అమరవరంలో ఒకప్పుడు గోపి అనే పిల్లవాడు ఉండేవాడు. వాళ్ళ అమ్మ-నాన్నలు రైతులు. ఒకప్పుడు బాగానే బ్రతికినా, కాలం గడిచేకొద్దీ చితికిపోయి, తమకున్న ఆస్తులు అమ్ముకొని పట్నం చేరుకున్నారు. గోపిని తమకు ఉన్నంతలో బాగా చదివించారు. గోపికి తమ ఇంటి పరిస్థితులు అన్నీ తెలుసు. తనను చదివించటం కోసం అమ్మ-నాన్న పడిన శ్రమ, ఎదుర్కొన్న కష్టాలు అన్నీ తెలుసు. "వాళ్ళను మంచిగా చూసుకోవాలి" అని అనుకునేవాడు కూడా.

కాలక్రమంలో గోపికి పట్నంలోనే ఓ చిన్న ఉద్యోగం దొరికింది. ఇప్పుడు అతని జీతంతోటే ఇల్లు నడుస్తున్నది.

కొన్ని రోజులకు అతనికి పెళ్ళి అయింది. భార్య రాధది తమలాగే పట్నానికి వలస వచ్చిన మధ్య తరగతి కుటుంబం. తర్వాత మెల్లగా కష్టాలు మొదలయ్యాయి. గోపి సంపాదించే కాసిని డబ్బులతో ఇల్లు గడవడం కష్టం అవ్వసాగింది.

అంతలోనే వాళ్ళకు ఒక కొడుకు పుట్టాడు. ఖర్చులు మరింత పెరిగాయి. గోపి-రాధ ఇద్దరూ 'ఇల్లు గడిచేది ఎలాగ, డబ్బులు సంపాదించేది ఎలాగ?' అని ఆలోచనలో పడ్డారు.

రాధ అన్నది- "నేను పెద్దగా చదువు కోలేదు; కాబట్టి నాకు సంపాదించే అవకాశం కూడా లేదు. పైగా పిల్లవాడున్నాడు. అందుకని నువ్వే వేరే ఏదైనా పార్ట్ టైం ఉద్యోగం చూసుకో. అదనపు డబ్బు లేకపోతే ఇల్లు గడవదు" అని.

"సరే- అట్లాగే చేస్తాను.. కానీ మా అమ్మానాన్నల బరువు కొద్దిగా నీ మీద పడుతుందేమో- వాళ్లు పెద్దవాళ్లయిపోయారు, కళ్ళు కనబడవు, చెవులు వినబడవు!" అన్నాడు గోపి.

రాధకి ఆ అదనపు పని ఇష్టం కాలేదు. కానీ చేసేదేమీ లేదు. అందుకని మౌనంగా ఉన్నది.

మళ్ళీ గోపినే "నేను వేరే పార్ట్ టైం ఉద్యోగాలకు కూడా ప్రయత్నం చేస్తాను రాధా. ఏమంటే పార్ట్ టైం పనులకు జీతం మటుకు చాలా తక్కువ ఇస్తారు. మనం ఏమీ చెయ్యలేం" అన్నాడు గోపి. అలా ఇద్దరూ మౌనంగా కూర్చున్నారు.

మరుసటిరోజు ఉదయం గోపి 'ఏం చేయాలి' అని ఆలోచిస్తూ ఆఫీసూ పోతుంటే, దారిలో 'వృద్ధాశ్రమం' ఒకటి కనిపించింది. అది రోజూ అక్కడ ఉండేదే, కానీ ఇప్పుడు దాన్ని చూడగానే తన "సమస్యలకు అన్నిటికీ ఇది పరిష్కారం" అనిపించింది అతనికి. "అమ్మ నాన్నలను వృద్దాశ్రమంలో వేయాలి- 'డబ్బులు ఖర్చు' అని చూసుకోకూడదు".

ఆ రోజు రాత్రి గోపి రాధ ఇద్దరూ చర్చించుకొని, సరేననుకున్నారు.

మరుసటి రోజు వాళ్ళ అమ్మ నాన్నలను గుడికి తీసుకొని వెళ్తానని చెప్పి, వృద్ధాశ్రమానికి తీసుకొని వెళ్ళాడు గోపి. అయినా పాపం వాళ్లకు కొడుకు ఉద్దేశం అర్థం కాలేదు. కళ్ళు తెరిచే సరికి గోపి వాళ్ళిద్దరినీ అందులో చేర్పించి వెళ్లిపోయాడు.

కొడుకు మళ్ళీ వస్తాడు-తమని తీసుకెళ్తాడు" అనే ఆలోచనలో వాళ్ల అమ్మ-నాన్నలు అక్కడే ఉండిపోయారు. కొద్ది కాలానికి వాళ్ళ కళ్ళయితే తెరచుకున్నాయి కానీ, కొడుకు మటుకు కంటపడలేదు.

కష్టాలు ఎల్లకాలమూ ఉండవు కదా, గోపి కుటుంబ కలతలు సద్దుమణిగాయి. కొడుకు రాజు చూస్తూ ఉండగానే పెద్దవాడు అయ్యాడు. వాడి చదువు పూర్తయింది. అమెరికాలో ఉద్యోగం కూడా వచ్చింది. వాడు అమెరికా వెళ్ళి మంచిగా డబ్బులు సంపాదించాడు.

"మీరు కూడా అక్కడి ఆస్తులు అవీ వదిలేసి, ఇటు వచ్చేయండి" అంటూ ఉండేవాడు కాస్తా, తనకి పెళ్లయ్యే సరికి రాగం మార్చేసాడు: "నేను ఇక్కడ సొంతగా ఓ కంపెనీ‌ పెట్టాలి నాన్నా! నీకు తెలుసుగా, కంపెనీ అంటే ఊరికే రాదు. అక్కడ ఇండియా ఉన్న మన ఆస్తులు అవీ అమ్మి, ఆ డబ్బులు అమెరికాకి పంపించండి" అన్నాడు.

"అట్లా ఎట్లా కుదురుతుందిరా? ఆస్తులు అన్నీ‌ అమ్మేస్తే, మరింక మీ అమ్మ-నేను ఎక్కడ ఉండాలి?" అన్నాడు గోపి ఆందోళన చెందుతూ.

"ఏముంది, మీ అమ్మ నాన్నలను చేర్పించావుగా నాన్నా! అదే వృద్ధాశ్రమానికి మీరు కూడా వెళ్లచ్చు. నేను వాళ్లతో అల్రెడీ మాట్లాడేసాను. మిమ్మల్ని కూడా చేర్చుకుంటామన్నారు!" అన్నాడు రాజు.

గోపి-రాధలకు నోట మాట రాలేదు! వాళ్లకు ఆ రోజున అర్థమయింది: "చేసిన తప్పే వెంటాడి వేధిస్తుంది".