యువరాజు జయరాజు
గారాబముగా పెరిగెను
సంపదలకు కొదువలేదు
పరివారము పదుగురు.

అశ్వశాల గల దాతనికి
అందుగలదు తెలుపు గుర్రం.
వేగముగా పరుగు తీయు
గమ్యము చేరు త్వరగాను.

పెంపుడుకుక్క వారిదే
కనిపించు రాయసంగా
నడచుచుండు రాజు వెంట
ఎంత దూరమైన సాగు.

బస్తీకని వెడలె రాజు
గుర్రమెక్కి స్వారి చేస్తూ
ఒంటరిగా సాగుచుండ
వెంట వచ్చె కుక్క కూడ

కొంత దూరమట్లు సాగె
అంతలోన కుక్క గుర్రానికి అడ్డు తగిలె
రాజు ఎంత అదిలించిన

మాట వినదు; దారినీదు.
రాజుగారు కోపించిరి
ప్రక్కకేల తొలగదు?
ఏల పట్టు విడువదు?!

అని తుపాకి గురి పెట్టిరి
'ఢాం..ఢాం' అని పేల్చిరి.
దెబ్బ తగిలి గాయమయ్యె,
రక్తపు మడుగే ఆయెను.

మూలుగుతూ తూలి పడుచు
కుక్క పోయె వెనుదిరిగి.
కొంత దూరమేగి రాజు
ధనపు మూట తట్టి చూచె

జీను చివర కట్టుకున్న
మూట చేతికందలేదు!
కలత చెందినాడు రాజు
తాను కూడ వెనుదిరిగీ-
మూటకోసమై వెదకుచు
కోట బాట పట్టి పోయె.

డబ్బు మూట తల మాపున
పడి యుండగ బరువుగా
తుది శ్వాసలు పీలుస్తూ
కనిపించెను తనదు కుక్క!

కన్నుల నీరాయె రాజు
తన తప్పుకు సిగ్గు పడె
ప్రధమచికిత్స చేసి దానిని
గుర్రముపై గొని పరుగిడె.

వైద్యుల కనుసన్నలలో
కుక్క తిరిగి బాగైనది
ప్రాణాపాయము తప్పగ
మరల లేచి నిలుచున్నది.

నోరులేని జీవమయ్యు
ప్రేమ యెంత పెంచుకొనెను?!
తొందరపాటుతనం
ఎంతకీడు చేసేను!