. అప్పటికి వాడికి చాలానే రంగులు తెలిసాయి. 'అన్నిటికీ పేర్లు పెట్టలేం' అని కూడా అర్థమైంది. ఎలాగంటే అమ్మ వాడికి రంగుల పేర్లు మళ్లీ మళ్లీ చెప్పి పలికించేది. ఒక ముదురు ఆకుని, ఒక లేత ఆకుని తెచ్చి 'ఇదేం రంగు?' అంటే రెండిటినీ 'ఆకుపచ్చ' అనేదామె. వీడు నవ్వేవాడు: 'వేర్వేరు రంగులు - ఒకటే పేరట, బలే పెడుతుందే!' అని.

అప్పుడే వాడికి ఆకాశం రంగులు మారుస్తుందని కూడా తెలిసింది. ఉదయంలోను, సాయంత్రాల్లోను అది పండు నారింజ రంగులో ఎర్రగా ఉంటుంది. వాన పడేప్పుడు మబ్బుల నల్ల రంగు పైన ఉంటే, ఆకాశపు నీలం దాని వెనక దాక్కుంటుంది. అయితే రాత్రి పూట చీకట్లో మటుకు ఆకాశం అంతా నల్లగా ఉంటుంది. రాను రాను వాడు పిట్టల్ని చూశాడు. కాకి, కోయిల నలుపే. చమురు కాకి ఉంటుంది. అది గోధుమ, ఎరుపు కలిసి పోయిన రంగు. పిచ్చుకలది గోధుమ రంగు- కానీ అన్నీ రంగులు మారుస్తూనే ఉంటాయి ఎప్పుడూ. ఒకే పిట్ట, వేరు వేరు కాలాల్లో వేర్వేరు రంగులు అద్దుకుంటుంది.

వాన పడగానే ఓసారి అమ్మ పిల్చి, ఎత్తుకొని చూపించింది - ఇంద్రధనస్సును!

ఆ మూల నుండి ఈ మూలకి, ఆకాశం నిండా పరచుకొని ఉంది! దాని నిండా ఎన్ని రంగులో! ప్రపంచంలో ఉన్న అన్ని రంగులూ అందులో కనిపించాయి చిన్నోడికి. తుంపర్లలోంచి బయటి కొచ్చేస్తే మటుకు ఇంద్రధనస్సు మాయం అయిపోతుంది ఎందుకనో?!

చిన్నోడి వేలుకి ముల్లు గుచ్చుకొని, బొట్లు బొట్లు రక్తం కారిందొకసారి. నొప్పి పుట్టి ఏడ్చాడుగాని, రక్తపు ఎరుపుని చూసి ఆశ్చర్య పోయాడు కూడా. అయితే ఆ తర్వాత కొన్ని రోజుల వరకూ వాడికి ఎరుపంటే భయంవేసింది: మళ్లీ నచ్చిందనుకోండి, అదెట్లాగంటే, వాళ్ళకి ఎర్రటి లేగదూడ ఒకటి ఉండేది. రోజూ సాయంత్రం సూర్యుడు దిగి పోతున్నప్పుడు, అది పరుగెత్తుకొని వస్తుంటే లేచే ఎర్రటి దుమ్ముకి, అంత పైనున్న సూర్యుడు కూడా అస్సలు ఏమాత్రం కనబడకుండా పోయేవాడు. అది చూసీ చూసీ చిన్నోడికి ఎరుపంటే భయం కూడా పోయింది.

పెద్దయ్యక, చిన్నోడు వేసే బొమ్మల్లో రంగుల్ని చూసి, అందరూ ఆశ్చర్య పోయేవాళ్లు.

"ఏముంది, చుట్టూ ఉన్నవేగా ఇవి?" అనేవాడు చిన్నోడు. "చూసే కళ్లుంటే అన్నీ కనిపిస్తాయి" అని నవ్వేవాడు.

"ఇన్ని రంగులు వేస్తావు కదా, నీకు ఏరంగు ఇష్టం?" అడిగాడొక పిల్లాడు చిన్నోడిని.

చిన్నోడు తన చుట్టూతా చూపించాడు- చుట్టూతా పిల్లలు: అందరూ రంగు రంగుల చొక్కాలు వేసుకొని ఉన్నారు- "అందరూ కలిసి ఆడుకుంటూ బలే ఉన్నారు కదా, రంగులు రంగులుగా?!" అన్నాడు. “వీళ్లలో ఏ ఒక్క రంగు బాగుంది అంటే నువ్వు మాత్రం ఏం చెబుతావు? అన్నీ ఉంటే బాగుంటుంది గాని?!” అన్నాడు. అర్థమై నిండుగా నవ్వాడా పిల్లాడు.

నిజంగానే మన చుట్టూ ఎన్నెన్ని రంగులు, ఎంత భిన్నత్వం! దేనికది అందమే, అన్నీ కలిస్తే ఇంకా మరీ అందం!

రకరకాల రంగుల్ని ఇష్టపడే మీకందరికీ వేసవి సెలవల శుభాకాంక్షలు!

కొత్తపల్లి బృందం.