బాంబే, ఒక హైటెక్ సిటీ. అందులో పేరుమోసిన సర్కస్ ఒకటి ఉంది. అందులో ఎన్నో జంతువులు- రకరకాల ట్రిక్స్ చేసేవి- ఉండేవి. ఉయ్యాలలూగే కోతులు, నవ్వించే ఒరాంగుటాన్, వివ్యాసాలు చేసే పులి- ఇవన్నీ చూసేందుకు పిల్లలు ఎగబడే వాళ్ళు. ఆ సర్కస్ తమ ఊరు వచ్చిందంటే జనాలకు పండుగలాగా ఉండేది.
కానీ ఎవరికీ తెలియని విషయం ఒకటి ఉంది: ఆ సర్కస్ లో జంతువులను హింసిస్తారు.
"హింసించకపోతే కౄరమృగాలు మాట వినవు! వాటి చేత మాట వినిపించాలంటే వాటికి అన్నం పెట్టకుండా మాడ్చాలి! కొరడాలతో కొట్టాలి!" అని వాళ్ల నమ్మకం. ఆ నమ్మకంలో కొంత నిజం ఉంది కూడాను.
సర్కసులో ఉన్న అనేక జంతువుల్లో ఒక ఏనుగు కూడా ఉండేది. దాని పేరు మోనా.
ఒకసారి సర్కస్ నడిపే మాస్టర్ చెప్పిన మాట వినలేదని దాన్ని ఒక మూలన కట్టి పడేసాడు, మేత-నీళ్ళు ఏమీ ఇవ్వకుండా మాడ్చాడు. దాంతో అప్పటికే కడుపుతో ఉన్న మోనా పాపం, ఒక బిడ్డను కని, చనిపోయింది!

ఆ బిడ్డకు 'రాక్' అని పేరు పెట్టారు.
చిన్నపిల్ల అని జాలి, దయా కూడా లేకుండా, ఇంకా సరిగ్గా నడవటం కూడా రాకముందే, తాడు మీద, సన్న సన్న గోడల మీద నడిచే శిక్షణనివ్వటంం మొదలు పెట్టారు దానికి. అయితే అది చాలా మంచిది- త్వరలోనే తాడు మీద నడిచే విద్యను నేర్చేసుకున్నది.
"ఏనుగుపిల్ల చాలా బాగా నడుస్తుందట!" అవి సర్కస్ వాళ్ళు ప్రచారం చేసుకున్నారు. దాంతో 'రాక్'ని చూసేందుకే సర్కస్‌కు వచ్చే జనాలు ఎక్కువైనారు.
అయినా 'రాక్' కు హింస తప్పలేదు. మరిన్ని కొత్త విద్యలు నేర్చుకోవాలని మాస్టర్లు దాన్ని బలవంత పెడుతూనే ఉన్నారు.
విసిగిపోయిన 'రాక్' ఒక రోజున సర్కస్ నుండి తప్పించుకొని పారిపోయింది!

సర్కస్ లోంచి అయితే బయటికి వచ్చింది గానీ, రాక్ కు ఎటుపోవాలో తెలీదు. జనాలు ఎవ్వరికీ దాని భాష, దాని బాధ తెలియదు. అయితే దాని అదృష్టం కొద్దీ అది ప్రముఖ వైల్డ్ ఎక్స్ పర్ట్ 'రాణి' కంట పడింది.
రాణికి జంతువులంటే ప్రేమ. వాటి భావం, వాటి కన్నీటికి అర్ధం తెలుసు ఆమెకు. ఆమె 'రాక్' పై ఉన్న వాతల్ని, దాని కన్నీటి చారల్ని చూసి దాన్ని అర్థం చేసుకున్నది.
దానితో స్నేహం చేసింది, పరిశోధించి, దాని వివరాలన్నీ‌ కనుక్కున్నది. ఎవ్వరూ దాన్ని హింసించకుండా అడ్డుకున్నది. "దాన్ని, దానిలాంటి ఇతర జంతువులను కాపాడాలి" అని పత్రికల్లో రాసింది.

సర్కస్ కంపెనీలు ఆమెకు వ్యతిరేకంగా చాలా ప్రచారం చేసాయి కానీ, చివరికి రాణి మాటల్లో సత్యం ఉందని అందరూ గ్రహించారు.
గవర్నమెంటు వారు కూడా 'ఆనిమల్ రైట్స్'ని గుర్తించారు.
'మానవులు తమ వినోదం కోసం జంతువులను ఆడించరాదు' అని చట్టం వచ్చింది. సర్కస్‌లలో 'జంతువులని వాడుకోవటం' అనే దురాచారానికి తెర పడింది. ఆనాటి నుండీ‌ సర్కస్‌లలో జంతువులను ఆడించి సొమ్ము చేసుకోవటం తగ్గిపోయింది!