మనందరికీ 'జాతిపిత ' గా పరిచితుడైన 'మోహన్‌దాస్ కరమ్‌చంద్ గాంధీ' 1869 అక్టోబరు రెండవ తేదీన- గుజరాత్ రాష్ట్రంలోని పోర్‌బందర్‌లో పుట్టాడు- అంటే ఈ అక్టోబరు రెండుకు సరిగ్గా 150 ఏళ్ల క్రితం. వాళ్ళ నాన్న కరంచంద్ గారు అక్కడి రాజావారి సంస్థానంలో దివాన్‌గా పనిచేసేవారు. చిన్నప్పుడు అన్ని విషయాల్లోనూ మధ్యరకంగా ఉండిన గాంధీ, పెద్దవుతూన్న క్రమంలో లండన్‌కి పోయాడు; అక్కడ న్యాయశాస్త్రం చదివి 'బారిస్టరు' పట్టా పుచ్చుకున్నాడు. ఆ తర్వాత దక్షిణాఫ్రికా దేశానికి వెళ్ళి అక్కడ లాయరుగా ప్రాక్టీసు చేసాడు.
తనలాగే అక్కడికి వలస వెళ్లిన భారతీయులకు చాలామందికి ఆ రోజుల్లో అక్కడ ఓటు హక్కు గాని, ఇతర హక్కులు గానీ ఉండేవి కాదు. గాంధీ వారి తరపున పోరాటం నడిపించి, అక్కడి ప్రభుత్వం దిగి వచ్చేలా చేశాడు.. అక్కడి భారతీయులకు హక్కులు వచ్చాయి. అట్లా 'మంచి నాయకుడు'గా ఎలా ఉండాలో నేర్చుకొని మన దేశానికి వచ్చిన గాంధీ, అటుపైన స్వాతంత్రోద్యమంలో చురుకుగా పాల్గొని, అనేక మందికి స్పూర్తినిచ్చాడు. మన జాతీయోద్యమానికే దిశానిర్దేశం చేయగల్గినంత పెద్దరికం సంతరించుకున్నాడు.; 'మహాత్ముడు' అనిపించుకున్నాడు.
1947లో బ్రిటీష్ వాళ్ళు మన దేశాన్ని విడిచి పెట్టి పోయే నాటికి గాంధీ కాస్తా'గాంధీ తాత' అయిపోయాడు. జనాలు, నాయకులు, ఆయనకు ఒకవైపున 'జాతి పిత' అని బిరుదులు తగిలిస్తూనే, మరొకవైపున ఆయన చెప్పిన అనేక విషయాల్ని ప్రక్కన పెట్టేసి, తమకు నచ్చినట్లు చేసారు. వాళ్ళ తీరుకు ఇప్పటి మన తీరుకు ఏమంత పెద్ద భేదం లేదు చూడండి..
ఒక రాజకీయ నాయకుడిగా గాంధీ చెప్పిన సంగతులు, మాట్లాడిన విషయాల విస్తృతి చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. వ్యక్తిగత జీవితం నుండి పరిపాలనా వ్యవహారాల వరకూ గాంధీ తన అభిప్రాయాలు చెప్పని అంశమే కనబడదు. ఇలా తన అభిప్రాయాలను వెలువరించటం కోసం ఆయన 'యంగ్ ఇండియా', 'హరిజన్' అనే రెండు పత్రికలు నడిపాడు. ఎప్పుడు మాట్లాడినా, ఏది రాసినా, 'అందరం సత్యవంతులంగా ఉండాలి' అని మటుకు చెప్పకుండా ఉండలేకపోయేవాడు గాంధీ. 'దైనందిన వ్యవహారాలతో సహా అంతటా నిజం చెప్పటం, నిజాయితీగా ఉండటం, సత్యానికి పెద్ద పీట వేయటం, అంతరంగాన్ని తరచి చూసుకోవటం చాలా అవసరం' అని పదే పదే చెప్పాడు. తన జీవితంలో సత్యాన్ని అమలు చేసేందుకు గట్టి ప్రయత్నమే చేశాడు. నిజం కోసం నిలబడి, అన్నేసి కష్టాలనూ ఎదుర్కున్న హరిశ్చంద్రుడి కథని గాంధీ ఎప్పుడూ గుర్తుచేసుకునేవాడు.
గాంధీ నొక్కి చెప్పిన మరొక సంగతి 'అహింస’. 'దుర్మార్గాన్ని, అన్యాయాన్ని సహించకూడదు; అడ్డుకోవాలి. అయితే అప్పుడు కూడా మన మనసులో మటుకు కోపానికి, వైరానికి తావు ఇవ్వకూడదు. మన లోపల శాంతిని నిలుపుకుంటూ, స్థిర చిత్తంతో చెడును నిలువరించేందుకు ప్రయత్నిస్తూ పోవాలి. తుపాకీతో చేసే యుద్ధంకంటే, సత్యం, శాంతి పునాదులుగా చేపట్టే ఇలాంటి నిరసన బలమైనది' అని గాంధీ నమ్మటమే కాక, దాన్ని ఆచరణలో పెట్టి చూపాడు.
'సమాజంలో అందరం కలిసి ఉండాలి. కలిసి పని చేసుకోవాలి. పనిలో ఎక్కువ తక్కువలు లేవు. బుద్ధి పరంగా జీవించటం, శరీర శ్రమ చేయటం కంటే ఎక్కువ కాదు- నిజానికి శరీర శ్రమే గొప్పది ' అన్న గాంధీ చేతి పనులకు, విక్రేందీకరణకు ప్రాతినిథ్యం వహించాడు. 'అధికారం కొందరి చేతుల్లో ఉండకూడదు, పరిశ్రమల్లో కార్మికుల యాజమాన్యాలుండాలి. కులాల పేరిట, మతాల పేరిట కొట్లాటలు, అంతరానితనం వంటి దురాచారాలు ఉండకూడదు. నాయకులు, యజమాన్యాలు ప్రజల ఆస్తులకు ధర్మకర్తలుగా, బాధ్యతగా ఉండాలి తప్పిస్తే, వాటికి సొంతదారులలాగా నిరంకుశంగా వ్యవహరించకూడదు' లాంటి అనేక అంశాలను గాంధీ తన రచనల్లోను, మాటల్లోనూ ప్రస్తావించటమేకాక, జీవితంలో ఆచరించే ప్రయత్నం చేసాడు.
గాంధీ 150 ఏళ్ల జయంతి సందర్భంలో ఆయనను 'ఒక వ్యక్తిగా' బేరీజు వేయటం కంటే, 'లెక్కలేనన్ని గొప్ప ఆలోచనల్ని వెలువరించిన ఒక తాత్విక శక్తిగా చూడటం' మనందరికీ మేలు అనిపిస్తుంది. ఆయన చెప్పిన విషయాల్లో మంచిని గ్రహించి, దానిని మన నిత్యజీవితాల్లో ఎంత వరకూ అమలు చేయగలమో చూడటం- ఇది మనం చేయాల్సిన పని. 150 ఏళ్ల గాంధీకి ఇవాల్టి రోజున మనం ఇవ్వగలిగే నివాళి కూడా అదే.
ఆదర్శవంతంగా జీవించే గొప్పవాళ్లందరికీ నమస్కారాలతో,
కొత్తపల్లి బృందం