నల్లమల అడవులలో సంభి అనే గిరిజన గ్రామం ఉండేది. అక్కడి గిరిజనులు ధైర్యసాహసాలకు పెట్టింది పేరు.
నల్లమల అడవులలో ప్రకృతి ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది. పచ్చని ఎత్తైన చెట్లు, గుబుర్లతో నిండిన కొండలు, లోయలు, అక్కడక్కడా జలపాతాలతో వాతావరణం మనోహరంగా ఉంటుంది.
అయితే దట్టమైన అడవి కాబట్టి అక్కడ పులుల భయం కూడా ఎక్కువే. సామాన్యంగా అడవులలో తిరిగే పులులు, ఒక్కోసారి నీళ్ళ కోసమనో, అడవులకు నిప్పు అంటుకోవటం వల్లనో తాము మామూలుగా తిరిగే ప్రాంతాలను వదిలి, జనావాసాలలోనికి వస్తుంటాయి. ఒకసారి వచ్చాక, అవి తిరిగి అడవిలోకి వెళ్ళక, సమస్యలై కూర్చుంటాయి.
ఒక సమయంలో అట్లా ఒక పులి వచ్చింది.
గిరిజనులు పెంచుకునే ఆవులనూ, మేకలనూ చంపి తినటం మొదలు పెట్టింది. ఒంటరిగా దొరికితే పిల్లల్ని, ముసలివాళ్లని వదలట్లేదు. ప్రజలు సుఖంగా నిద్రపోక చాలా రోజులయ్యింది, ఆ పులి వల్ల!

సామాన్యంగా అడవి జంతువులతో ఒక రకమైన సమత్వాన్ని పాటించే ఊళ్ళోవాళ్ళు కూడా ఇప్పుడిప్పుడే ఒక నిర్ణయానికి వస్తున్నారు- 'పులిని చంపాలి, లేదా పట్టి బంధించాలి' అని.
ఆ గిరిజన తాండాకు చెందిన కృష్ణ అనే అబ్బాయి పట్టణంలో చదువుకునేవాడు. వాళ్లకు ఉండే రెండు గొర్రెల్నీ పులి ఎత్తుకుపోయింది. దాంతో వాడు ఊరి పెద్దలతో చర్చలు పెట్టుకున్నాడు. "చంపేద్దాం పట్టు" అన్నారు కొందరు. "ముందు దాన్ని ప్రాణాలతో పట్టుకునే ప్రయత్నం చేద్దాం. ఫారెస్టు వాళ్ళతో గొడవ లేకుండా ఉంటుంది. అంతగా కాకపోతే ఇక మీరు చెప్పినట్లు చేద్దాం" అన్నాడు కృష్ణ.
ఊళ్ళో వాళ్ళు అంతా కలిసి ఒక పెద్ద బోను తయారుచేసి, ఊరి ముందు పెట్టారు. పులిని ఆకర్షించేందుకుగాను ఆ బోనులో ఒక మేకను కూడా పెట్టారు.
అయితే పులి తెలివైనది. ఊళ్ళో జనాల ఇళ్లలో ఉన్న మేకల్ని ఎత్తుకు పోతున్నది గాని, బోనులో పెట్టిన మేక కోసం రావట్లేదు.

ఊరిలో చాలామందికి పులుల్ని పట్టిన అనుభవం ఉంటుంది. అట్లా అనుభవం ఉన్న ఒకాయన చెప్పాడు : "పులిని చంపాలంటే వాటి దగ్గరికి మనం వెళ్ళాలి, ఊరికే వాటిని రమ్మంటే అవి రావు" అని.
దానిని అనుసరించి, బోను ఉండే స్థలాన్ని అడవి లోపలికి మార్చాడు కృష్ణ.
చదువుకున్నవాడు కాబట్టి, పులి అడుగుజాడలు ఉన్న ప్రదేశాలని మ్యాపు మీద గీసి, దాని స్థావరం ఎక్కడ ఉండచ్చో ఊహించాడు. ఆ స్థానానికి, ఊరికి మధ్యలో బోనును పెట్టించాడు. "ఇవాళ్ళే పులి దొరికేది" అంటూ ఊరి వాళ్లని ఆ చుట్టు ప్రక్కల చెట్లమీదికి ఎక్కించాడు. తను బల్లెం పట్టుకొని, పులిని వెతుక్కుంటూ అడవిలోకి పోయాడు.

అతని ఊహ నిజమే అయ్యింది: కొద్ది దూరం పోయే సరికే అతనికి పులి ఎదురైంది. కృష్ణ చటుక్కున వెనక్కితిరిగి ఊరివైపుకు పరుగు మొదలు పెట్టాడు. రెచ్చిపోయిన పులి గర్జిస్తూ అతని వెంట పడింది. కృష్ణ ఆ తుప్ప మీదినుండి, ఈ మొక్క మీదినుండి దూకి, చివరికి బోను దగ్గరకు వచ్చి, బోను ముందే నిలబడ్డాడు. చెట్లమీద బల్లేలతో కూర్చున్న పల్లెవాళ్ళు నివ్వెరపోయారు. పులి గట్టిగా గాండ్రించి ఒక్కసారిగా కృష్ణ మీదికి దూకింది!
అయితే ఆ అదను కోసమే నిలబడ్డ కృష్ణ, చటుక్కున పక్కకు వంగాడు. పులి నేరుగా బోనులో పడ్డది!
అతని ధైర్య సాహసాలను ఊళ్ళోవాళ్లంతా మెచ్చుకున్నారు. పులిని అటవీశాఖ అధికా-రులకు అప్పగించారు.