లోగుట్టు!
డాక్టర్: మీరు బయట తినకండి. లేకపోతే ఎలర్జీ తగ్గదు.
రామారావు: అలాగేనండి. ఇంట్లోనే తింటాను. బయట కొనుక్కున్నా సరే- ఇంటికి తెచ్చుకునే తింటాను.
నిరసన!
తండ్రి: అదేమిట్రా! నుంచుని తింటున్నావెందుకు?!
కొడుకు: భార్య సంపాదిస్తుంటే కూర్చుని తింటున్నానని మీరు తిట్టారుగా? అందుకే!
ఆధునిక విజ్ఞానం!
టీచర్: బిట్టూ! 16 వ శతాబ్దం నాటి రాజుల గురించి నీకేమైనా తెలుసా?
బిట్టూ: తెలుసు టీచర్
టీచర్: గుడ్..ఎం తెలుసో చెప్పు?
బిట్టూ: వాళ్ళంతా చనిపోయారు టీచర్!
మూల కారణం!
టీచర్: రామూ! భూకంపాలు ఎప్పుడు వస్తాయి?
రాము: భూమి సూర్యుడి చుట్టూ తిరిగి తిరిగి, కళ్ళు తిరిగి పడిపోయినప్పుడు టీచర్!
జాగ్రత్త పరుడు
భార్య: ఏం చేస్తున్నారక్కడ?
వెంగళప్ప: మొక్కలకి నీళ్ళు పోస్తున్నాను
భార్య: వర్షం పడుతోందిగా!
వెంగళప్ప: ఫర్వాలేదు! గొడుగు వేసుకొనే పోస్తున్నా...!
పరిశుభ్రమైన హోటల్!
సర్వర్ (నవ్వుతూ) : మా హోటల్ హల్వా ఎలా ఉంది సర్?!
రవి (నవ్వుతూ) : మీకు ప్రతీదీ శుభ్రంగా ఉంచడం అలవాటు కదా?
సర్వర్ (ఆశ్చర్యంగా) : అవునండి! మీకెలా తెలిసింది?!
రవి : ఏం లేదు.. ఏలకుల వాసన కంటే విమ్ సబ్బు వాసనే ఎక్కువ వస్తుంటేను!
రహస్యం!
శీనా: ఉత్తరం మీద చిరునామా రాయకుండానే పోస్ట్‌బాక్స్‌లో వేశావేంట్రా?!
రాము: ఎవరికీ తెలీకుండా రహస్యంగా పంపుతున్న ఉత్తరంరా, అది!!
చిన్న తేడా!
రవి: అలారానికి, పలారానికి ఏమైనా సంబంధం ఉందా?
శశి: ఉంది. కోడిపుంజు కూస్తే అలారం; కోస్తే పలారం!
ఇద్దరూ వేలే!
తల్లి (ప్రైవేటు కాలేజీ కరస్పాండెంటు తో) : మావాడి పేరు ఏకలవ్యుడు అని పెట్టాల్సింది సర్.
కరస్పాండెంట్: అదేమి?
తల్లి: ఆయన వేలు కోసి చదువుకున్నాడు; మావాడు వేలు పోసి చదువుకుంటున్నాడు..
పీడ విరగడ!
భార్య: దోమలు బాగా కుడుతున్నాయండి. ఏ ఆలౌటో వెలిగించుకోవాలి.
పిసినారి వెంగళ్: వెలిగించుకుంటే ఊరికే గాల్లో కలిసిపోతుంది. త్రాగేస్తే సరి! ఆపైన మనల్ని కుట్టిన దోమలన్నీ చచ్చి ఊరుకుంటాయి.
వాస్తవం!
జర్నలిస్టు : మిమ్మల్ని బాగా ప్రభావితం చేసిన బుక్స్ ఏవి?
నాయకుడు : ఓ నాలుగైదు ఉంటాయి. అన్నీ బ్యాంకు వాళ్ళిచ్చిన చెక్కు బుక్కులే.
పోయే కాలం
క్విజ్ మాస్టారు : గడియారం పదమూడు గంటలు కొట్టిందంటే, అది ఏమి సమయం?
సోము : రిపేర్ సమయం సర్!
గౌరవం!
అల్లరి చిల్లర కొడుకు : డాడీ! పార్టీకి కార్ తీసుకెళ్తాను డాడీ!
తండ్రి : ఎందుకురా నాన్నా?!
అల్లరి చిల్లర కొడుకు : ఎంత వాహనంలో పార్టీకెళ్తే అంత గౌరవం డాడ్! పది లక్షల కారు! సూపర్!
తండ్రి : బస్సయితే యాభై లక్షలు! ఇదిగో బస్సు టిక్కెట్టు డబ్బులు పది రూపాయలు పట్టుకెళ్ళు!
దయ!
డింగరి : వంద రూపాయల నోటు మీద గాంధీ తాత నవ్వుతూ ఎందుకుంటాడు?
తింగరి: ఏడుస్తుంటే మరి నోటంతా తడయిపోతుంది గదా, అందుకని!
ఎక్కువైన తెలివి!
జడ్జిగారు : హత్య జరిగిన కత్తి పైన నీ వేలిముద్రలు ఉన్నాయి కాబట్టి నువ్వు నేరస్తుడివి అని నిర్థారిస్తున్నాను.
ముద్దాయి : నేను M.A చదివాను సార్! వేలుముద్రల వాడిని కాదు! మీ తీర్పుని సరిచూసుకోండి!
నోరెందుకు మెదపరు?
అమ్మ: ఫెవికాల్ ట్యూబ్ ఏదంటే మీ నాన్న నోరు విప్పట్లేదేంరా రవీ?
రవి: పొద్దున్నే నన్ను టూత్ పేస్ట్ అడిగారమ్మా. నేను ఫెవికాల్ తెచ్చిచ్చాననుకుంటా!
పొడుపు కథలు
1. ఎముక లేనిది, నిచ్చెన ఎక్కేది
2. ఊళ్ళో లేని మండలం, చేతిలోని మండలం
3. ఊరంతా ఒకటే పందిరి!
4. ఏడవక ఏడ్చును, నవ్వక నవ్వును. ఎవరు?
5. ఒక పోలీసు, రెండు టోపీలు. ఏంటది?
6. ఇల్లంతా వెలుగు, బల్ల క్రింద చీకటి
7. ఒక ఇంటికి రెండు దారులు!
8. ఏ రాయీ వద్దన్నా ఆ రాయి కావాలి అందరికీ!
9. ఏడిస్తే ఏడుస్తుంది, నవ్వితే నవ్వుతుంది!
10. కన్నులున్న చిన్నది, కడలియందు జీవించు!
పొడుపు కథలకు జవాబులు
1. పేను
2. కమండలం
3. ఆకాశం
4. నటుడు
5. బఠానీ గింజ
6. దీపం
7. ముక్కు
8. ఉప్పురాయి
9. అద్దం
10. చేప
(పొడుపు కథల సేకరణ సౌజన్యం : డా.పత్తిపాక మోహన్, “పిల్లలకోసం పొడుపు కథలు”)