
ఒక ఊళ్ళో రాజు అనే పిల్లవాడు వుండేవాడు. అతనికి ఏ పని చేయాలన్నా చాలా నిర్లక్ష్యం. ఒక రోజున వాళ్ల అమ్మ అతనికి ఒక పని చెప్పింది: వాళ్ల వీధి చివర్లోనే, చెక్కపని చేసే వడ్రంగి ఒకడు ఉంటాడు. 'అతన్ని రమ్మని చెప్పురా, కుర్చీలు - మంచాలు అన్నీ చిన్న చిన్న రిపేర్లు ఉన్నాయి' అని.
"అబ్బ! అమ్మా! టైం ఐపోతున్నది. నేను ఇంకా తల దువ్వుకోవాలి; బ్యాగు సర్దుకోవాలి!" అన్నాడు రాజు.
"ఇప్పుడు చెప్పక్కర్లేదులే, నువ్వు బడికి పోయేటప్పుడు ఎట్లాగూ వాళ్ల దుకాణం ముందునుండే వెళ్తావుగా? అప్పుడు చెబితే చాలు!" అన్నది అమ్మ.
"సరేలే! అప్పుడు చెబుతాను!" అన్నాడు రాజు.
రాజు స్కూలుకు బయలుదేరుతుంటే మళ్ళీ గుర్తు చేసింది అమ్మ- "వడ్రంగిని పిలవాలి" అని.
"అబ్బ! ఎన్నిసార్లు చెప్తావమ్మా! నేను పిలుస్తానన్నానుగా?!" అన్నాడు రాజు.

అనటమైతే అన్నాడుగాని, వాడు ఆ సంగతి మర్చేపోయాడు. నేరుగా బడికి వెళ్ళిపోయాడు.
కనీసం సాయంత్రం బడినుండి వచ్చేటప్పుడు కూడా వాడికి వడ్రంగి మాట గుర్తుకు రాలేదు. తీరా ఇంటికి వచ్చాక వాళ్ళ అమ్మ "నేను వడ్రంగిని పిలువమని చెప్పాను కదా, పిలిచావా?" అని అడిగింది.
"రేపు చెబుతానులేమ్మా!" అన్నాడు రాజు.
తర్వాతి రోజు ఉదయాన్నే అమ్మ "ఇంట్లో వైరింగుతో ఏదో సమస్య ఉన్నది. వడ్రంగి దుకాణం ప్రక్కనే కరెంటు పని చేసే అన్న ఉంటాడు. అతన్ని కూడా పిలు!" అన్నది.
"అబ్బ! ఎప్పుడూ ఏదో ఒక పని చెబ్తూనే ఉంటావు! మళ్ళీ పిలుస్తాన్లేమ్మా!" అన్నాడు రాజు.
తరువాత వాడు అది కూడా పూర్తిగా మర్చి పోయాడు.
ఇట్లా అమ్మ రోజూ ఏవో పనులు గుర్తు చేయటం; రోజూ రాజు ఇలాగే జవాబులివ్వటం- పనులు మాత్రం జరగనే లేదు. అంతలో రాజు పుట్టిన రోజు వచ్చింది. ప్రతి సారి లాగానే ఈసారి కూడా వాళ్ల ఫ్రెండ్స్‌ని బర్త్‌డే పార్టీకి పిలవాలని ఉత్సాహపడ్డాడు రాజు.

"సరేలే, రమ్మను అందరినీ" అన్నది అమ్మ. "అలాగే ఆ చెక్కపని చేసే అతన్ని కూడా పిలువు- ఇంట్లో కుర్చీలు మంచాలు ఏవీ అస్సలు బాగా లేవు" అన్నది.
ఆ రోజు కూడా వడ్రంగిని పిలవలేదు రాజు. ఇంక సాయంత్రం అవుతుందనగా అతని మిత్రులంతా వచ్చారు. వాళ్ళు వచ్చి మంచం మీద కూర్చోగానే మంచం విరిగిపోయింది. కుర్చీల్లో కూర్చోమంటే కుర్చీలు విరిగిపోయాయి. అంతలో సాయంత్రమైందని కరెంటు స్విచ్ వేయగానే టప్ మంటూ లైట్లు అన్నీ ఆఫ్ అయిపోయాయి! పార్టీ అంతా చీకట్లోనే నిలబడి, క్యాండిళ్ల వెలుగులో జరపాల్సి వచ్చింది.
మిత్రులంతా వాళ్ల వాళ్ళ ఇళ్ళకు వెళ్లిపోయాక కూడా అమ్మ ఏమీ అనలేదు. అయినా అప్పుడు అర్థమైంది రాజుకి- 'ఎప్పుడు చేసే పనిని అప్పుడే చేయాలి' అని!