ఆరోజు బిట్టు నిద్ర లేచేసరికి ఇంటి ప్రహరీ గోడ మీది నుండి ప్రక్కింటి వాళ్లతో మాట్లాడుతోంది అమ్మమ్మ. బిట్టుకు ఆశ్చర్యం వేసింది. ఆ ఇంట్లో ఎవరుంటారు? తను వచ్చి ఇన్నాళ్ళైంది కదా, ఇప్పటిదాకా ఆ ఇంట్లోవాళ్ళు ఎవ్వరూ తనకు కనిపించనే లేదు!

కొద్ది సేపటికి అమ్మమ్మ కబుర్లు పూర్తిచేసుకొని లోపలికి వచ్చింది కదా, అప్పుడు ఆవిడ చేతిలో అరటికాయలు కనిపించాయి బిట్టుకి. 'అవేమిటి? ఎక్కడివి?' అంటూ ప్రశ్నలు వేసాడు అమ్మమ్మని.

‘ప్రక్కింటి జయమ్మమ్మ వాళ్లు ఇన్నాళ్ళూ ఊరెళ్ళారు కదా, ప్రొద్దున్నే వచ్చారు. వాళ్ల పెరట్లో కాసాయట, అరటి కాయలు. మనకు కొన్ని ఇచ్చారు. వాళ్ల మనవడు, మనవరాలు రేపు వస్తున్నారుట, ఇల్లంతా శుభ్రం చేయించుకుంటున్నారు. పిల్లలు వచ్చాక వాళ్లని మనింటికి తీసుకొస్తానంది జయమ్మమ్మ. చిట్టి, దావీదులతో పాటు వాళ్ళు కూడా నీతో కలిసి ఆడుకుంటారు.’

అమ్మమ్మ మాటలతో బిట్టుకి క్రొత్త ఉత్సాహం వచ్చింది. కొత్త స్నేహితులొస్తున్నారనమాట! మధ్యాహ్నానికల్లా కొంచెం హడావుడి వినిపించి ప్రక్కవాళ్ల ఇంటి వైపుగా చూసాడు. ఓసారి వాళ్ళింటికే వెళ్లి చూసి వద్దామని కూడా అనుకున్నాడు. ఆ మాటే పైకి అనేసాడు; కానీ అమ్మమ్మ వెళ్లొద్దంది: ‘వాళ్ళు ఈ పూటే కదా వచ్చింది?! ఇల్లంతా సర్దుకునే హడావుడిలో ఉంటారు. నువ్వు వెళ్లి అడ్డం పడకు. రేపు కలవచ్చులే’ అని. సాయంత్రం నాలుగవుతోంది. ప్రక్క వాళ్ళింట్లో జయమ్మమ్మ కాబోలు, పెద్ద పెద్దగా ఏదో అంటోంది కమలమ్మతో. చిట్టి అక్కడే ఉంది, కమలమ్మ వెనకే.

అది చూసి బిట్టుకి ధైర్యం వచ్చింది. చిట్టిని పిలిచాడు. గోడ ప్రక్కగా నిలబడి ‘ఏమైంది, ఎందుకు. జయమ్మమ్మ గట్టిగా మాట్లాడు-తోంది?’ అని అడిగాడు.

"ఇక్కడ వీళ్ల ఇంటి వరండాలో పిచ్చుకలు గూడు కట్టాయి! పిచ్చుకలు గొడవ చేస్తున్నాయని, ఆ గూడును తీసెయ్యమం-టున్నారు" చెప్పింది చిట్టి.

బిట్టు గబగబా ఇంట్లోకి పరుగెత్తాడు. వాడి వెనకే రెయిన్బో గాడు కూడా.

బిట్టు అమ్మమ్మ దగ్గరికి వెళ్ళి అడిగాడు: ‘అమ్మమ్మా, మనం ఆ పిచ్చుకల్ని తెచ్చుకుందాం!’ అని. అమ్మమ్మ నవ్వింది. ‘అవి రెయిన్బో గాడి లాగా మనం రమ్మంటేనో, ఊరికే తీసుకొస్తేనో వస్తాయను-కున్నావా బిట్టు? మనం దగ్గరికి వెళ్ళామంటే చాలు- అవి ఎగిరిపోతాయి! జయమ్మమ్మ వాళ్లు ఊళ్లో లేరు కదా, అందుకని వాళ్ల బాల్కనీలో గూడు కట్టుకున్నాయవి. ఇప్పుడు వాటిని మనం అక్కణ్ణుంచి ఇక్కడికి తెచ్చినా కూడా అవి ఉండవు. చెల్లాచెదురైపోతాయి’ అంది. బిట్టుకి దిగులేసింది.

ఇంతలో జయమ్మమ్మ బయటికి వచ్చింది. ఆవిడ వెంటే కమలమ్మ, ఓ పిచ్చుక గూడుని తీసుకొచ్చి గేటు బయట పెట్టింది. మళ్ళీ ఇద్దరూ ఇంట్లోకి వెళ్ళిపోయారు.

బిట్టు అమ్మమ్మ వంక చూసి, ‘జయమ్మమ్మ ఇంట్లోకి వెళ్లిపోయింది కదా, నేను తెచ్చుకుంటా అమ్మమ్మా, అ‌ గూడుని?!’ అన్నాడు గుసగుసగా.

‘పొరుగువాళ్లతో గొడవలు తెచ్చుకోకూడదు బిట్టూ! సరే పోనీలే, ముందు దాని దగ్గరికి వెళ్ళి చూసిరా ఓసారి- గూట్లో ఏవైనా పిచ్చుక పిల్లలున్నాయేమో!’ అంది అమ్మమ్మ, సందేహిస్తూనే. బిట్టు నెమ్మదిగా ఆ గూడు దగ్గరకి వెళ్ళాడు. వాడిని గేటు బయట చూస్తూనే చిట్టి కూడా ప్రక్కింటి గేట్లోంచి బయటకొచ్చింది. ఇద్దరూ కలిసి చూస్తే ఆ గూటిలో బుల్లిబుల్లి పిచ్చుకలు ఉన్నాయి!

బిట్టుకి బోలెడు సంతోషం వేసింది. అసలు పిచ్చుకల్ని వాడు ఎప్పుడూ చూడలేదు. ఇప్పుడు ఇంత దగ్గరగా నిజం పిచ్చుకల్ని చూస్తుంటే వాడికి చాలా చాలా థ్రిల్లింగా ఉంది. అమ్మమ్మ దగ్గరకి పరుగెత్తాడు మళ్ళీ.

‘అమ్మమ్మా, ఆ పిచ్చుకగూట్లో బుజ్జి పిల్లలున్నాయి. మనింట్లోకి తెచ్చి పెంచుదాం అమ్మమ్మా’ అన్నాడు ఆశగా. దాంతో అమ్మమ్మ మణి కూడా వాకిలి దాకా వచ్చి, ఆ గూటిని తీసుకుని తాతమ్మ గది వరండాలో పెట్టింది. ఆ పైన వంటింట్లో కూరల కోసమని ఉన్న ఓ వెదురు బుట్టని ఖాళీ చేసి, దాన్ని అక్కడ తగిలించి, దానిలో ఆ పిచ్చుకల గూడుని పెట్టింది. ప్రక్కనే చిన్న పళ్లెంలో కొన్ని గింజలు కూడా పెట్టింది.

తాతయ్య వచ్చాక ఆ పిచ్చుకల పోషణ గురించి అడగాలని ఎదురుచూస్తున్నాడు బిట్టు. తాతయ్య రాగానే ‘తాతయ్యా, ఈ రోజు నువ్వు, నేను సైక్లింగ్ కి వెళ్లటం లేదు. మనకి ఒక పెద్ద పని ఉంది, రా, చూపిస్తాను’ అంటూ ఆయన్ని లాక్కుపోయి, పిచ్చుక పిల్లల్ని చూపించాడు.

ఇంట్లోకి ఇంకో క్రొత్త సందడి వచ్చిందని తాతయ్యకు సంతోషం వేసింది. ఆయన స్నానం చేసి కాఫీ త్రాగి తీరిగ్గా వాటిని పరిశీలించారు:

‘ముందుగా మనం ఈ పిచ్చుకలకి తినేందుకు కొన్ని ధాన్యం గిజలు, మంచినీళ్లు ఒక పళ్లెంలో పెట్టి, వెంటనే ఇక్కణ్ణుంచి వెళ్లిపోవాలి. వాటి అమ్మా, నాన్న వెతుక్కుంటూ ఉంటాయి వాటికోసం’ అని చెప్పి అందరినీ తీసుకుని ముందు వరండాలోకి వచ్చారు తాతయ్య.

‘తాతయ్యా, వాటికి మనం ఏం తినిపించాలి? అసలు నాకు పిచ్చుకల గురించి ఏమీ తెలియదు, వాటి గురించి అన్ని విషయాలు చెప్పు తాతయ్యా’ బిట్టు కుతూహలం చూసి తాతయ్య హుషారుగా చెప్పటం మొదలెట్టారు. అందరూ ఆయన చుట్టూ చేరారు.

‘ఏవైనా గింజలు పెట్టచ్చు. అవైతే మొక్కల మొదళ్లలో చిన్న చిన్న పురుగుల్ని ఏరుకుని తింటుంటాయి. మా చిన్నప్పుడు ఊరంతా బోలెడు పిచ్చుకలు ఉండేవి. కరెంటు తీగల మీద బారులుగా కూర్చుని కిచకిచమని అల్లరి చేస్తూ ఉండేవి. మా పల్లెటూళ్లో రైతులంతా వాళ్ల ఇళ్ల ముందు ధాన్యపు కంకుల్ని గుత్తులుగా వ్రేలాడగట్టేవాళ్లు. ఈ పిచ్చుకలు, వేరే రకాల పక్షులు కూడా వచ్చి, వాటిని తింటూ, ఇల్లంతా సందడి చేస్తూ ఉండేవి.

ఇళ్ల మధ్య పెరిగే పిచ్చుకలు కొన్ని ఉంటాయి; అవి ఏవి అందుబాటులో ఉంటే వాటిని తింటుంటాయి. చిన్నప్పుడు మా భోజనాలు అయ్యాక, పెరట్లో బావి గట్టున ఖాళీ గిన్నెలు, కంచాలు పెడితే, వాటి చుట్టూ ఉన్న అన్నం మెతుకులు ఏరుకుని తినేవి ఇవి. సాధారణంగా పెంకుటిళ్ల చూరుల్లో గూళ్లు కట్టుకొని ఉండేవి ఇవి. వాటి కిచకిచ శబ్దాలు "ఎంత బావుండేవో!” వాటినే వింటూ పెరిగేం, మేమంతా.

ఇప్పుడు మటుకు ఈ పిచ్చుకలు ఏమంత ఎక్కువగా కనిపించటం లేదు. పోయిన ఇరవైఐదేళ్లలో పిచ్చుకల సంఖ్య దాదాపు సగానికి సగం తగ్గిపోయిందట! ఇప్పుడిప్పుడే అందరూ అనుకుంటున్నారు, వాటిని సంరక్షించుకోవాలని.

మీకో తమాషా చెప్పనా? ఈ మధ్య ఉత్తర ప్రదేశ్, ఒరిస్సా లాటి రాష్ట్రాల్లో పిచ్చుకల్ని జాగ్రత్తగా కాపాడు కునేందుకు వాటికి పెళ్లిళ్లు కూడా చేసారు కొందరు. వాటి కుటుంబాల్ని సంరక్షించి వాటి సంఖ్యని పెంచేందుకు కృషి చేస్తున్నారు.

పిచ్చుకల ప్రత్యేకత ఏంటంటే, అవి పల్లెల్లోనూ, పట్టణాల్లోకూడానూ జీవించ-గలవు. అవి ఉండే వాతావరణాన్ని బట్టి, ఏ ఆహారం అందుబాటులో ఉంటే ఆ ఆహారాన్ని తిని జీవించగలిగే తెలివైన పక్షులవి.

ఆడ పిచ్చుకలేమో లేత గోధుమ రంగులో ఉంటాయి; మగ పక్షులు నలుపు, తెలుపు, గోధుమ రంగుల్లో- ప్రత్యేకించి కనబడే చారలతో ఉంటాయి.

పిచ్చుకలు గనక దొరికితే, వాటిని పిల్లులు, గుడ్ల గూబలు, గ్రద్దలు ఎత్తుకుపోయి తినేస్తాయి! కొందరు మనుషులు కూడా పిచ్చుక మాంసాన్ని వండుకుని తింటారు’ అని తాతయ్య చెబుతుంటే ఆ వివరాలని అందరూ శ్రధ్ధగా విన్నారు.

'తాతయ్యకి ఎన్ని విషయాలు తెలుసో!’ అని బిట్టు మురిసిపోయాడు. "అమ్మకి చెప్పాలి. రెయిన్బో గాడితో పాటు పిచ్చుక పిల్లల్ని కూడా పెంచుతున్నామని చెప్పాలి" గర్వంగా అనుకున్నాడు.

‘అవి ఎప్పుడు పెద్దవుతాయి తాతయ్యా?’ ఆత్రంగా అడిగాడు.

‘పిచ్చుక గుడ్లలోంచి 11 రోజుల్లో పిల్లలు బయటికి వస్తాయి. అయితే పుట్టగానే వాటికి రెక్కలు ఉండవు. రెక్కలు పెరిగేందుకు కనీసం రెండు వారాలు పడుతుంది. ఆ తర్వాత అవి మెల్లిగా గూడును వదిలి ఎగిరే ప్రయత్నం చేస్తాయి. ఆ ప్రయత్నంలో ఒకటి - రెండు రోజులు పూర్తిగా నేల మీదే తిరుగుతాయి కూడా. అట్లా ఒక వారం పది రోజుల్లో స్వంతంగా ఎగిరే శక్తి వస్తుందనమాట వాటికి.

అయినా అవి పెద్దవైతే ఎగిరిపోతాయి కదా, నీతో పాటు ఉండమంటేనూ, నీ వెనకే ఇంట్లో తిరగమంటేనూ అవి తిరగవు. అయితే వాటిని మన వరండాలో రోజూ చూడాలంటే ఒక పని చెయ్యచ్చు. రోజూ వాటికోసం గింజలు, మెత్తని పండు ముక్కలు, చిన్నచిన్న పురుగులు, మంచినీళ్లు అందుబాటులో ఉంచితే మళ్లీ మళ్లీ మన బాల్కనీలోకి వచ్చి ఉంటాయవి. అయితే అవి గూడు కట్టుకున్నప్పుడు దానిని మనం ముట్టుకోకూడదు. అవి మళ్లీ గుడ్లు పెడతాయి, కానీ రెయిన్బోగాడిలాగా నీతో ఆడుకోవు మరి‘ తాతయ్య నవ్వుతూ చెప్పాడు.

అన్నీ గమనిస్తున్న తాతమ్మ మెల్లగా వీళ్ళ దగ్గరికి వచ్చింది: ‘ఏమర్రా, నా వరండాలో పెట్టారు, పిచ్చుకల గూడు? అవి అల్లరి చేసి నా నిద్ర చెడగొడతాయి!’ అంది.

ఆవిడ మాటలకి అందరూ నవ్వేశారు. ‘వాటి అల్లరి నీకు ఎక్కడ వినపడుతుందే అమ్మా?’ అన్నాడు తాతయ్య గట్టిగా, తాతమ్మకు వినిపించేట్లు. ‘నిజమేరా!’ అంది తాతమ్మ.

‘మీ వరండాలో పిల్లలు ఎక్కువగా మసలరు కనుక పిచుకలు బెదిరిపోవు. అందుకని అలా ఏర్పాటు చేసేను’ అని అమ్మమ్మ ఆవిడకి వివరంగా చెప్పింది.

బిట్టుకి ఆరోజు చాలా సంతోషంగా ఉంది. అందరూ వెళ్లాక తన కవితల పుస్తకం తీసి పిచ్చుకల మీద ఓ కవిత రాసుకున్నాడు:

అమ్మ పిచ్చుక గోధుమ రంగు,
నాన్న పిచ్చుక చారల నలుపు, తెలుపు,
పాపాయేమో గులాబి రంగు!
ఎక్కణ్ణించి ఎగిరెగిరొచ్చాయి?
ప్రకృతి వాటిని చేసిందా?
తేనె రంగులో ముంచిందా?
మాటలు, పాటలు, ఆటలు వచ్చు!
అల్లరి కూడా వాటికి వచ్చు!
ఇంకా ఏమిటో రాయాలని అనుకున్నాడు గానీ, నిద్ర వచ్చేసి వెళ్లి మంచం మీద నిద్రలోకి జారిపోయాడు.

(మిగతాది మళ్ళీ వచ్చే మాసం ....)