అనగనగా ఒక ఊరు. ఆ ఊరి పేరు తొగర్రాయి. ఆ ఊరి బడిలో యశ్వంత్ అనే పిల్లవాడు ఉండేవాడు. వాడికి అసలు చదువే రాదు.
సాధారణంగా వాడి చదువుని ఎవ్వరూ పట్టించుకునేవాళ్ళు కాదు. టీచర్లు కూడా వాడిని ఏమీ అడిగేవాళ్ళు కాదు- వాడు సమాధానం చెప్పలేడని వాళ్లకు తెలుసు. అయితే ఒక రోజున ప్రధానోపాధ్యాయుడు వాడిని కొట్టాడు- "ఇంత చిన్న సంగతులు కూడా తెలీట్లేదు నీకు- ఇంక చదువుకొని ఏం ప్రయోజనం?" అని కూడా అరిచాడాయన.
యశ్వంత్‌కి ఎందుకనో ఇది నచ్చలేదు. హెడ్మాస్టరు తనని 'కొట్టటం వేరు, ఇట్లా అరవటం వేరు' అనిపించి, వాడికి చాలా బాధ వేసింది. ఆ సంగతి వాడు వాడి మిత్రులకు చెబితే వాళ్ళు కూడా బాధపడి, "అరే! నిజంగానే నీకు చదువు అంటే ఇష్టం లేదు కదా? నీకు క్రికెట్ అంటే కదా, ఇష్టం ..? మరి ఇంక ఇక్కడ బడిని పట్టుకొని వ్రేలాడేది ఎందుకు? సెలవల్లో సెలక్షన్లు అవుతాయట-వచ్చే సంవత్సరం నుండీ క్రికెట్ కోచింగ్ కి పో రా! అదే నయం!" అన్నారు.
"సరేరా! అట్లాగే చేస్తా! నేను 2026 వరకూ క్రికెట్‌నే ఆడతా; మంచి క్రికెటర్ ని అవుతా; చూస్తూండండి!" అన్నాడు యశ్వంత్.
ఆ సంవత్సరం పరీక్షలు కూడా రాయలేదు యశ్వంత్. మరుసటి ఏడాది వాడు బడికి రాలేదు. అటు
తర్వాత అందరూ వాడి గురించి మర్చిపోయారు.
కొన్ని సంవత్సరాలు గడిచాక, ఒక రోజున యశ్వంత్ వాళ్ళ మిత్రులకు అందరికీ ఫోన్లు వచ్చాయి- "సాయంత్రం టీవీ ఆన్ చేసి క్రికెట్ చూడండిరా, అంతా! నేనెవరో తెలుస్తుంది" అని.
ఎవ్వరికీ ఏమీ అర్థం కాలేదు. కానీ వాళ్లంతా టీవీ చూసి, గుర్తుపట్టారు! అక్కడ ఆడుతున్న కుర్రవాడు యశ్వంత్! వరస పెట్టి సిక్సులూ, ఫోర్లూ కొడుతున్నాడు! స్టేడియంలో ఉన్న వాళ్ళంతా ఉత్సాహంగా చప్పట్లు కొడుతూ మెచ్చుకుంటున్నారు! మిత్రుల ఆనందానికి అవధులు లేవు! "మన ఊరి పిల్లాడురా, వాడు! యశ్వంత్- మన ఊరి వాడే!" అని అందరికీ చెప్పుకున్నారు.
ఆ తరవాత ఒకనాడు ఊరికి వచ్చిన యశ్వంత్‌కి బడిలో ఘనంగా సన్మానం జరిగింది. అప్పుడు వాడు స్నేహితులను మెచ్చుకుంటూ "అరే! మీరు నాకు చేసిన మేలు అంతా ఇంతా కాదురా! నన్ను కోచింగుకు పంపింది మీరే! మీ సలహానే నన్ను ఇప్పుడు ఇంతవాణ్ణి చేసింది!" అన్నాడు. అప్పుడు మిత్రులు "మేము నిన్ను ఎంత వెళ్ళమని అన్నా నీ కృషి లేనిదే ఏదీ కాదురా!" అన్నారు.
ఆ రోజు బడిలో ఉండగా యశ్వంత్‌కి ఒక ఐడియా వచ్చింది. 'తను ఒక మంచి 'స్పోర్ట్స్ అకాడమీ' పెట్టాలి.. తనలాగా ఆటలు అంటే ఇష్టం ఉండే పల్లె పిల్లలకు సరైన దారి చూపించాలి. వారికి సరైన శిక్షణనిచ్చి, బలంగా తయారు చేయాలి!' అని. త్వరలోనే అతను దాన్ని అమలు పరచాడు. అట్లా ప్రారంభమైన "యశ" స్పోర్ట్స్ అకాడమీ ఎంతో మంది పిల్లలకు మార్గదర్శని అయింది!