కడపజిల్లా, కలసపాడు మండలం, మాణిక్యమ్మ అవ్వ బలే కధ చెప్పింది.
అనగనగా ఒక మంచాయన ఉండేవాడట. వాళ్ళ ఊరికి దగ్గర చాలా పండ్ల తోటలు ఉండేవి. పండ్లని తినేందుకు చిలకలు, వగైరా పక్షులు వచ్చేవి. అందుకని వాటిని పట్టుకునే వేటగాళ్లు కూడా చాలానే మంది తిరుగుతూ ఉండేవాళ్లు, ఆ ప్రాంతంలో.
మంచాయనకి ఎప్పుడూ ఈ చిలకల్ని చూసి జాలి వేసేది- "ఇంత ముద్దు ముద్దు చిలకలు, అన్యాయంగా వేటగాళ్ల పాలవుతున్నాయే!" అని బాధ పడగా పడగా, చివరికి ఆయనకు ఓ ఉపాయం తట్టింది. చిన్న వయసులో ఉన్న ఓ ఇరవై చిలుకల్ని పట్టుకొచ్చి, వాటికి ఈ పాట నేర్పించటం మొదలు పెట్టాడు శ్రద్ధగా :
"వేటగాడు వస్తాడు, జాగ్రత్త- దొరకద్దు!
వల విసురుతాడు, జాగ్రత్త- అటుపోకు!
గింజలు చల్లుతాడు, జాగ్రత్త- తినకు!
అసలు ఏమాత్రం ఆశపడకు!" అని.
చిట్టి చిలకలు అన్నీ ఆ పాటని బాగా నేర్చుకున్నాయి. ఏ కొంచెం ఖాళీ సమయం దొరికినా, అవన్నీ చక్కగా గొంతెత్తి పాడేవి- "వేటగాడు వస్తాడు, జాగ్రత్త. దొరకద్దు..." అంటూ.
ఇట్లా ఓ ఏడాది పాటు ట్రెయినింగ్ ఇచ్చాక, మంచాయన వాటిని అడవిలోకి తీసుకెళ్లి వదిలేసాడు. 'అక్కడ అవి ఎట్లా ఉంటాయో చూద్దాం' అని, వాటికి కనబడకుండా ఒక మూలన నక్కి కూర్చున్నాడు.
అంతలోనే అటుగా వచ్చాడు, ఒక వేటగాడు- గింజలు, బుట్టలు, వలలు అన్నీ పట్టుకొని వచ్చాడు. చెట్టు మీద వాలి ఉన్న చిలకల్ని చూసి చిరునవ్వు నవ్వాడు. అక్కడికి దగ్గర్లోనే వల పరచటం మొదలు పెట్టాడు. వెంటనే చెట్టుమీది చిలకలన్నీ ఒక్క గొంతుతో పాడటం మొదలు పెట్టాయి. "వేటగాడొస్తాడు, జాగ్రత్త! దొరకద్దు, జాగ్రత్త! వల విసురుతాడు, జాగ్రత్త! అటుపోకు! గింజలు చల్లుతాడు, జాగ్రత్త! తినకు! అసలు ఏమాత్రం ఆశపడకు!" అని.
అది వినగానే వేటగాడి ముఖం వాడి పోయింది. "అయ్యో! చేతికందే చిలుకలు చేజారినయ్యే! వీటికి నా గురించి అంతా తెలిసిపోయింది!" అనిపించి ఏడుపు వచ్చినంత పనైంది. నిరాశగా వాడు తన వలని ఎత్తేసి వేరే చోటికి పోబోయాడు.
అప్పటివరకూ పొదల చాటున కూర్చున్న మంచాయనకి వేటగాడి ముఖం చూసి నవ్వు వచ్చింది. 'తను చేసిన పని వల్ల ఇన్ని చిలుకలకు మేలు జరిగింది కదా!' అని కొంచెం గర్వంగా కూడా అనిపించింది.
మాటులోంచి బయటికి వచ్చి ఆయన వేటగాడితో అన్నాడు: "ఇన్ని సంవత్సరాలుగా వీటి అజ్ఞానాన్ని ఆసరాగా చేసుకొని బ్రతికాం; ఇప్పుడు వీటికి అసలు సంగతి తెలిసిపోయింది! ఇక ఇవి ఎవ్వరికీ దొరకవు- అయినా ఒక పని చెయ్యి. నీ దగ్గర ఉన్న కాసిని గింజలు కూడా చల్లెయ్యి. నాకు తెలిసి అవేవీ నీ వలలో పడవు; నువ్వు చల్లే గింజలు వృధానే అవుతాయి! అయినా చింతలేదు- నువ్వు వేసే శేరు గింజలకు గాను నేను నీకు నాలుగు శేర్ల గింజలు ఇస్తానులే, ఈ ఒక్కసారికీ. నేను ఊళ్ళోనే ఉంటాను- తర్వాత నీకు వీలు కుదిరినప్పుడు ఎప్పుడైనా వచ్చి, గింజలు పట్టుకుపో!" అట్లా అని, ఆయన నవ్వుకుంటూ ఇంటిదారి పట్టాడు.
వేటగాడు మరింత కృంగిపోయాడు. నిరాశతో వలని ఎత్తేయబోయిన వాడల్లా ఆగి, "సేరుకు నాలుగు సేర్లు గింజలు ఇస్తానంటున్నాడు కదా, ఈ మంచాయన? గింజలు చల్లే పోతానులే!" అని వలమీద అట్లా అట్లా కొన్ని గింజలు చల్లాడు-
అంతే- మరుక్షణం చిలకలన్నీ గబగబా ఎగురుకుంటూ వచ్చి వలమీద వాలాయి! ఆశగా గింజల్ని తినబోయాయి! అన్నీ వలలో చిక్కుకున్నాయి!
కొద్ది సేపు గందరగోళం తర్వాత అన్నీ వలలోంచే పాడసాగాయి : "వేటగాడు వస్తాడు జాగ్రత్త... వల విసురతాడు. జాగ్రత్త,.. అటుపోకు..." అని!
వేటగాడు గింజలు ఇప్పించుకునేందుకు మంచాయన దగ్గరికి వెళ్ళి, ఏం జరిగిందో చెప్పాడు. చెప్పి చిలుకల్ని చూపించాడు మంచాయనకు. ఆయన నిర్ఘాంతపోయాడు: "నేను ఇన్ని జాగ్రత్తలు చెప్పానే; అవన్నీ వాటికి నోటికి వచ్చాయి కదా చక్కగా?! అయినా మరి వేటగాడికి ఎలా చిక్కాయి?! నోటికి రావటం, నిజంగా తెలీటం రెండూ వేరా?" అని కళ్ళనీళ్ళు పెట్టుకున్నాడు.
చాలాసార్లు మనమూ ఇట్లా చిలుకలలాగా ప్రవర్తిస్తాం. మనం నేర్చుకున్న సంగతులని ఎప్పటికప్పుడు మన జీవితాలకు అన్వయించుకోం. చిలుక పలుకులలాగా నేర్చుకొని మాటల్లో వెలువరించేవి ఎంత గొప్ప సంగతులైనా గానీ, రోజువారీ జీవితంలో మన ప్రవర్తనకు అంటలేదంటే, ఇక వాటివల్ల అంతిమంగా ఎలాంటి ప్రయోజనమూ ఉండదు.
నేర్చుకున్నదల్లా అప్లై చేసే మీకందరికీ అభినందనలతో,
కొత్తపల్లి బృందం