ఏదో అయింది చిట్టి పిల్లికి.
అమ్మ పాలే తాగుతోంది ఇంకా.
ఎలుకలు కనిపించినా వాటి వెంట పరిగెత్తట్లేదు.
"పిచ్చిది! ఎట్లా బతుక్కుంటుందో ఏమో! కనీసం ఎలుకల వెంటపడటం కూడా రాదు!" అని విచార పడింది అమ్మ పిల్లి
అయినా ఏమీలాభం లేదు. చిట్టిపిల్లి మారలేదు. "ఇకతప్పదు" అని ఒక రోజున అమ్మ దాన్ని డాక్టరు పిల్లి దగ్గరికి తీసుకెళ్లింది.
డాక్టరు పిల్లి దాన్ని పరీక్షించింది: ఎలుకనొక దాన్ని ఆ గదిలో వదిలి చూసింది. చిట్టిపిల్లి బిక్క మొఖం వేసుకొని కూర్చున్నది తప్ప, కదల్లేదు - మెదల్లేదు.
"నిజమే చిట్టి పిల్లికి ఏదో అయింది" అని తేల్చింది డాక్టరు. ఆకలి పెరిగేందుకు మందులు రాసింది.
చిట్టిపిల్లి ఇప్పుడు అమ్మపాలు ఇంకా ఎక్కువ తాగుతోంది.
అమ్మ ఇంకా బక్కగా అయ్యింది.
"ఇదేంటి?! ఎలుకల్ని పట్టి తినే వయసొచ్చినా ఇంకా నా మీదే ఆధారపడుతోంది? దీనికి పాలివ్వలేక నాపని అవుతోంది. ఇక నావల్లకాదు!" అని ఓరోజున తనకు ఎదురైన అవ్వపిల్లితో మొరపెట్టుకున్నది అమ్మ.
అనుభవం గల అవ్వ పిల్లి నవ్వింది: "పిచ్చిదానా! తప్పంతా నీలోనే ఉంది. నువ్వు దానికి ఎలుకల వెంట పడటం అసలు నేర్పనే లేదు కదా! ఆ పనిలో ఎంత మజా ఉంటుందో ఏమాత్రం తెలీదు దానికి! అందుకని, ఓ పని చెయ్యి- అది చూస్తూండగా ఎలుకల్ని పట్టుకో నువ్వు. నువ్వు చేసే ఆ పనిలో చాలా ఉత్సాహం, పట్టుదల చూపించాలి. నిన్ను చూసి దానికి ఉత్సాహం రావాలి. ఒక్కసారి అట్లా ఆ పనిలో సంతోషం ఉందని అర్థమైతే ఇంక మీ పిల్ల నీ వెంట ఉండమన్నా ఉండదు. ఎప్పుడూ ఇంక ఎలుకల వెంటే పోతుంది-ప్రయత్నించు!" అన్నది.
అమ్మ పిల్లికి ఆ మాట నచ్చింది. వెంటనే అమలు పరచింది.
వారం తిరిగే సరికల్లా చిట్టి పిల్లి మారి పోయింది! ఇప్పుడది రోజుకు ఓ పది ఎలుకల్ని, తొండల్నీ పడుతున్నది. పాలకోసం అమ్మని వేధించటం అయితే పూర్తిగానే మానేసింది!
పిల్లలు కూడా ఇంతే. వాళ్లు చేసే పనుల్లోనూ, చదివే చదువుల్లోనూ సంతోషం ఉందని అర్థమైందంటే, అప్పుడిక వాళ్లని ఆపేదంటూ ఏదీ ఉండదు; చదవమని వెంటపడే అవసరమూ ఉండదు; వాళ్ల ఆరోగ్యం కోసం, వాళ్ల ఆనందం కోసం వాళ్లు పని చేస్తారు!
ఎటొచ్చీ ఆ పనుల్నీ, చదువుల్నీ ఉత్సహభరితాలుగా తీర్చిదిద్దటం పెద్దల బాధ్యత, మరి.
పిల్లల పనుల్ని, చదువుల్నీ అట్లా తీర్చిదిద్దుతున్న పెద్దలకు నమస్కారాలతో,
కొత్తపల్లి బృందం.