తాతయ్య కళ్ళు మూసుకుని ఏదో ఆలోచిస్తున్నట్లు కూర్చున్నాడు.

"ఏం చేస్తున్నావు తాతయ్యా?, ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్నట్లున్నావు?" అడిగాడు రాము. వాడు పుస్తకాలు చదివీ, చదివీ పాతకాలపు జోకుల్ని బాగా అర్థం చేసుకుంటున్నాడు ఈ మధ్య.

"ఏం లేదురా! మా ఇంటికీ, గొడ్ల చావిడికీ పైకప్పు దేంతో వేద్దామా అని ఆలోచిస్తున్నాను" అన్నాడు తాతయ్య చిలిపిగా.

"దానిదేముంది, చక్కని బోద గడ్డి కప్పితే సరి. ఏడెనిమిదేళ్ళ పాటు ఇంట్లో ఏ.సి. పెట్టుకునే అవసరం ఉండదు" అన్నాడు శేఖరం. శేఖరానికి పర్యావరణం గురించిన శ్రద్ధ ఎక్కువ. "మనం అందరం ఏదో ఒక విధంగా పర్యావరణాన్ని పాడు చేస్తూనే ఉన్నాం. అట్లా ఉండకూడదు" అని శేఖరం వాదిస్తుంటాడు ఎప్పుడూ.

"బాగుంటుంది గానీ, బోద గడ్డి సరిపోని వాళ్ళకు అందులో పేరుకునే దుమ్మువల్ల ఎలర్జీలు, తుమ్ములూ మొదలైతై" అంది బామ్మ, ఎక్కడినుండో వచ్చి కూర్చుని.

అంతలోనే‌ గట్టిగా తుమ్ముకుంటూ వచ్చింది శ్రీలక్ష్మి. శ్రీలక్ష్మికి చిన్నప్పటినుంచే రక్తంలో ఇస్నోఫిల్స్ ఎక్కువ. చీటికీ మాటికీ తుమ్ములు వస్తూనే ఉంటాయి. శ్రీలక్ష్మి తుమ్ముల్ని చూడగానే అక్కడున్న వాళ్లంతా నవ్వులు చిందించారు.

"నవ్వండి, నవ్వండి. మీకు నవ్వులాటలాగానే ఉంటుంది. తుమ్మిన వాళ్ళకు గదా, తెలిసేది, అందులో కష్టం?! హాచ్, హాచ్, హాచ్, హాచ్!" అంటూ ఆపకుండా నాలుగు తుమ్ములు తుమ్మింది శ్రీలక్ష్మి.

"మనం తినే ఆహారంలోనూ, పీల్చే గాలిలోనూ, తాగే నీళ్ళలో కూడా రకరకాల టాక్సిన్ లు ఉంటున్నాయి. శరీరాలు వాటినేమీ అనకుండా లోపలికి రానిస్తున్నాయి. పాపం బోదగడ్డి మాత్రమే చెడు చేసిందా ఏమి? టాక్సిన్ ల కంటే ఎక్కువా అది?!" గొణిగాడు శేఖరం.

"టాక్సిన్లంటే గుర్తొచ్చింది. రక్తంలో చేరిన విష పదార్థాలను గుర్తించేందుకుగాను ఆ రక్తపు నమూనాల్లోంచి ఇన్‌ఫ్రా రెడ్ కిరణాలను పంపించి, దానిలోంచి బయటికి వెలువడే‌ కిరణాలను పరిశీలిస్తారు. దీని కోసం ఈ మధ్య లేసర్లను వాడుతున్నారు. ఈ విద్యను స్పెక్ట్రోస్కోపీ అంటారు. స్పెక్ట్రోస్కోపీకి మంచి పునాది వేసిన శాస్త్రవేత్తల్లో ఒక భారతీయుడు కూడా ఉన్నాడు. ఎవరో చెప్పుకోండర్రా, చూద్దాం, పిల్లలూ?!"‌ అన్నాడు తాతయ్య.

" సీ.వీ.రామన్ " టక్కున చెప్పింది శ్రీలక్ష్మి. "సీ.వీ.రామన్ స్పెక్ట్రోస్కోపీలో చేసిన పరిశోధనలకు గాను ఆయనకు 1930 వ సంవత్సరపు నోబెల్ బహుమతి లభించింది. ఆయన కనుక్కున్న విషయాన్ని 'రామన్ ఎఫెక్ట్' అంటున్నారు శాస్త్రజ్ఞులు.

"అవును. ఇంతకీ రామన్ ఎఫెక్ట్ అంటే ఏమిటి తల్లీ?‌!" అడిగాడు తాతయ్య.

"అది.., అది..,” అంది శ్రీలక్ష్మి. అందరూ నవ్వారు.

"ఏదైనా వస్తువులోకి ఎలెక్ట్రో-మ్యాగ్నెటిక్ కిరణాలను ప్రసరింపజేసినప్పుడు, ఆ కిరణాలు వస్తువులోని సూక్ష్మ కణాలను తాకి, పలువైపులకు విరజిమ్మబడతాయి. ఆ క్రమంలో కొన్నిసార్లు అవి తమ శక్తిని కోల్పోతాయి. కొన్నిసార్లు వస్తు కణాల్లోంచి శక్తిని గ్రహిస్తాయి కూడా. అట్లా ఫోటాన్లలో వచ్చే శక్తి మార్పుని బట్టి, ఆ వస్తువులోని కణాలు ఏమిటనేది కనుక్కునేందుకు వీలు ఏర్పడుతుంది. కిరణాలు ఇలా విరజిమ్మబడుతూ తమ దైర్ఘ్యతని మార్చుకోవడం‌ రామన్ ఎఫెక్ట్ అనమాట" చెప్పాడు శేఖరం.

"అవున్రా శేఖరం, చాలా‌ బాగా చెప్పావు. ఆకాశానికి నీలం రంగు రావటం వెనక కాంతి కిరణాలు ఇలా విరజిమ్మబడటం ఉంది. బయటికి వచ్చే కిరణాలలో‌ శక్తి మార్పులు ఉంటే దాన్ని రామన్ స్కాటరింగ్ అనీ, అలా శక్తి మార్పులు లేనప్పుడు దాన్ని 'రేలీ' స్కాటరింగ్ అనీ‌ పిలుస్తుంటారు" చెప్పాడు తాతయ్య.

"హుం, ఇదంతా ఇప్పుడు ఎందుకు చెబుతున్నావు?" అడిగాడు బంటీ. వాడు అందరిలోకీ‌ తెలివైన వాడు. "ఎందుకంటే 1928 ఫిబ్రవరి 28వ తేదీన సీ.వీ.రామన్ తన పరిశోధనా ఫలితాలని వెలువరించాడు. దాన్ని గుర్తుచేసుకుంటూ ప్రతి ఏడాదీ ఫిబ్రవరి 28 ని మన దేశం 'జాతీయ సైన్సు దినోత్సవం' గా జరుపుకుంటుంది. ఆ రోజున అందరం మన జీవితాల్లో సైన్సు తెచ్చిన మార్పుల్ని గుర్తుచేసుకుంటాం. ఈ మాసమంతా శాస్త్రజ్ఞుల్నీ, వాళ్ళు కనుగొన్న విజ్ఞాన అంశాలనీ స్మరిస్తామన్నమాట. అందుకు!" నవ్వాడు తాతయ్య.

"నాకు సైన్సు ఇష్టం లేదు. తెలుగే ఇష్టం" అన్నాడు బంటీ ముద్దుగా.

"మా నాయనే!. నాక్కూడా తెలుగే ఇష్టం. తెలుగులోనైతే కథలుంటాయి!" అంది బామ్మ.

"కథలు, ఆటపాటలు, శాస్త్రజ్ఞానం, సామాజిక జ్ఞానం, భాషా జ్ఞానం, అన్నీ కావాల్సిందేగా, మనిషికి?! దేని ప్రాధాన్యత దానిదే. ఏదిలేకున్నా‌ జీవితంలో‌ చాలా‌ కోల్పోతాం!" అన్నాడు తాతయ్య, మళ్ళీ‌ ఆలోచనలో పడుతూ.

విజ్ఞానశాస్త్రాన్ని నిలిపేందుకు జీవితాన్ని వెచ్చిస్తున్న శాస్త్రజ్ఞులందరికీ సైన్స్ డే శుభాకాంక్షలతో,
కొత్తపల్లి బృందం.