గిరి వాళ్ళ నాన్న వీరయ్య కష్టజీవి. వాళ్ళు పడే కష్టం తెలుసు గనకనే ఇంటి దగ్గర చాలా పనుల్లో తల్లిదండ్రులకు సాయం చేసేవాడు గిరి. బడిలో కూడా చదువుల్లోను, ఆటపాటల్లోను, ప్రవర్తనలో కూడాను 'మంచి పిల్లవాడు' అని పేరు తెచ్చుకున్నాడు.
అలా ఉండగా గిరి వాళ్ల అమ్మకి ఏదో పెద్ద జబ్బు చేసింది. వీరయ్య తన దగ్గరున్న కొద్దిపాటి డబ్బులతో స్థానికంగా ఆమెకు వైద్యం చేయించాడు కానీ ఆమె పరిస్థితి ఏమంత మెరుగు కాలేదు. మెరుగైన వైద్యం కావాలంటే పట్నం వెళ్ళాలి; దానికి డబ్బులు కావాలి.
ఆ సమయంలో ఇంక వేరే గతి లేని వీరయ్య ఊళ్ళో వడ్డీకి డబ్బులు ఇచ్చే గురవయ్య దగ్గరకు వెళ్ళి ఐదువేల రూపాయలు అప్పు అడిగాడు.
గురవయ్య అతనికి ఐదువేలూ ఇస్తూ "వీరయ్యా! నా ఐదువేల అప్పూ వడ్డీతో సహా కట్టటం నీకు కష్టం అవుతుంది గాని, నా మాటవిని, నీ ఇల్లు నాకు అమ్మేయి. ఈ ఐదువేలు కూడా నేను ఇంటి ధరలో మినహాయించుకోను; అది నీకు అదనపు మేలు అవుతుంది!
ఇంతలా ఎందుకు అడుగుతున్నానంటే మరేమీ లేదు- నీ ఇల్లు నా పొలం ప్రక్కనే ఉన్నది కదా; అది ఉంటే నేను ఇంట్లో ఉండి పొలం చూసుకోవచ్చు" అన్నాడు అనునయంగా.
"అయ్యా! ఆ ఇల్లు మా తాతల నాటిది. నేను అందులోనే పెరిగి పెద్దయ్యాను. గిరి కూడా అక్కడే పుట్టాడు. ఆ ఇంటితో మాకు అనుబంధం ఎక్కువ. దయచేసి ఏమీ అనుకోవద్దు- కష్టపడి వడ్డీతో సహా మీ బాకీ రీరుస్తాను" అని నమ్రతతో చెప్పి డబ్బు తీసుకొని అప్పుపత్రం రాసిచ్చాడు వీరయ్య.
ఈ సంగతి తెల్సుకున్న గిరి కూడా, 'ఇంటి అప్పులు త్వరగా తీరాల'ని, 'అమ్మ త్వరగా కోలుకోవాల'ని అనుకొని, రోజూ బడి అయిపోయాక పని చేసేట్లు ఓ అంగడిలో పనికి కుదురుకున్నాడు. వీరయ్య వద్దంటున్నా వినకుండా ఇంటికోసం కష్టపడ-సాగాడు.
ఇంట్లో కూరగాయలు పండిస్తే, ఇక బయటినుండి కొనే ఖర్చు తగ్గుతుందని, ఇంటి పెరట్లో చిన్న చిన్న పాదులు చేసి, వంగ, బెండ, దొండ, దోస వంటి మొక్కలు, ఆకుకూరలు వేసి శ్రద్ధగా నీళ్ళు పోసి పెంచసాగాడు. మొక్కలు కూడా బాగా ఏపుగా పెరిగాయి.
ఇట్లా వీళ్ల ఇంట్లో అందరూ కలిసి కట్టుగా పని చేయటాన్ని గమనించింది ఒక దేవత. వాళ్ళ మంచితనానికి, చిత్తశుద్ధికి ముచ్చటపడిన ఆ దేవి వాళ్లకు తగిన సాయం చేయాలనుకొని, ఒకరోజున పూలమొక్కలు అమ్మే స్త్రీ రూపంలో వీరయ్య ఇంటిముందుకు వచ్చి నిలబడింది.
గిరి ఆమెను పలకరించగానే ఆమె "బాబూ, మంచి కూరగాయల మొక్కలు వేసావు. దేవుడి కోసం కొన్ని పూల మొక్కలు కూడా వెయ్యి" అని ఓ పూలమొక్కను ఇచ్చింది వాడికి. గిరి సరేనంటూ దాన్ని తీసుకొని "ఎంతమ్మా?" అని ధర అడిగాడు. "డబ్బులేమీ వద్దు నాయనా! మొక్క ఎదిగి పూశాక, దేవుడికి రోజూ ఐదు పూలు ఇవ్వు చాలు!" అంది పూలమ్మి.
గిరి ఆమెను తల్చుకుంటూ ఆ మొక్కని పెరడులో నాటాడు. పది రోజుల తర్వాత పూలమ్మి వచ్చి, మొక్కని చూసి మెచ్చుకొని, బాగా పెరుగుతున్నది నాయనా! "ఇట్లాగే దీని జతగా నాటు, ఈ మొక్కని కూడా" అంటూ మరో మొక్కని ఇచ్చి వెళ్ళింది.
గిరి ఆ మొక్కని నాటేందుకని త్రవ్వబోతే చిత్రంగా అక్కడ ఖంగుమని శబ్దం వచ్చింది! జాగ్రత్తగా చూస్తే అక్కడో కంచు చెంబు, అందులో నిండా బంగారు నాణాలు!
పరుగున వెళ్ళి తండ్రిని పిల్చుకొచ్చి చూపించాడు గిరి. "మనకు ఆ దేవుడే దారి చూపించాడు నాయనా! ఇందులోది ఒక్క నాణెం అమ్మామంటే చాలు, మనం గురవయ్య అప్పునూ తీర్చేయచ్చు, మీ అమ్మ ఆరోగ్యమూ బాగు చేయించుకోవచ్చు, నిన్ను బాగా చదివించుకోవచ్చు కూడా" అని రంగయ్య కూడా చాలా సంతోషపడ్డాడు.
తీసుకున్న అప్పును వడ్డీతో సహా అంత త్వరగా తీర్చేసినందుకు గురవయ్య ఆశ్చర్యపోయి "వీరయ్యా! బాకీ తీర్చేసావే! ఎలా వచ్చింది, అంత డబ్బు?" అని అడిగాడు.
అమాయకపు వీరయ్య నిజం చెప్పేసాడు- "నిజంగా దేవుడే కరుణించాడు గురవయ్యా! మా పెరట్లో మొక్క పెట్టేందుకని పాదు త్రవ్వామా, ఇంత త్రవ్వగానే దొరికింది, ఓ చెంబు నిండా బంగారు దొరికింది; మా కష్టాలు తీరాయి!" అని.
"ఒక్క చెంబేనా, మరి దాని చుట్టూ ఇంకేమీ లేదుగా?!" అన్నాడు ఆశగా, గురవయ్య.
"ఏమో, చూడలేదు! నిజంగా మా జన్మకైతే ఇది చాలు గురవయ్యా! మావాడికి కూడా ఇంకేమీ అవసరం ఉండదు. ఆ తర్వాతి కథ తర్వాత ఎప్పుడైనా చూసుకోవచ్చు, కదా!" అన్నాడు వీరయ్య మరింత మురిసిపోతూ.
గురవయ్య లేని సంతోషం కనబరుస్తూ "అవునవును. మంచి వార్త చెప్పావు రంగయ్యా! ఇప్పుడు నీ భార్య కూడా కోలుకున్నది! దీనికంతా దేవుడే కారణం తప్ప మరేమీ కాదు. మీ కుటుంబం అంతా వీలు చూసుకొని ఓ నాలుగు రోజులు చుట్టు ప్రక్కల ఊళ్ళలో గుళ్లన్నీ దర్శించి రండి. అంతా మంచే జరుగుతుంది" అన్నాడు.
"మంచి ఆలోచన. ఎప్పుడో ఎందుకు, రేపే బయల్దేరి వెళ్తాం" అంటూ రంగయ్య ఇంటికి వెళ్ళి "ఇట్లా ముగ్గురం కలిసి ఓ నాలుగైదు రోజులు గుళ్లన్నీ దర్శించి వద్దామనిపిస్తున్నది. రేపు బయల్దేరుదామా?" అన్నాడు భార్యతో. భార్య సరేనన్నది; గిరి కూడా సరేననటంతో మరునాడే ముగ్గురూ బయలుదేరి వెళ్ళారు, క్షేత్రాలు తిరిగి వచ్చేందుకు.
అసలు గురవయ్య ఆలోచన ఏమంటే, 'ఒక్క చిన్న గుంత త్రవ్వితేనే గిరికి ఒక బంగారు చెంబు దొరికింది. నిజానికి అట్లాంటి చెంబులు ఇంకా ఎన్నో ఉండి ఉండచ్చు అక్కడ! పూర్తి స్థాయి నిథి కూడా ఉండచ్చు! ఏదో ఒక రకంగా వీళ్లను బయటికి పంపితే తనే పెరడును త్రవ్వి చూసుకుంటాడు!'
వీరయ్యవాళ్ళు బయలుదేరిన రాత్రే, వాళ్ల పెరడులో ఖాళీ స్థలాన్నంతా అంగుళం వదలకుండా త్రవ్వి చూసాడు గురవయ్య. ఎంత త్రవ్వినా అతనికి ఏ చెంబూ దొరకలేదు! త్రవ్విన ప్రయాస మాత్రం మిగిలింది. అతని దురాశనంతా ఆకాశం నుండి దేవత చూసి నవ్వుకున్నది.
నాలుగు రోజుల తర్వాత తిరిగి వచ్చిన వీరయ్య కుటుంబం తమ ఇంటి పెరడంతా త్రవ్వి ఉండటం చూసి ఆశ్చర్యపోయారు. ఇరుగు పొరుగు వాళ్ళెవరూ దాన్ని గురించి ఏమీ చెప్పలేకపోయారు. "ఇదంతా దేవుని లీల! మనం మరిన్ని కూరగాయలు, పూల మొక్కలు పెట్టాలని, ఆ దేవుడు ఇలా త్రవ్వించి పెట్టాడు" అని రంగయ్య, గిరి పెరడంతా కూరగాయలు, పూల మొక్కలు నాటారు. దేవత కూడా వచ్చి ఆశీర్వదించి వెళ్ళింది.
అటుపైన వీరయ్య కుటుంబం ఏ పని తలపెట్టినా అది తప్పకుండా మంచి ఫలితం ఇవ్వసాగింది. వాళ్ల ఇల్లు కూడా పచ్చగా కళకళలాడింది. దీన్ని గమనించిన గురవయ్యలో అంతర్మథనం మొదలైంది. "మంచి చేస్తే మంచి, చెడు చేస్తే చెడు జరుగుతాయి" అని అర్థం చేసుకున్న గురవయ్య క్రమంగా మంచి పనులు చేయటం మొదలెట్టాడు. కష్టాల్లో ఉన్నవారికి తన చేతనైనంత సాయం చేయసాగాడు. గతంలోలాగా అధిక వడ్డీలు వసూలు చేయటం మానుకున్నాడు. అతనిలో మార్పును గమనించిన ఊళ్ళో వాళ్ళు అతన్నీ సమధికంగా గౌరవించారు.