పాండవులు-కౌరవులు పిల్లలుగా ఉన్నప్పడు అంతా కలిసే ఉండేవాళ్ళు. వాళ్ళు పెద్దయిన తర్వాత ఎట్లా కొట్టుకునేవాళ్ళో, చిన్నప్పుడూ అట్లానే గుంపులు కట్టి కొట్లాడుకునేవాళ్ళు- ఏమంటే పెద్దయ్యాక వాళ్ల దగ్గరికి కత్తులు, డాలులు వచ్చాయి; మరి చిన్నప్పుడు కట్టెలు, తట్టలు ఉండేవి.
ఒకసారి వాళ్ళు ఇట్లా కట్టెలు, అన్నం తినే ప్లేట్లు పట్టుకొని పెద్ద కొట్లాట మొదలు పెట్టినప్పుడు, నారదుడు వచ్చాడు. నారదుడు త్రిలోక సంచారి. అన్ని లోకాల్లోను, అన్ని దేశాల్లోను ఎవరెవరు-ఎప్పుడెప్పుడు-ఏమేం ఆటలు ఆడతారో, ఎట్లా కొట్టుకుంటారో ఆయనకు తెలిసినట్లు ఇంకెవ్వరికీ తెలీదు.
ఆయన అన్నాడు- "ఆగండిరా పిల్లలూ! కట్టెలు-తట్టలు పట్టుకొని కొట్టుకునే ఆటలు పాతబడిపోయినై. మీరు రాకుమారులు కదా, వేరే ఏమైనా కొత్త ఆటలు కనుక్కోండి" అని.
"పెద్దలు, మీకు తెలీని ఆట లేదు. మీరే ఏదైనా కొత్త ఆట నేర్పించాలి మాకు" అన్నాడు ధర్మరాజు.
"ఈ ధర్మరాజుకు సొంత ఐడియాలే ఉండవు. నా ఊహలనే, అన్నిటినీ తనవిగా చెప్పుకుంటాడు. కొత్త ఆట ఏదైనా చెప్పండి!" అన్నాడు సుయోధనుడు.
"ఆటలు అనేవి రక్తాన్ని చిందించేవిగా ఉండకూడదు నాయనలారా! జనాల మధ్య ఉన్న వైషమ్యాలవల్ల నిజ జీవితాల్లో మారణహోమాలు జరగకుండా, ఈ ఆటలు అడ్డుకుంటాయి. వాళ్లమధ్య ఉత్తుత్తి వైరాలను కల్పించి, వారిలోని వైషమ్యం బలహీనమయ్యేందుకు తోడ్పడతాయి.
రాబోయే కలియుగంలో పిల్లలు, పెద్దలు అంతా ఆడనున్న 'క్రికెట్ ' ఆట ఆకోవకు చెందిందే. మీకు నేను దివ్య చక్షువులు ఇస్తాను. వాటి సహాయంతో ఆ ఆట నియమాలు చూసుకొని, మీరంతా సంతోషంగా, గొడవలు గొడవలుగా ఆ ఆట ఆడండి. మీకు మేలు జరుగుతుంది" అని చెప్పాడు నారదుడు.
ఆయన మహిమవల్ల పాండవులకు కౌరవులకు అందరికీ క్రికెట్ ఆట గురించి అర్థం అయిపోయింది.
కొన్ని కొన్ని సమస్యలు ఉండినై. కౌరవులలో ఉన్న వంద మందీ, "మేం ఆడతాం అంటే మేం ఆడతాం" అని గొడవ పడ్డారు.
ఇటువైపున పాండవులను మరొక భయం పీడించింది: "క్రికెట్‌మ్యాచ్‌లో టీముకు 11 మందే ఉండాలి కదా. మరి మేం ఐదు మందిమే ఉన్నాము- మిగిలిన ఆరుగురినీ కౌరవులలోంచి తీసుకోవాల్సిందేనా, ఐపీయల్ లీగ్ మ్యాచుల్లో లాగా?" అని.
ఆ గొడవలు ఎంతకీ సద్దుమణగక పోయే సరికి మధ్యలో ఎంపైర్‌గా నిల్చున్న నారదుడు, సుయోధనుడితో మాట్లాడి, 'కౌరవులలో బాగా ఆడే వాళ్ళను గుర్తించి వాళ్ళను వరసలో పెట్టి, మిగతా వాళ్ళని అందరినీ ఎక్స్ట్రాలుగా పెట్టమని సలహా ఇచ్చాడు. "అందరం టీములో ఉన్నాం" అని కౌరవులంతా సంతోషపడ్డారు.
అలాగే పాండవులకు తరుగు పడిన ఆరుగురు ఆటగాళ్ళనూ ఒకరిద్దరిని ముంబాయినుండి, ఒకరిద్దరిని కలకత్తా, బెంగుళూరులనుండి తెచ్చి టీమును నింపుకోవచ్చు గదా" అని సలహా ఇచ్చాడు నారదుడు.
"అయ్యో! ఈ ఆలోచన మనకు రాలేదే, పెద్దలు అందుకనే ఉండి దారి చూపాలి" అనుకొని అట్లాగే చేసారు పాండవులు. ఆ విధంగా రెండు మెరికల్లాంటి టీములు తయారయ్యాయి.
"పాండవులకు, కౌరవులకు ఒకే గురువు ద్రోణుడు ఉంటే కుదరదు" అని గొడవ చేసాడు సుయోధనుడు. "సరే, మీరు ద్రోణుడిని తీసుకోండి, మేం కృష్ణుడిని తీసుకుంటాం" అని పాండవులు అన్నారు. అట్లా మళ్ళీ ఇంకో సర్దుబాటు జరిగింది. కృష్ణుడు, ద్రోణుడు తమ తమ బాధ్యతల్ని బాగా నిర్వర్తించారు. ఎవరి టీములకు వాళ్ళు చక్కని కోచింగు ఇచ్చుకున్నారు. మధ్య మధ్య తలెత్తిన లెక్క లేనన్ని సమస్యల్ని సర్దుబాటుచేసారు అంతా.
చివరికి మంచి ముహుర్తం చూసుకొని, ఒక రోజును ట్వెంటీ-ట్వెంటీ ఆటగా నిర్ణయించుకున్నారు.
ఆ రోజు రానే వచ్చింది. ఇరవై ఓవర్లలో భీముడు-ఇంకో ముంబాయి ఆటగాడు కలిసి జంటగా 316 పరుగులు తీసారు. ఒక్క వికెట్టూ పడలేదు.
తర్వాత ఆడిన కౌరవుల టీములో సుయోధనుడు, దుశ్శాసనుడు కలిసి పంతొమ్మిది ఓవర్లకు గాను 302 పరుగులు తీసారు. అంతలో వాన మొదలై, ఆటని ఆపాల్సి వచ్చింది.
"మేమే గెలిచాం, మావి 316" అన్నాడు భీముడు. "గెలుపు మాది. ఇంకో ఓవర్లో పద్నాలుగు పరుగులు మాకొక లెక్క కాదు" అన్నాడు సుయోధనుడు.
"ఇప్పుడు ఎవరు గెల్చారన్నా, అన్నవారిని ఓడినవారు బ్రతుకనివ్వరు" అని ముసిముసిగా నవ్వాడు కృష్ణుడు.
అప్పటికప్పుడు భవిష్యత్తుని చూసిన నారదుడు "ఆట 'డ్రా'- ఎవ్వరూ గెలవలేదు. మళ్ళీ ఆడాల్సిందే ఇంకోసారి ఎప్పుడైనా" అన్నాడు తెలివిగా.
"అవునవును" అని కృష్ణుడూ, ద్రోణుడూ తదుపరి మ్యాచ్ కోసం ఆలోచనలు మొదలుపెట్టారు.
అటు తర్వాత ఇంకెప్పుడూ వాళ్ల మధ్య నిజమైన యుద్ధం జరగనే లేదు! అట్లా ప్రపంచంలో అంతా శాంతిని తెచ్చినందుకుగాను దేవతలంతా నారదుడికి 'లోక శాంతి పురస్కారం' ఇచ్చి గౌరవించారు!