'మీజింగ్' తరం నాటి పురాతన జపాన్‌లో 'నాన్-ఇన్' అనే బౌద్ధ గురువు ఒకాయన ఉండేవాడట. 'ఈ క్షణంలో జీవించటం' గురించి లోతుగా వివరిస్తుండేవాడు ఆయన.

ఆయన్ని అడిగి సందేహాలు తీర్చుకుందామని ఆయన దగ్గరికి ఎక్కడెక్కడినుండో సత్యాన్వేషులు, జిజ్ఞాసువులు వస్తుండేవాళ్ళు. అట్లా వచ్చిన వాళ్ళందరికీ ఆయన తనదైన రీతిలో ధర్మాన్ని బోధించేవాడు. 'ఎట్లా చెబితే అవతలివాళ్ళు సత్యాన్ని స్వీకరించగల్గుతారో అట్లా' చెప్పి, వాళ్లలో బోధిని జాగృతం చేసే నేర్పు ఉండేదిట ఆయనకు.

ఒకసారి ఆయన దగ్గరికి విశ్వవిద్యాలయంలో బోధించే ఆచార్యుడు ఒకాయన వచ్చాడు. ఆయన చాలా పెద్ద మనిషి, ముఖ్యుడు, రాజుగారికి ఆంతరంగికుడున్నూ. ఆయన చుట్టూ ఉన్న వాళ్ళంతా ఆయన్ని చూసి భయపడేవాళ్ళు; ఆయన ఏం చెబితే అది కిమ్మనకుండా చేసేవాళ్ళు. 'అధికారానికి, విజ్ఞానానికీ రెండింటికీ చిరునామా తనే' అని ఆయనకు చాలా గర్వంగా ఉండేది.

ఆయన వచ్చే సరికి 'నాన్-ఇన్' అప్పుడే పొలం పని ముగించుకొని వచ్చి కూర్చొని ఉన్నాడు. "మిమ్మల్ని అడిగి మీ దగ్గర జెన్ బౌద్ధం నేర్చుకుందామని వచ్చాను. దయచేసి నాలో మీరు బోధిని జాగృతం చేయాలి" అన్నాడాయన, నాన్-ఇన్ చేతులు పట్టుకొని.

ఆయన అడిగిన తీరు చూస్తే 'జాగృతం చేయకపోతే ఊరుకోను!" అని ఉరిమినట్లే ఉంది. నాన్-ఇన్ నవ్వి, "ఆ సంగతి మనం టీ త్రాగుతూ మాట్లాడుకుందాం రండి" అని లోపలికి తీసుకెళ్ళాడు.

నాన్-ఇన్ టీ కషాయం తయారు చేస్తుండగా ఆయన కూర్చొని మాట్లాడుతూ పోయాడు- "సమయం విలువైనది కదా, ముందుగా మీకు నేనెవరో చెబుతాను" అంటూ కొద్దిసేపు తానెవరో, తనకు ప్రభుత్వంతో ఎంత దగ్గరి తనమో చెప్పాడు. ఆ తర్వాత "నేను పుట్టినప్పటినుండీ జ్ఞానేచ్ఛ బాగా ఉంది. చిన్న తనంలోనే త్రిపిటకాలు మూడూ కూడా, ఆ చివర్నుండి ఈ చివరివరకూ చదివాను. తర్వాత 'ఈ ఈ ఫలానా' పండితుల దగ్గర శిష్యరికం చేసాను. వాళ్ళ దగ్గర ఇదిగో, 'ఈ ఈ' విద్యలు నేర్చాను. ఈ‌ విద్యలో అన్నీ‌ బాగున్నాయి గాని, 'ఇది బాగా లేదు'- అందులో 'ఇది బాలేదు'. ఏం చేసినా ప్రాక్టికల్ గా ఉండాలి, నేను ఎప్పుడూ ప్రాక్టికల్ గా ఆలోచిస్తాను.." అంటూ పలు సంగతులు అనర్గళంగా మాట్లాడాడు.

నాన్ ఇన్ చిరునవ్వుతో ఆయన మాటలు వింటూ పోయాడు. 'టీ పాట్'ను, ఖాళీ కప్పును తెచ్చి ఆయన ముందు పెట్టాడు. వచ్చిన ఆచార్యుడు చెబుతూ పోతున్నాడు- "నేను అనేక రకాల బౌద్ధాలే కాదు, ప్రపంచంలోని పలు మతాలను, సిద్ధాంతాలను కూడా చదివాను. వాటిమీద అనేక సిద్ధాంత వ్యాసాలు కూడా ప్రచురించి ఉన్నాను. నిజానికి నాకు అన్ని రకాల బౌద్ధాలూ తెలుసు. జెన్ బౌద్ధం కూడా తెలుసు. కన్‌ఫ్యూషియన్ తత్వానికి, సింహళ తత్వానికి మధ్య సామ్యం గురించి కూడా చాలా చర్చలు చేసి ఉన్నాను" అని ఇంకా చెబుతూ పోతున్నాడాయన.

"ఊ.." కొడుతూనే నాన్-ఇన్ అతని ముందున్న టీ కప్పులోకి తేనీరు పోయటం మొదలు పెట్టాడు. ఒక ప్రక్కన మాట్లాడుతున్నాయన ముఖంకేసే చూస్తూ, మరొక ప్రక్కన కప్పులోకి టీ వొంపుతున్నాడు...

టీ కప్పు నిండింది, కానీ నాన్-ఇన్ టీ పొయ్యటం‌ ఆపలేదు! ఈయన టీ పోస్తున్నాడు; అది పొరలి పోతున్నది. ఈయన నవ్వు ముఖంతో ఇంకా టీ పోస్తున్నాడు; అది ఇంకా పొరలిపోతున్నది...

మాటల్లో పడ్డ ఆచార్యుడు తన ముందున్న కప్పును అకస్మాత్తుగా చూసి, గట్టిగా అరిచాడు- "చాలు! చాలు! ఆపండి! మీరు పోస్తున్న టీ మొత్తం‌ ఒలికిపోతున్నది! కప్పు నిండిపోయింది గదా, దానిలో ఇంకేం పడుతుంది?!" అని.

నాన్-ఇన్ టీ పొయ్యటం ఆపి, అతిథివైపు చూసి నవ్వాడు-

"అవును. నిండిన కప్పులో ఇంకేం పడుతుంది? కప్పు ఖాళీ అయితే, అప్పుడు కదా, నేర్చుకునేది!" అన్నాడు.