రామాలయం ప్రాంగణంలో ఉన్న జామ చెట్టెక్కి, పండు కొరికి తింటున్నది చిన్నారి ఉడుత. ఆ రోజున శాస్త్రి గారి ప్రవచనంలో తన పేరు వినిపించింది దానికి! దాంతో చెట్టు దిగి, శాస్త్రిగారి దగ్గరికి వెళ్ళి నిలబడి మరీ విన్నది:

"శ్రీరాములవారికి వారధి నిర్మాణంలో సాయం చేసింది ఒక్క వానరులే కాదు! వాళ్లకంటే చిన్న జంతువు- ఉడుత కూడా ఆ మహత్కార్యంలో తన వంతు సాయం చేసిందిట!

అందుకు రాములవారు సంతోషించి, ఉడుతను దగ్గరకు తీసుకొని, దాని వీపును ప్రేమగా నిమిరాడట! దానికి గుర్తుగానే ఉడుత వీపు మీద చారలు ఉంటాయట" అని శాస్త్రి గారు చెబుతుంటే శ్రోతలతో పాటు ఈ ఉడుత కూడా శ్రద్ధగా విన్నది.

"ఏంటీ! నా వీపు మీద ఉన్న గీతలు ఒట్టి గీతలు కాదా?! రామయ్య వ్రేళ్ల గుర్తులా ఇవి! ఆహా! నేనెంత గొప్పదాన్ని?! నా గురించి నాకు తెలీకుండా ఇట్లా పెరిగానే?! ఇప్పుడు చెబుతాను!" అనే ఆలోచన మనసులోనే తిరిగి ఎక్కడలేని సంతోషం వేసింది దానికి. చెప్పలేనంత గర్వంతో ఇక ఆగలేక పల్టీలు కొట్టి, ఆనందంగా అడవిలోకి పరుగెత్తింది.

అట్లా ఉబ్బి తబ్బిబ్బైపోతూ పోతున్న ఉడుతకు దాని ఫ్రెండ్స్ ఎలుక, తాబేలు ఎదురయ్యాయి.

వాటిని చూస్తే ఉడుతకు మామూలుగానైతే చాలా సంతోషంగా ఉండేది. కానీ ఇవాళ్ల ఎందుకో, అవి రెండూ ఒట్టి పనికిమాలినవి అనిపించాయి. వాటిని చూసి కూడా చూడనట్టే పోబుద్ధయింది ఉడుతకి.

అది అట్లా పైకి పైకి చూసుకుంటూ ఎగిరి గంతులు వేసుకుంటూ వెళ్తుంటే ఎలుక, తాబేలు కూడా దాని వెంట పరుగుపెడుతూ "ఆడుకుందామారా?" అని అడిగాయి అనురాగంతో.

"నేనా?! మీతో ఆడాలా?! అసలు మీకు తెలుసా నా చరిత్ర ఏంటో? నా వీపుపైన ఉన్న ఈ చారలు ఎలాంటివో తెలుసా మీకు? ఇవి మామూలు చారలు కాదు! రామయ్య తండ్రి

వేళ్ళ గుర్తులివి! నాతో ఆడేందుకు మీరేంటి, మీకున్న విలువేంటి?! పోండి, పోండి!" అని ఈసడించుకుంటూ ముందుకు సాగింది ఉడుత.

అంతలో ఎదురుగా కనిపించాడు గున్నేనుగన్నయ్య. "ఏయ్‌! నీ ఫ్రెండ్స్ ఏరీ, ఆడుకోవడం లేదా?" అన్నాడు.

"లేదు లేదు" అంటూ రాగం తీసి, "ఆ విలువ లేనోళ్ళతో ఆడనన్నాను" అంది ఉడుత.

"అయ్యో! అదేమి? విలువ లేదంటావేమిటి? వాళ్ళు మంచోళ్ళేనే? రోజూ నీతోటి ఆడుకుంటుంటారు కదా?" "నిజమే. ఇప్పుడు నన్నే తీసుకోండి. నా వీపున చారలున్నై. ఇవి ఎలా వచ్చినై? రాముల వారు.. "అంటూ తను విన్నదంతా చెప్పుకున్నది ఉడుత.

అంతా విని ఆగకుండా నవ్వింది గున్న ఏనుగు. "ఎందుకు, నవ్వుతున్నావు?" అని అడిగింది ఉడుత, కోపంతో

"అయ్యో, ఉడతా, నీ అమాయకత్వానికి నవ్వుతున్నాను! నీ చారలు చూసుకొనే నువ్వు ఎగిరి ఎగిరి పడుతున్నావే, మరి ఇంక ఎలుక ఎంత గర్వపడాలి, ఆ ఎలుక అసలు వినాయకుడి వాహనం కదా?! మరి ఇంక తాబేలు సంగతికొస్తే, విష్ణుమూర్తే స్వయంగా దాని అవతారం ఎత్తాడు గదా?! అసలు ఇప్పుడు ఆ ఎలుక, తాబేలే 'నీతో‌ స్నేహం చెయ్యం పో!’ అప్పుడు నీ పరిస్థితి ఏంటి, చెప్పు?! నిజంగా మనస్ఫూర్తిగా చెబుతాను తల్లీ, నువ్వు వాటి 'మంచితనాన్నే' 'చేతకానితనం' అనుకున్నావు. అందుకే మంచి నేస్తాలను వదులుకున్నావు- అంతకు మించి ఏమీ లేదు" అంటూ ముందుకు సాగింది ఏనుగు.

దాని మాటలు వినగానే ఉడుత తలకెక్కిన గర్వమంతా టప్పుమని ఎగిరిపోయింది. సృష్టిలోని ప్రతి జీవికీ దానిదైన గొప్పతనం ఉందని అర్థమై, తన నేస్తాలకు క్షమాపణ చెప్పేందుకు వెనక్కు తిరిగిందది.