అనగనగా ఒక ఊళ్లో వెంకట్రావు అనే లారీ డ్రైవరు ఒకడు ఉండేవాడు. అతనికి ఒక సొంత లారీ ఉండేది. దూరప్రాంతాల అడవుల్లో ఏపుగా పెరిగిన వెదురును కొట్టించటం, లారీలో ఆ వెదురును తీసుకొచ్చి, తమ పట్నంలోని వ్యాపారులకు అమ్మటం అతని వృత్తి. అట్లా ఒకసారి వెదురు కోసం వెతుకుతూ వెతుకుతూ అతను దారి తప్పి, ఎక్కడికో వెళ్ళిపోయాడు. అక్కడ అర్థంతరంగా అతని లారీ ఆగిపోయింది. ఎంత ప్రయత్నించినా ఇక కదలలేదు.
సమయం సాయంత్రం 6:30 అవుతున్నది. కీకారణ్యం, ఇప్పట్లో వేరే ఏ వాహనమూ అటువైపుకు వచ్చే అవకాశం లేదు. అతను చాలా నిరాశ పడిపోయాడు.
పైపెచ్చు దగ్గరినుండే ఏనుగుల ఘీంకారాలూ, సింహాల గర్జనలూ వినబడుతున్నాయి. చీకటి పడుతుండగా వెంకట్రావుకు భయం వేసింది. లారీలో పడుకోవచ్చు; కానీ 'ఏ ఏనుగులో వచ్చి, లారీతో సహా తనను నెట్టేస్తే?' అన్న ఊహ ఒకటి అతనికి నిద్రపట్టనివ్వలేదు.

ఆ గందరగోళంలో అతను కొంత సేపు బయట ఓ చెట్టు మీద పడుకునేందుకు ప్రయత్నించాడు. 'కొండచిలువలు చెట్ల మీదే ఉంటాయట-' అని ఆలోచన మొదలైంది. ఇక రాత్రంతా నిద్రలేదు.
బారెడు ప్రొద్దెక్కాక కళ్ళు తెరవిన వెంకట్రావుకు తనవైపే చూస్తున్న ఋషి ఒకడు కనిపించాడు. అతను వెంటనే చెట్టు దిగి ఋషిని చేరి, 'స్వామీ! ఇది నా లారీ. నేను, నా లారీ ఇద్దరం ఈ అడవిలో ఇరుక్కుపోయాం. రాత్రంతా భయం గుప్పిట్లోనే బ్రతికాం- దగ్గర్లో జనావాసాలు ఏమున్నాయో తెలీదు- కాపాడండి' అని మొత్తుకున్నాడు.
"నాయనా! ఇక్కడికి దగ్గర్లో మానవసంచారం ఉండే ప్రాంతాలే లేవు. నువ్వు అడవిలో చాలా దూరమే వచ్చినట్లున్నావు. సాధారణంగా ఇటువైపుకు మనుషులు ఎక్కువగా రారు- నీ లారీకి మరి ఏం సమస్య వచ్చిందో ఏమో, పరిష్కారం నువ్వే కనుక్కోవాలి. ఏమంటే, ఆ సమస్య తీరేవరకూ నువ్వు నాతోపాటు ఉండచ్చు; నేను పెట్టేదేడో తినచ్చు; ఇక్కడే ఏ గుహలోనో పడుకోవచ్చు!" అన్నాడు ఋషి.
"సరే" అన్నట్లు తల ఊపాడు వెంకట్రావు. "సరే మరి. కొంచెం ఆగు- నీకోసం ఏమైనా తెచ్చిపెడతాను" అని ఋషి వెళ్ళి కొన్ని 'స్వీట్స్‌' తీసుకొచ్చాడు. బాగా ఆకలిగొని ఉన్నాడేమో, వెంకట్రావు ఆవురావున తినేసాడు అన్నిటినీ.
ఆ తర్వాత ఋషి మంచి భోజనం తెచ్చి పెట్టాడు. దాన్ని తిన్న వెంకట్రావుకు అది అమృతమే అనిపించింది. భోజనం చేసి కొంత సేపు విశ్రాంతి తీసుకున్నాక, లారీ రిపేరు మొదలు పెట్టుకున్నాడు వెంకట్రావు.
ఋషి తన మాటను నిల్పుకున్నాడు. ప్రతిరోజూ మూడుపూటలా చక్కని ఆహారం తెచ్చిపెట్టాడు. ప్రతి పూటా ఏవో కొన్ని స్వీట్లు కూడా తెచ్చేవాడు. వెంకట్రావు కూడా లారీ సమస్యను పరిష్కరించేందుకు చిత్తశుద్ధితో పని చేసాడు. అలా ఐదారు రోజులు గడిచాయి.
ఆ రోజున ఋషి అతనికోసం చక్కని ఆపిల్ పళ్ళు తీసుకు వచ్చాడు. వెంకట్రావు వాటిని తీసుకొని, "అయ్యా! తమరు నాకు ఇంత మంచి భోజనం పెడుతున్నారు; రోజూ స్వీట్లు కూడా తెచ్చి ఇచ్చారు- ఇప్పుడు ఈ‌ ఆపిల్ పళ్ళు! ఇవన్నీ అడవిలో దొరికేవైతే కాదు. చూడగా తమరికి ఏవో‌ మహిమలు ఉన్నాయని నాకు అనిపిస్తుంది. అవేవో నాకూ నేర్పండి" అని ప్రాధేయపడ్డాడు.
"నాయనా! ఏ పనైనా స్వయం కృషి వల్ల జరగాల్సిందే తప్ప, మహిమలు ఎవరికీ మేలు చేసి ఉండలేదు ఇప్పటివరకూ. లేకపోతే నీ‌ లారీని నేనే బాగుచేసి ఉండనా? నేను చాలా మామూలు మనిషిని" అన్నాడు ఋషి మరలిపోబోతూ.
కానీ వెంకట్రావు వదల్లేదు. ఆ రహస్యం తనకు చెప్పాల్సిందేనని పట్టుబట్టాడు.
చివరికి ఋషి రహస్యం‌ చెప్పేసాడు- "బాబూ! ఇక్కడికి కొద్ది దూరంలో ఒక 'ఆశల చెట్టు' ఉంది. ఆ చెట్టు క్రింద నిలబడి ధైర్యంగా ఎవరు ఏం కోరితే దాన్ని ఇస్తుందది. అయితే అనుమానిస్తే మటుకు, ఆ అనుమానాల్నే నిజం చేస్తుంది- జాగ్రత్తగా ఉండాలి! అంతేకాక, అది సృష్టించే వస్తువులు ఉండేది కొన్ని గంటలపాటు మాత్రమే. కొద్ది సేపట్లో అన్నీ మాయమైపోతాయి" అని.
ఆయన చెప్పిన గుర్తుల్ని పట్టుకొని వెంకట్రావు ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి "నా లారీ బాగైపోయి, దానిలో పట్టేంత వెదురు రావాలి" అని కోరుకున్నాడు. మరుక్షణం‌ లారీ బాగైంది; దాని నిండా వెదురు తయారైంది!

వెంకట్రావు ముఖం వెలిగింది. "ఋషి బలే మోసం వాడు. ఆయన ఈ సంగతినేదో ముందుగానే చెప్పి ఉంటేనేమి?!" అనుకున్నాడు. లారీ ఎక్కి బయలుదేరుతూండగా "ఈ లారీ బాగుండేది మరో కొద్ది గంటలు మాత్రమే. ఆలోగా అడవి దాటకపోతే మరెలాగ?"; "మరి ఈ లారీలోని వెదురుకూడా, ఉండేది కొద్ది గంటలే కదా?! ఆ తర్వాత అది మాయమైపోతుంది! ఏం లాభం?" అని, అతనిలో ఆలోచనలు మొదలయ్యాయి.
దాంతో అతను ఒక నిశ్చయానికి వచ్చి, మళ్ళీ చెట్టు దగ్గరికి వెళ్ళి నిలబడ్డాడు: "నువ్వు కూకటి వ్రేళ్లతో సహా పెకిలి, నా లారీలోకి వచ్చేయాలి" అని కోరుకున్నాడు.
మరుక్షణం చెట్టు వ్రేళ్లతో సహా పైకి లేచి, అప్పటికే వెదురుతో నిండుగా ఉన్న లారీపైకి వచ్చి కూర్చున్నది. లారీ ధబుక్కున అణిగిపోయింది, అయితే మురిసిపోతున్న వెంకట్రావు దాన్ని గమనించే దశలో లేడు- లారీని అతను ఇప్పుడు చాలా ఉత్సాహంగా బయలుదేరదీసాడు- "ఈ చెట్టు ఇక నాతోటే ఉంటుంది. నేను దీన్ని వెనక్కి పోనివ్వను. మా ఇంట్లో‌ నాటుకుంటాను. ఎన్నంటే అన్ని కోరికలు తీర్చుకుంటాను! నన్ను మించిన వాడు లేడు!" అనుకుంటూ.
అయితే బరువు ఎక్కువైన లారీ ముందుకు కదలకపోవటమే కాదు, అటూ ఇటూ ఊగటం కూడా మొదలు పెట్టింది...
"అయ్యో! పల్టీ కొడుతుందా, ఏంటి?" అనుకున్నాడు వెంకట్రావు కంగారుగా. అంతే! క్షణంలో లారీ పల్టీ కొట్టింది. వెదుర్లన్నీ మీద పడిన వెంకట్రావు ఇక లేవలేదు!
ఆశల ఆ చెట్టు మటుకు దొర్లి క్రింద పడింది- కొద్ది సేపట్లో‌ మళ్ళీ ఎక్కడుండేది అక్కడికి చేరుకున్నది!