అనగనగా ఒక ఊళ్లో రాజు, సోము, చంద్రం అనే ముగ్గురు పేదవాళ్ళు ఉండేవాళ్ళు.

ముగ్గురూ తలా ఒక దిక్కుకు వెళ్ళి, ఏ పని దొరికితే ఆ పని చేసేవాళ్ళు. ఏ పనీ దొరక్కపోతే అడుక్కునేవాళ్ళు.
ఏ రోజుకు సరిపడ ఆహారపు దినుసులు ఆరోజు కొనుక్కుని వంట చేసుకునేవాళ్ళు. వంట పూర్తయ్యేసరికి ముగ్గురి కడుపులూ నకనకలాడుతూ ఉండేవి. చకచకా తినేసి, ఎవరి లోకాల్లో వాళ్ళు విహరించేవాళ్ళు.

ఒకసారి వాళ్లకి బిర్యానీ తినాలనిపించింది. "జీవితంలో ఒకసారైనా బిర్యానీ కడుపునిండా తినాలిరా, ఎప్పుడూ ఈ‌ చార్లతో ఏమౌతుంది?" అనుకున్నారు.

కానీ, బిర్యానీ అంటే కొంచెం ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. వాళ్ల దగ్గర డబ్బులు ఏనాడూ నిలవ ఉండవు- వచ్చిన డబ్బులన్నీ ఏపూటకాపూట ఖర్చయ్యేవి. బిర్యానీ తినాలంటే అదనపు డబ్బులు కావాలి...

"ఇంకెప్పుడు, బిర్యానీ తినేది?" అని ఆరోజు రాత్రంతా విచారపడితే, వాళ్లకి ఒక ఆలోచన తట్టింది: "రోజూ తాము తెచ్చే డబ్బుల్లో తలా ఒక రూపాయీ అసలు రాలేదనుకోవాలి. ఆ రూపాయిలని అంతా ఒక చెంబులో వేసి, కూడబెట్టాలి. చివరికి బిర్యానీ తినే రోజున ఈ అదనపు డబ్బుల్ని వాడుకోవాలి!

కొన్ని రోజులపాటు అట్లా కడుపులు కాల్చుకొని, కూడబెట్టుకున్న డబ్బులతో సంతకు వెళ్ళి, బిర్యానీకి కావలసిన బియ్యం, కూరగాయలు, మాంసం, మసాలాదినుసులు, నూనె వగైరాలు అన్నీ తెచ్చుకున్నారు ముగ్గురూ.

ఆ రోజు సాయంత్రం "బిర్యానీ!" అనే ఉత్సాహం కొద్దీ ముగ్గురూ రోజంతా ఉపవాసమే ఉన్నారు కూడా! సాయంత్రం 'చీకటి పడుతోంది' అనగానే ముగ్గురూ కలిసి ఇష్టంగా బిర్యానీ వండటం మొదలు పెట్టారు. అన్ని దినుసులూ ఉండటంతో ఘుమఘుమలాడే బిర్యానీ తయారయింది. ఆ సరికి బాగా చీకటైంది కూడా.

ఇక ముగ్గురూ తట్టలు ముందు పెట్టుకొని కూర్చున్నారు. చాలా మెల్లగా రాజు బిర్యానీ మీది మూత తీసి చూసాడు. "సూపర్! బలే ఉంది వాసన!" అన్నాడు. అయితే అందులో ఉన్న బిర్యానీ చాలా కొంచెమే. వీళ్ళ లెక్క తప్పి, ముగ్గురికి అవ్వాల్సిన బిర్యానీ‌ ఒక్కడికి కూడా చాలీ చాలనంత కొంచెం అయ్యింది.

"ఒరే, ఇంత కొంచెం బిర్యానీ అయిందేమిరా?" అన్నాడు రాజు.

"ఎంతైతేనేమి, ముగ్గురం పంచుకుని తిందాం!" అన్నాడు సోము.

"నేనైతే మొత్తం ఒక్కడినే తినగలను!" అన్నాడు చంద్రం.

"మేం కూడా తినగలం!" అన్నారు రాజు, సోము ఒక్కగొంతుతో.

"చూడండి, ఇవాళ్ళ మనలో ఎవరమో ఒకరం మాత్రం మొత్తం బిర్యానీ తినేద్దాం. వచ్చే వారం మళ్ళీ చేసుకుందాం, ఈసారి ఎక్కువ మొత్తంలో చేసుకొని, మిగిలిన ఇద్దరూ తింటారు" అన్నాడు సోము.

"సరే, ఇన్నాళ్లనుండి బిర్యానీ‌ గురించి కల కంటున్నాను కాబట్టి, దీన్ని నేను తింటాను ఇవాల్టికి" అన్నాడు రాజు. "కాదులే, నేను నీకంటే గొప్ప కలలు కంటున్నాను. నేను తింటా" అన్నాడు సోము. అందరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు.

"చూడండి, ఇక లాభం లేదు. బాగా ఆలస్యం కూడా అయ్యింది. మనం‌ ముగ్గురం తలా ఒక గ్లాసెడు మంచినీళ్ళు త్రాగి, ఈ బిర్యానీ‌ గిన్నె చుట్టూనే పడుకుందాం. అందరం రేపు ఉదయం వరకూ మంచి మంచి బిర్యానీ కలలు కందాం. ఎవరికి అతి గొప్ప కల వస్తుందో, వాళ్ళదే ఈ బిర్యానీ!" తీర్పు చెప్పాడు చంద్రం.

మిగిలిన ఇద్దరికీ పౌరుషం హెచ్చింది. "సరే-అలాగే కానీ" అన్నారు. ఇక ముగ్గురూ గబగబా ముసుగు తన్ని బిర్యానీ‌ గిన్నె చుట్టూ పడుకున్నారు.

ఇంకా తెల్లవారకనే రాజు మిగిలిన ఇద్దరినీ నిద్రలేపాడు: "నాకు ఎంత మంచి కల వచ్చిందో తెలుసా? నేను విమానం ఎక్కి హైదరాబాదుకు వెళ్ళానట! అక్కడ ఒక పెద్ద హోటల్లో ముఖ్యమంత్రిగారితో కలిసి బిర్యానీతో పాటు రొట్టెలు, కూరలు తిన్నానట!" అన్నాడు.

సోము గట్టిగా నవ్వి "అయ్యో అన్నా! నాకు నీకంటే గొప్ప కల వచ్చింది. మా ఇంటి దేవుడు నన్ను నేరుగా స్వర్గలోకం పిల్చుకుపోయాడు. అక్కడ నేను, ఆయన కలిసి డిన్నర్‌ చేసాం. దేవకన్యలు వడ్డించారు. బిర్యానీ ,స్వీట్స్, ఇంకా ఏమేమి తిన్నామో లెక్కలేదు!" అన్నాడు గొప్పగా.

చంద్రం ఇంకా నోరు విప్పలేదు. విచారంగా తల వంచుకొని కూర్చొని ఉన్నాడు. ఇద్దరూ వాడికేసి చూసి,"ఏరా, అట్లా కూర్చున్నావు? నీకేమీ బిర్యానీ కల రాలేదా?" అన్నారు.

"లేదురా! ఇప్పటి వరకూ మీకు నా కల గురించి ఎలా చెప్పాలా అని బాధ పడుతున్నాను. ఇప్పుడు చెప్పచ్చు: ఎలాగూ మీరు కడుపునిండా గొప్ప గొప్ప వంటకాలు తిని ఉన్నారు" అన్నాడు.

"ఏమైంది?" అన్నారు మిగిలిన ఇద్దరూ ఆదుర్దాగా.

"నిన్న రాత్రి నా కలలోకి ఒక భయంకరమైన రాక్షసుడు ఒకడు వచ్చాడురా! 'ఆకలి! ఆకలి!' అని అరిచాడు. 'ఏముంది, పెట్టు!' అన్నాడు! 'బిర్యానీ ఉంది తింటావా?!' అన్నాను నేను. వాడు నాకేసి అనుమానంగా చూసాడు. 'అడగ్గానే తినమంటున్నావు, అందులో ఏం కలిపావు?' అన్నాడు. 'ఏమీ లేదు!' అన్నాను నేను. వాడు దాన్ని వాసన చూసి, 'తిను!' అన్నాడు. నేను 'తినను!' అని మొండికేసాను. నేను 'తినను' అన్నకొద్దీ వాడికి కోపం ఎక్కువైంది. "నువ్వు బిర్యానీ తింటావా లేక నేను నిన్ను తినాలా?" అని బెదిరించాడు. దాంతో ఇక భయం వేసి, బిర్యానీ మొత్తం తినేసాను!" అన్నాడు చంద్రం.

"అప్పుడు మమ్మల్ని లేపి ఉంటేనేమిరా?!" అన్నారు రాజు, సోము- వాడి మీద జాలి పడుతున్నట్లు.

"మీలో ఒకరు అప్పుడు ముఖ్యమంత్రితోను, మరొకరు దేవుడితోనూ బిర్యానీ తింటున్నారు. మిమ్మల్ని ఎందుకు డిస్టర్బ్ చేయాలి, అని, మిమ్మల్ని లేపలేదు!" అన్నాడు చంద్రం.

అసలు సంగతి అప్పుడు వెలిగిన మిత్రులిద్దరూ గబగబా గిన్నె దగ్గరికి వెళ్ళి చూస్తే ఏముంది? గిన్నె మొత్తం ఖాళీ! ఒక్క మెతుకు బిర్యానీ కూడా లేదు!