పల్లవ రాజ్యాన్ని పాలించే పురుషోత్తముడికి సమర్థుడు, మంచివాడు అని పేరు.

సలహాదారులపైననే ఆధారపడకుండా, తన సేనాపతిని వెంటబెట్టుకొని, మారువేషంలో రాజ్యమంతా సంచరిస్తూ, ప్రజల కష్టలను తెలుసుకొని పరిష్కరించే జయనందనుడు ప్రజల ప్రేమాభిమానాలను చూరగొన్నాడు. పల్లవ రాజ్య సైన్యం కూడా చాలా గట్టిది.

పల్లవానికి పొరుగున ఉన్న అవంతికకు రాజు జయనందనుడు. అతనికి పురుషోత్తముడిని చూస్తే అసూయ. ఎలాగైనా ఆ రాజ్యన్ని హస్తగతం చేసుకోవాలని అతనికి కోరిక. నేరుగా యుద్ధం చేసి ప్రయోజనం లేదు- ఎందుకంటే సైన్యం పరంగా అవంతిక చాలా చిన్నది. అందువల్ల కుట్రల మార్గాన్ని ఎంచుకున్నాడు జయనందనుడు.

అవంతికలో ఉండే చాలా మందికి పల్లవ రాజ్యంలో బంధుత్వాలు ఉన్నాయి. జయనందనుడి మనుషులు ఒక క్రమంలో తమ బంధుత్వాలను గట్టి చేసుకుంటూ వచ్చారు. 'ఆ బంధువుల్లో ఎవరెవరు పురుషోత్తముడికి వ్యతిరేకంగా పని చేయగలరు?' అని పరిశీలిస్తూ వచ్చారు వాళ్ల మంత్రులు. వాళ్లందరికీ లక్ష్మయ్య అనే వాడొకడు నచ్చాడు.

లక్ష్మయ్య పురుషోత్తముడి అంత:పుర పరిచారకుల్లో ఒకడు. తన విధుల్లో భాగంగా అతనికి రాజుగారి గురించిన విలువైన సమాచారం చాలా తెలుస్తూ ఉంటుంది. లక్ష్మయ్య బంధువైన భూషణం అతనికి బహుమతులు ఇస్తూ మెల్లగా తన దారికి తీసుకొచ్చుకున్నాడు. ఆ పైన రాజు గారి గురించిన చిన్న చిన్న సమాచారాలకు గాను కొద్ది కొద్దిగా లంచాలు ముట్టజెబుతూ, అతనికి మరింత దగ్గరైనాడు. 'ముఖ్యమైన సమాచారాన్ని తాను ఎలాగూ ఇవ్వట్లేదు; తను ఇచ్చే సమాచారం వల్ల రాజుగారికి ఎలాంటి నష్టమూ ఉండదు' అన్న గుడ్డి నమ్మకంతో లక్ష్మయ్య కూడా అతనిచ్చిన డబ్బులు తీసుకుంటూ వచ్చాడు.

కొన్నాళ్ళు ఇలా గడిచాక ఒకసారి భూషణం లక్ష్మయ్యను నేరుగా అడిగేసాడు- "రాబోయే వారం రోజుల్లో మీ రాజుగారు ఎటు ఎటు వెళ్తున్నారు? ఎవరెవర్ని వెంట తీసుకెళ్తారు?" అని.

లక్ష్మయ్య అటూ ఇటూ చూసి, అతని చెవిలో ఏదో విషయం చెప్పి, వెయ్యి వరహాలు పుచ్చుకున్నాడు.

డబ్బులు ఐతే తీసుకున్నాడు గాని, లక్ష్మయ్యకు 'తను తప్పు చేసాడు' అనే భావన ఎక్కువైపోయింది. ఇంకో రెండు రోజులు గడిచేసరికి అతనిక ఆగలేక, తన మిత్రుడు రాజయ్య అనేవాడిని కలిసి, తను చేసిన పని అంతా చెప్పుకొని, "ఈ వారం చివర్లో దేశ పర్యటనకు వెళ్లినప్పుడు రాజుగారి ప్రాణాలకు ముప్పు అనిపిస్తున్నది. నువ్వు ఎలాగైనా ఆయన్ని కాపాడాలి. అయితే నా పేరు మాత్రం బయటికి రాకుండా చూడు. నా ప్రాణాలు పోతాయి" అని కాళ్ళావేళ్ళా పడ్డాడు.

రాజయ్య ఒక మామూలు పశువుల కాపరి. సమస్య అర్థమయ్యేసరికి అతనికి చెమటలు పట్టాయి. "ఇదంతా నా వల్ల ఎక్కడౌతుంది" అని అతను వెనకంజ వేసాడు; కానీ ఆతను పెంచుకుంటున్న రామచిలుక "మణి" మటుకు ఇదంతా విని, "నాకు చెప్పావుగా, అంతా నేను చూసుకుంటానులే, పో ఇంక" అనేసింది.

లక్ష్మయ్య నవ్వి, దానికి ఓ నమస్కారం పెట్టి వెళ్ళిపోయాడు గాని, రాజయ్యకు మటుకు చాలా భయం వేసింది. "ఇవన్నీ రాజులకు సంబంధించిన విషయాలు- నీకేం తెలుసని, అట్లా ఊరికే మాట ఇచ్చావు?" అని అరిచాడు అతను, మణిని.

మణి మాత్రం "నన్ను వెంటనే రాజుగారి కోటకు తీసుకెళ్ళు. అంతా నేను చూసుకుంటాను" అంటోంది ఆపకుండా. రాజయ్య గబగబా తన పశువులన్నిటినీ యజమాని ఇంటి వద్దకు చేర్చి, మణితో కోటకు చేరుకున్నాడు. "రాజుగారిని అత్యవసరంగా కలవాలి! ఒక ముఖ్యమైన సమాచారం తెచ్చాను" అని కబురు పంపాడు. "మమ్మల్ని నేరుగా రాజుగారి దగ్గరికి తీసుకెళ్ళండి. వెంటనే!" అనసాగింది మణి.

రాజయ్యని, మణిని మార్చి మార్చి చూసిన ద్వారపాలకులు వాళ్ళని నేరుగా కోటలోకి తీసుకెళ్ళారు.

రాజయ్య లోపలకు ప్రవేశించి మహారాజును చూడగానే ఆయన కాళ్ళమీద వాలి, మూర్ఛపోయాడు! మరి ఇక పైకి లేవలేదు!! మణి కంగారు పడుతూ "నువ్వు చెబుతావా, నేను చెప్పాలా?" అంటోంది. మూర్ఛ పోయిన రాజయ్యకేసి దయతో చూసి పురుషోత్తముడు, చిలుకతో "ఏమైంది, నువ్వే చెప్పు!" అన్నాడు.

"రహస్యం" అంది చిలుక.

మహారాజు సైగతో చుట్టు ప్రక్కల కాపలా వాళ్లు అక్కడనుండి వెళ్ళిపోయారు.

"ఊ ఇప్ప్పుడు చెప్పు!"

చిలుక జరిగిందంతా చెప్పింది రాజుగారికి. ఆలోగా మూర్ఛనుండి తేరుకున్న రాజయ్య, బిత్తరపోతూ అటూ ఇటూ చూసాడు. "శభాష్‌ రాజయ్యా! చిలుకలను సరదాగా పెంచుతారని తెలుసు, కానీ నువ్వు మాటలు కూడా నేర్పించినందుకు నిన్ను అభినందిస్తున్నాను. మణి నాకు అంతా చెప్పిందిలే. కంగారేమీ లేదు" అంటూ రాజయ్యను మెచ్చుకొని, చిలుకను చేతిలోకి తీసుకొని ప్రేమతో దాని తల నిమిరాడు మహారాజు.


ఆ వారాంతంలో పురుషోత్తముడు ముందు అనుకున్న విధంగానే దేశ పర్యటనకు పోయాడు. మారు వేషంలో నగరం పొలిమేరలు దాటి సీతాపురం ప్రవేశిస్తున్నాడు. ఆయన అక్కడ ఒక మలుపు తిరిగాడో, లేదో- ఆయనకోసమే వేచి ఉన్న భూషణం, పొరుగుదేశపు సైనికులు ఆయన్ని చుట్టుముట్టారు. "మర్యాదగా లొంగిపోండి! మీరెవరో మాకు తెలుసు" అన్నాడు భూషణం, కోరగా నవ్వుతూ.

అందుకు సిద్ధంగా ఉన్న పురుషోత్తముడు తక్షణం కత్తి ఝుళిపించి వాళ్లతో పోరాడటం మొదలు పెట్టాడు. అంతలోనే ఆయనకు మద్దతుగా పెద్ద బలగంతో వచ్చి పడిన సేనాపతి, దుండగులందరినీ చటుక్కున బంధించేసాడు!


భూషణాన్ని, అతనితోబాటు వచ్చిన అవంతి సైనికుల్ని బంధించి సభలో ప్రవేశ పెట్టారు. భూషణం వాంగ్మూలం మేరకు భటులు లక్ష్మయ్యను కూడా బంధించి నిలబెట్టారు. జరిగింది చెప్పుకొమ్మన్నారు లక్ష్మయ్యను..

వరహాలకు ఆశపడి రాజద్రోహం చేశానని లక్ష్మయ్య ఒప్పుకున్నాడు.

"అయితే ఈ సంగతి రాజయ్యకు ఎందుకు చెప్పావు?" అడిగింది మణి, రాజుగారి ప్రక్కనే కూర్చొని. "రాజుగారు మంచివాడు. 'ఈ దుర్మార్గులు ఆయన్ని ఏమైనా చేస్తారేమో' అని భయం వేసింది. చివరికి ఏం చేయాలో తెలీక, నా మిత్రుడు రాజయ్యకు చెప్పుకున్నాను" అన్నాడు లక్ష్మయ్య.

"నేను అక్కడ ఉన్నాను కాబట్టి సరిపోయింది. లేకపోతే ఎంత కష్టం అగును?" అంది మణి. ఆ మాటలకు సభలో నవ్వులు విరిసాయి.

పురుషోత్తముడు మణిని ఉద్దేశించి "వీళ్లందరికీ ఎలాంటి శిక్ష విధించాలో నువ్వే చెప్పు!" అన్నాడు.

"భూషణానికి మరణశిక్ష, ఈ విదేశీ సైనికులకు కారాగారవాసం సరిపోతాయి. లక్ష్మయ్య తప్పు చేసినా, తన తప్పుని గుర్తించి పశ్చాత్తాప పడ్డాడు; దాన్ని సరి దిద్దుకునేందుకు తపించాడు. అందువల్ల అతనికి వేరే పెద్ద శిక్షలేవీ వద్దు. ఉద్యోగంలోంచి తీసెయ్యండి చాలు" అన్నది మణి.

మణి చెప్పిన దానికి సభ మొత్తం చప్పట్లతో మారుమ్రోగింది.

"నీ తీర్పును వెంటనే అమలు చేస్తున్నాను" అని వెంటనే దాన్ని అమలు చేయించాడు మహారాజు. రాజయ్యను, మణిని రత్నహారాలతో సత్కరించాడు. సభలో మళ్ళీ ఓసారి చప్పట్లు, నవ్వులు విరిసాయి.

పురుషోత్తముడు లేచి నిలబడి చిలుకను అభినందిస్తూ, "నువ్వు చాలా తెలివైనదానివి. నిజంగానే నువ్వు అక్కడున్నావు కాబట్టి సరిపోయింది. లేకపోతే ఎంత ప్రమాదం అగును?! నీకు రాజనీతి కూడా బాగా తెలుసు.. నువ్వు నాతోబాటు ఉండరాదూ?" అన్నాడు.

"మా రాజయ్య ఉంటానంటే నేనూ ఉంటా!" అన్నది మణి ఉత్సాహంగా.

రాజుగారు రాజయ్యకి, మణికి ఇద్దరికీ తన అంత:పురంలో ఉద్యోగాలు ఇచ్చారు.