జోకులు

జాగ్రఫీ నాలెడ్జి!
టీచర్‌: మన ఊరికి ఇటువైపున దక్షిణం . మరి ఉత్తరం ఎటు ఉంటుందిరా, చింటూ?!
(చింటు ఒక వైపు చూపిస్తాడు.)
టీచర్: తప్పు బాబూ! ఉత్తరం ఉండేది ఇటు!
చంటి: కాదు టీచర్, మనం దక్షిణ ఇచ్చే గుడి ఉండేది ఇటు; మన ఉత్తరాలన్నీ తెచ్చి పెట్టే పోస్టాఫీసు ఉండేది అటు!

రహస్య సమాచారం!
సీనా : ఉత్తరం పై చిరునామా రాయకుండానే పోస్ట్‌ బాక్స్ లో వేశావేం?!
రాము : ష్... ఎవరికీ తెలియకుండా రహస్యంగా పంపుతున్న ఉత్తరంరా అది!

అభినవ ఏకలవ్యులు!
టీచర్‌ : ఏకలవ్యుడికి , మీకు తేడా ఏంట్రా చింటూ?''
చింటూ : మేము వేలుపోసి చదువుకుంటున్నాం'; ఏకలవ్యుడు వేలుకోసి చదువుకున్నాడు సార్!

ఇంట్లోనే బ్యాంకు!
బుక్‌ సెల్లర్‌ ఒకాయన సర్వే నిర్వహిస్తున్నాడు:
బుక్‌ సెల్లర్‌ : మిమ్మల్ని జీవితంలో బాగా పైకి తీసుకొచ్చిన బుక్‌ ఏది?
సూర్యం : మా ఆవిడ చెక్‌ బుక్‌.

దాత!
రవి : మమ్మీ … బయట ఒకాయన ఎండలో నిల్చుని అరుస్తుంటే పది రూపాయలు ఇచ్చాను..
అమ్మ : మంచిపని చేశావురా! ఇంతకీ ఏమని అరిచాడు అతను?!
రవి : ఐస్‌క్రీం.. ఐస్‌క్రీం. ఐస్‌క్రీం..అని.

నల్ల టిక్కెట్టు!
ఇన్‌స్పెక్టర్‌ : బ్లాక్‌లో టికెట్లు అమ్మేవాడిని పట్టుకు రమ్మంటే ఒక్కడివే వచ్చావే?
కానిస్టేబుల్‌ : అక్కడ టికెట్లు ఏవీ బ్లాక్‌లో లేవు … పసుపు, గులాబీ రంగుల్లో ఉన్నాయి సార్‌.

సిగ్గా-ఎగ్గా?
సార్‌: ఎప్పుడూ ఏదో ఒక తప్పుచేసి క్లాసులో నిలబడి ఉంటావు, సిగ్గనిపించదా, రాజూ?!
రాజు: లేదు సార్! అసలైతే క్లాసు మొత్తానికీ మనిమిద్దరమే నిలబడి ఉంటామని గర్వంగా ఉంటుంది!

మర్యాదాపురుషుడు!
టీచర్: చింటూ! మీ నాన్న ఏం చేస్తారు?
చింటూ: రోజంతా మర్యాదగా అబద్ధాలు చెబుతుంటారు టీచర్.
టీచర్: అదేం మాట?! మీ నాన్నది ఏం ఉద్యోగం?
చింటూ: మా నాన్న కస్టమర్ కేర్ రిప్రజెంటేటివ్ టీచర్!

హచ్-పిచ్చి!
డాక్టర్‌: కుక్క దగ్గరికి పోయి ఏం చేశావ్‌, ఊరికే, పనిలేక?!
రాము: హచ్‌ కుక్కేమో అనుకుని దగ్గరికెళ్ళాను సర్, కరిచాక తెలిసింది- పిచ్చి కుక్క అని...!

మా నాయనే! సంతా సింగ్ విచారంగా కూర్చొని ఉండగా బంతా సింగ్ వచ్చాడు.
బంతా: ఏంరా, ఇవాళ్ల మీ పెళ్ళి రోజు కదా, ఇట్లా విచారంగా కూర్చొని ఉన్నావేం?
సంతా: ఏం చెప్పను, పెళ్ళి రోజు సందర్భంగా మా ఆవిడకి నేను ఒక చైన్ తెచ్చి ఇచ్చాను. బదులుగా ఆమె నన్ను ఇంట్లోంచి వెళ్ళగొట్టింది!
బంతా: అసలామె మనిషేనా?! బంగారు చైన్ కొనిపెట్టిన వాడిని ఇంట్లోంచి వెళ్ళగొట్టింది?!
సంతా: నేను ఇచ్చింది బంగారు చైన్ కాదు. సైకిల్ చైన్!

నేను విసరలేదు పులీ!
సంతాసింగ్, బంతా సింగ్ ఒకసారి అడవిలో పోతుంటే పులి ఒకటి గర్జిస్తూ ఎదురు పడింది వాళ్లకి!
సంతాసింగ్ గబుక్కున తన చేతిలో‌ ఉన్న కారం మిక్చర్ ని దాని కళ్ళలో పడేట్లు విసిరి కొట్టి, అరిచాడు-
"బంతా! పారిపో!” అని.
బంతా అక్కడే నిలబడి అన్నాడు మొండిగా: "నేనెందుకు పారిపోవాలి, మిక్స్ఛర్ విసిరింది నువ్వైతే?!” అని!

ఆశ వీడకు! వెంగళప్ప ఓసారి జామకాయలు కొంటే అందులో పురుగులు వచ్చాయి.
వెళ్ళి జామకాయల అతన్ని నిలదీశాడు: “నువ్వమ్మిన పళ్ళలోంచి పురుగులు వచ్చాయి!” అని.
పండ్లాయన అన్నాడు: “ఎవరి అదృష్టం ఎలా ఉందో ఏమి చెప్తాం సర్, పురుగులు వస్తే పురుగులు వస్తాయి, మోటార్ సైకిళ్ళు వస్తే మోటార్ సైకిళ్ళు వస్తాయి” అని.
వెంగళప్పకు ఆశ పుట్టింది: “అవునా! అట్లా ఐతే అర్జంటుగా ఇంకో ఐదు కిలోలు కట్టివ్వు! ఈసారి ఏమొస్తాయో చూడాలి!" అని మళ్ళీ కొనుక్కెళ్ళాడు.

పద్యాలు 1.
తనవారు లేని చోటను
చనవించుక లేని చోట, జగడము చోటన్
అనుమానమైన చోటను
మనుజునకు నిలువదగదు మహిలో సుమతీ!
తనవారంటూ ఎవరూ లేని చోట, తనకు చనువు లేని చోట, పోట్లాటలు అయ్యే చోట, అనుమానంగా అనిపించే చోట మనం ఉండీ ప్రయోజనం లేదు.

2. కులకాంతతోడనెప్పుడు
కలహింపకు వట్టితప్పు ఘటియింపకుమీ
కలకంఠి కంట కన్నీ
రొలికిన సిరి యింటనుండనొల్లదు సుమతీ
భార్యతో ఎప్పుడూ పోట్లాడకు. దోషాలు ఎంచి చూపి ఏడిపించకు. ఇంటావిడ కంట్లోంచి ఏ ఇంట్లో అయితే నీరు ఒలుకుతుందో, ఆ ఇంట్లో సంపద నిలవదు.

3. ఓడల బండ్లును వచ్చును
ఓడలునా బండ్లమీద నొప్పుగ వచ్చున్
ఓడలు బండ్లును వలెనే
వాడంబడు గలిమి లేమి వసుధను సుమతీ!
బండ్లు ఓడలనెక్కి వస్తాయి; ఓడలు కూడా ఆ బండ్ల మీద ఎక్కి వస్తుంటాయి. ఓడలు, బండ్ల మాదిరే ఒకదానినొకటి ఎక్కి వస్తాయి కలిమి-లేములు. ఇది అసామాన్యం ఏమీ కాదు!

4. పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినపుడె పుట్టదు; జనులా పుత్రుని కనుగొని పొగడగ, పుత్రోత్సాహంబు నాడు పొందుర సుమతీ! పిల్లలు పుట్టారు అనే ఉత్సాహం తల్లి దండ్రులకు ఆ పిల్లలు పుట్టినప్పుడే కలగదు. అందరూ ఆ పిల్లల్ని గుర్తించి మెచ్చుకుంటే, అప్పుడు, తల్లిదండ్రులకు పుత్రోత్సాహం కలుగుతుంది.

5. మానవుడాత్మకిష్టమగు మంచి బ్రయోజన మాచరించుచో గానక యల్పుడొక్కడది గాదని పల్కిన వాని పల్కుకే మానగ జూడడాపని! సమంచిత భోజన వేళ నీగ కా లూనిన వంటకంబు దినకుండగ నేర్పగునోయి, భాస్కరా? మనం మన ఆత్మకు ఇష్టం అయ్యే ఏదైనా మంచి పనిని చేసేందుకు నడుం బిగించినప్పుడు, దాని లోతు తెలుసుకోలేక ఎవరైనా మూర్ఖుడు ఆ పనిని తీసి పారేస్తూ మాట్లాడితే కూడా మనం ఆ పనిని మానెయ్యకూడదు. అద్భుతమైన భోజనం చేసేందుకు కూర్చున్నప్పుడు ఒక ఈగ వచ్చి కాలు పెట్టిందని ఆ వంటకాన్ని తినకుండా మానెయ్యటం తెలివైన పని అవుతుందా, భాస్కరా?

సూక్తులు
1. సత్యం,ప్రేమ ఎక్కడుంటాయో అక్కడ శాంతి తప్పక ఉంటుంది
2. గమ్యం లేని నావలాగా ఆదర్శం లేని శ్రమ నిరర్థకం.
-మహత్మా గాంధీ

పొడుపు కథలు:

  1. ఇక్కడ విసిరిన రాయి కాశీకి చేరు
  2. ఇక్కడ అక్కడ వుంటుంది కబుర్లు అందిస్తుంది
  3. ఇంటిగోడమీద వెలుగుల బంతి, ఇల్లంతా వెన్నెల బంతి
  4. ఈ ఇంటికి ఆ ఇంటికి మధ్యన ఒకటే దూలం
  5. ఇంత పిల్ల ఇల్లెక్కి పిండి కొట్టింది.
    జవాబులు: 1.బాట, 2.టెలిఫోన్‌, 3.బల్బు, 4.ముక్కు, 5.చెక్కపురుగు
    (సౌజన్యం:డా. పత్తిపాక మోహన్‌, సిరిసిల్ల జిల్లా)

పొడుపు కథలు
1. ఎండిన మాను గలగల
2. ఎనిమిది ఎముకలు - గంపెడు పేగులు
3. ఎన్ని కన్నులున్నా రెండు కళ్ళతోనే చూచేది
4. ఎముక లేని పులి ఏటుకు ఎదురు పోయె
5. ఎర్రటి కాయలో నల్లటి విత్తలు
6. ఎక్కి ఊగేది పట్టి లాగేది ఏది?
7. ఎటు చదివినా ఒకే కవి
8. ఎంతకోసినా తరగని చెట్టు! నువ్వెట్టా ఉంటావు
9. ఎండిన బావిలో పిల్లలు గంతులేస్తారు
జవాబులు: 1.తప్పెట, 2.మంచం, 3.నెమలి, 4.జలగ, 5.ఎర్రపుంటి కాయ,6.ఊయల,7.వికటకవి, 8.పొగ 9.పేలాలు
(పొడుపు కథలు- సౌజన్యం: డా. పత్తిపాక మోహన్‌, రాజన్న సిరిసిల్ల జిల్లా, తెలంగాణ రాష్ట్రం.)