అనగనగా ఒక ఊరిలో ఒక హాస్టల్ ఉండేది. (అందులో జీవిత కూడా ఉండేది)
హాస్టల్లో 'ప్రకృతి' ఉండేది కాదు. అయినా అది ఎంతో ఆహ్లాదకరంగా ఉండేది.
అక్కడ ఉన్న పిల్లలందరూ ఎలా ఉండేవారో తెలుసా.....? పిల్లల్లానే ఉండేవారు!
ఆ పిల్లలు తమ దగ్గర ఉన్న డబ్బులు పోతాయనే ఉద్దేశంతో ఆ డబ్బును వార్డెన్‌కి ఇచ్చేవారు. మీకు ఒక రహస్యం చెప్తా.. ఆ వార్డెన్ పిల్లలను అస్సలు పట్టించుకునేది కాదు. తన గదికే పరిమితమై ఉండేది. అమె ఒక పెద్ద తిండిపోతు కూడా! ఏ ఆహార పదార్థం కనిపించినా మిగలకుండా తినేసేది !
కానీ పిల్లలు ఇచ్చిన డబ్బును మాత్రం సొంత పనులకు వాడుకునేది కాదు. ఆ డబ్బునంతా తన గదిలో భద్రంగా దాచేది. ఒక రోజున తన కుమార్తెను ఆ హాస్టల్లో జాయిన్ చేయాలని ఒక దొంగ, అతని- మిత్రుడు, వచ్చారు. సరిగ్గా అదే సమయానికి వార్డెన్ డబ్బును దాస్తున్నది. అది వాళ్ళ కంట పడ్డది.
దొంగ తన కుమార్తెను అక్కడ జాయిన్ చేసేసి, తిరిగి వెళ్తూ మిత్రుడితో "ఒరేయ్ రామూ! ఆమె డబ్బులు ఎక్కడ పెట్టిందో చూసాం కదురా మనం? ఏదో ఒక రోజున దాన్ని దొంగిలించాలి…. ఏదైనా ఉపాయం చెప్పు!" అన్నాడు.
"ఏమోరా, నాకేమీ ఐడియాలు తట్టట్లేదు. నువ్వే చెప్పు ఏమైనా!" అన్నాడు రాము (రాముకి అస్సలు తెలివి లేదు. అందుకనే ఒకరోజున వేరేచోట ఎక్కడో దొంగతనం చేసి, తనమీద తానే పోలీసులకు కంప్లెయింటు ఇచ్చుకున్నాడు!).
"సరేలే, త్వరలో వద్దాం, మళ్ళీ" అన్నాడు దొంగ. (ఇతనికి తెలివి ఉంది)
అదే హాస్టల్లో కళ్ళు లేని వంటామె ఒకామె ఉండేది. (గుడ్డామె వంట ఎలా చేస్తుందని ఆశ్చర్యపోతున్నారు కదూ, ఆమెకు సహాయం చేయడానికి ఇంకొకామె ఉండేదిలే.. ఆమెది ప్రభుత్వం నియమించిన పని, అందుకని ఆమెను ఎవ్వరూ ఏమీ చేయలేకపోయారు! ఇక ఆమె వంట ఎలా ఉంటుందో మీరే ఊహించుకోండి!)
ఆ రోజు వంట అయ్యింది: పిల్లలంతా అయిష్టంగానే తిన్నారు; కానీ వాళ్ళ ఆకలి మాత్రం తీరలేదు! దాంతో వాళ్ళంతా కలిసి 'బయట ఎక్కడైనా హోటల్లో కనీసం ఒక టిఫిన్ తిని రావాలి' అని మాట్లాడుకుంటున్నారు.
అట్లా వాళ్ళు గట్టిగా మాట్లాడుకుంటూండటం విని గుడ్డి వంటామె వచ్చింది అక్కడికి. "ఏయ్..... మీరంతా ఇప్పుడు ఏం చేస్తున్నారు? వెళ్ళండి, వెళ్ళి చదువుకోండి!" అని గట్టిగా అరిచింది. ఆ అరుపు ఎలా ఉందో తెలుసా.…?! అరుపులానే ఉంది! ఇక ఆ అరుపు విని అందరూ చదువుకున్నారు. (లేదు లెండి. చదువుకుంటున్నట్టుగా నటించారు!) కొద్దిసేపు అయ్యాక ఒక్కొక్కరూ ఎప్పటి మాదిరే సైలెంట్ గా బయటికి వెళ్ళిపోయారు!
(ఇంతకీ 'పిల్లలు అట్లా లేచి వెళ్ళిపోతుంటే వార్డెన్ ఏం చేస్తోంది' అని డౌట్ వస్తోంది కదూ... దానికి సమాధానం చాలా పెద్దది- అయినా చెప్పక తప్పదు. అట్లా 'ఆ పిల్లలంతా చదువుకుంటున్నారు కదా' అని గుడ్డి వంటామె తన పనిలో తాను నిమగ్నమై పోయింది కదా; పొద్దున అంతా తినగా మిగిలిన చారును మొత్తాన్నీ ఒక గిన్నెలో పెట్టింది. కానీ ఆ పాత్రకి మూత పెట్టడం మర్చిపోయింది. దాంతో ఆ చారులో బల్లి పడింది! అయితే ఆమెకి ఏమీ కనిపించదు- కాబట్టి ఈ విషయం ఆమెకి తెలీలేదు. ఇంతలో వార్డెన్ గారు వచ్చారు- "నాకు చాలా ఆకలిగా ఉంది, ఏమైనా ఉందా? కొంచెం అన్నం, చారు ఉంటే పెట్టు!" అన్నారు. గుడ్డి వంటామె చక్కగా ప్లేట్ నిండా అన్నం పెట్టి, దానిపైన చారు వేసి వార్డెన్ కి వడ్డించింది. అంతే!
అన్నం మీద కళ్ళు తెరుచుకోని, నాలుక బయట పెట్టి కదలక మెదలక పడిఉన్న బల్లిని చూసే సరికి వార్డెన్ కాస్తా మూర్చపోయింది! అట్లా మూర్ఛపోయిన వార్డెన్, పిల్లలు ఒక్కొక్కరే బయటికి వెళ్ళి తింటే ఇంక ఏమంటుంది?- ఏమీ అనలేదు! అర్థమైందా ఇప్పుడు?)
అట్లా పిల్లలంతా బయటికి వెళ్ళి సంతోషంగా టిఫిన్ చేసి వచ్చారు.
అట్లా కథ కొత్తపల్లికి, మనం సంతోషంగా హాస్టల్ బయటికి! (అయ్యో, దొంగల గురించి చెప్పడమే మర్చిపోయామే.... చెప్తాం ఆగండి ... ఓహ్ సారీ.. ఓపిక లేదులేండి.. మళ్ళీ చెప్తాం.. లేకపోతే మీరే ఊహించుకోండి గదా ప్లీజ్?!)