ఒక చిలుక, ఒక కొంగ మంచి స్నేహితులు. ఒక రోజున వాటికి రెండింటికీ బాగా ఆకలి వేసింది.

"మనం చేపలు పట్టుకుని తిందాం " అన్నది కొంగ. కానీ చిలుకకు అది ఇష్టం లేదు. "మనం పండ్లు కొరుక్కొని తిందాం!" అన్నది చిలుక.

"చేపల్ని ఎందుకు తినకూడదు?!" అంది కొంగ కోపంగా.

"అవి కూడా మనలాగే మూగజీవులు కదా" అన్నది చిలుక దయ చూపుతున్నట్లు.

"అయితే మనకేమిటి? మన ఆకలి తీరితే చాలు!" అన్నది కొంగ మొండిగా.

"సరే, చేపలు ఉన్నై కాబట్టి ఇట్లా అంటున్నావు, మరి చెరువు ఎండిపోతే ఏం చేస్తావు?!" అన్నది చిలుక.

"వేరే చెరువుకు వెళ్తాను!" అన్నది కొంగ.

"మరి అన్ని చెరువులూ ఎండిపోతే ఏం చేస్తావు?" అడిగింది చిలుక.

"అన్ని చెరువులూ ఎండిపోతే ఆకలితో చస్తాము అందరమూ!" అన్నది కొంగ.

"ఆ విధంగా ఆకలితో చనిపోయే బదులు పండ్లను తిని జీవిస్తే మేలు కదా!" అన్నది చిలుక నవ్వుతూ. "బాగుంది, పండ్లు తిందామంటున్నావు గానీ, మరి చెట్లు ఎండిపోతే ఏం చేస్తావు?" అడిగింది కొంగ.

"అదేం ప్రశ్న, చెట్లు అన్నీ ఎందుకు ఎండిపోతాయి అసలు?" అన్నది చిలుక.

"అన్ని చెరువులూ ఎండిపోయినప్పుడు, చెట్లు అన్నీ కూడా ఎండిపోతై కదా?!" అడిగింది కొంగ.

ఈ ఐడియా తనకి తట్టనందుకు తల పట్టుకున్న చిలుక- "మరెట్లా?" అంది.

"నీకు నచ్చింది నువ్వు తిను, నాకు నచ్చింది నేను తింటాను. ఒకరి తిండిని మరొకరం గౌరవిద్దాం. వీలైతే ఇద్దరం కలిసి కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ తిందాం. లేదంటే తిన్నాక కబుర్లు చెప్పుకుందాం" అంది కొంగ నవ్వుతూ.