కొండల మధ్యలో ఒక ఊరు ఉండేది. ఈత, తాటి, కొబ్బరి చెట్లతోటీ, పూల మొక్కలు-కూరగాయల పంటల తోటీ ఆ ఊరు చాలా అందంగా ఉండేది. ఊళ్ళో‌ పిల్లలంతా వాళ్ల అమ్మానాన్నలకు పనుల్లో‌ సాయం చేసేవాళ్ళు. తండ్రులు పంటలు పండించేవాళ్ళు; పిల్లలు పూలు కోసేవాళ్ళు; తల్లులు వాటిని అమ్ముకొచ్చేవాళ్ళు.


అమ్మా నాన్నలు పనులకు వెళ్లగానే, పిల్లలందరూ ఆటలకు పోయేవాళ్ళు. కొందరు తేనెటీగల వెంబడి, కొందరు ఈతకాయల వెంబడి, కొందరు గట్లు, చేన్ల వెంబడి.కొందరు చెట్లకు ఉయ్యాలలు కట్టి, ఎగురుకుంటూ, గంతులు వేసుకుంటూ, ఆటలాడుకుంటూ సంతోషంగా ఉండేవాళ్ళు. అయితే పెద్దవాళ్ళెవ్వరికీ సమయంలేదు- పిల్లలకు మంచి-చెడు నేర్పేందుకు.
ఓ సాయంకాలం పూట ఊరికి దగ్గర్లోనే ఒక పాము, పిల్లి కొట్లాడుకోవటం మొదలుపెట్టినై. పిల్లలు వాటి చుట్టూ మూగి చూస్తూ చప్పట్లు కొడుతున్నారు. అంతలోనే పిల్లి వెనక్కి తిరిగి పారిపోయింది. పాము దాని వెనకనే పరుగెత్తి, దగ్గర్లో‌ని ఒక గుడిసెలోకి దూరింది.

పిల్లలంతా చెల్లా చెదరైపోయారు. 'పాము పాము!' అని కేకలు పెట్టారు. అయితే వాళ్ల అరుపులు వినేందుకు పెద్దవాళ్ళెవరూ ఊళ్ళో లేరుగా?
"మొన్న ఓసారి కంపల్లో పాము కనబడితే మా నాయన కంపకు నిప్పు పెట్టాడు!" అన్నాడొక పిల్లవాడు.
"పాముకు మంట అంటే భయం" అన్నాడు ఒకడు. ఇంకేముంది, పిల్లలంతా ఉత్సాహంగా పోయి, నిప్పులు తీసుకొచ్చి పాము దూరిన గుడిసెకు అంటించారు.

గుడిసె అంటుకొని భయంకరంగా మండుతోంది. పనులు పూర్తి చేసుకొని ఇళ్ళకి వస్తున్న పెద్దవాళ్ళంతా దాన్ని చూసి కంగారు పడ్డారు. గబగబా నీళ్ళు తీసుకొచ్చి మంటలను ఆర్పారు.
పిల్లల్ని పిలిచి కూర్చోబెట్టుకొని అడిగి జరిగిన సంగతి తెల్సుకున్నారు.
'చదువులు లేకపోతే ఇలాంటి సమస్యలు చాలా వస్తాయి' అని అర్థమైంది వాళ్లకి. 'దగ్గర్లో పెద్దవాళ్ళెవ్వరూ లేకుండా పిల్లల్ని మాత్రమే అట్లా ఒంటరిగా ఒదలకూడదు' అని కూడా తెలిసింది. అటుపైన వాళ్లంతా కలిసి ఊళ్ళో పిల్లలకు చదువు-మంచి చెడ్డలు నేర్పేందుకు బడి ఒకటి పెట్టుకున్నారు.