పరగణాలపల్లిలో నివసించే ప్రతాప్‌ పెద్ద సోమరి. ఏ పనీ చేసేవాడు కాదు; ఎక్కడికీ వెళ్ళేవాడు కాదు; ఏ బాధ్యతా మోసేవాడు కాదు. ఇంట్లోనే కూర్చుని, భార్య మంగమ్మతో రుచికరంగా వంటలు చేయించుకొని తింటూ, కాలం గడిపేవాడు.

మంగమ్మ ఓర్పు గల ఇల్లాలు. భర్తను పల్లెత్తు మాట అనకుండా, అతను చెప్పినట్లల్లా వింటూ ఉండేది- 'ఏదో ఒకనాడు భర్తలో మార్పు రాకపోతుందా' అని ఆశగా ఎదురు చూస్తూ ఉండేది.

'కూర్చొని తింటే కొండంత ఆస్తులైనా కరిగిపోతాయి' అని సామెత. 'పనీ పాటా లేకుండా తింటూ పోతే వచ్చే పాట్లు తప్పుతాయా?' అని ఆమె చాలా రోజుల పాటు మథనపడింది, చివరికి ఒక రోజున కచ్చితంగా నిర్ణయించుకొని, ఉదయాన్నే లేచి పెద్ద మార్కెట్టుకు వెళ్ళింది. తన దగ్గరున్న డబ్బులకు సరిపడా కాయగూరల్ని పెద్ద మొత్తాల్లో హోల్-సేల్ ధరల్లో కొన్నది; ఆటోలో వేసుకొని వచ్చింది !

ఆ మూటల్ని ఆమె ఒక్కతే ఆటోలోంచి దింపుతుంటే, భర్త ప్రతాప్‌ ఊరికే చూస్తూ కూర్చున్నాడు తప్ప, కనీసం దగ్గరకు వెళ్ళి చేతి సాయం కూడా చెయ్యలేదు.

మంగమ్మ ఒక్కతే వాటిని అన్నిటినీ మోసుకొచ్చి, ఇంటి ముందు వసరాలోకి చేర్చి, తక్షణమే అక్కడ అంగడి ప్రారంభించింది. కొద్ది రోజులు గడిచేసరికి చుట్టుప్రక్కల ఇళ్లవాళ్లంతా కూరగాయల కోసం ఆమె దగ్గరికే రాసాగారు; కానీ ప్రతాప్‌ మటుకు ఆ పని తనది కానట్లు, వసారాలో ఉన్న అరుగుమీదనుండి కదలకుండా గుండ్రాయిలాగా కూర్చుని ఉండేవాడు. మంగమ్మ వంటపనిలో‌ ఉన్నప్పుడు ఎవరైనా ఇరుగు పొరుగులు వచ్చి, తమకు కావలసిన కాయగూరలేంటో చెప్పినా, అతను వినీ విననట్లు ఊరుకునేవాడు తప్ప ఆ కూరలు తూచి ఇచ్చేవాడు కాదు.

ఒక్కోసారి వాళ్ళు గొడవకు కూడా దిగేవాళ్ళు- "ఏం మనిషివయ్యా నువ్వు? భార్య కష్టపడుతుంటే కూర్చొని తినడమేనా, నీ పని?! అంగట్లో కూర్చోవటం కూడా చేతకాదా, నీకు? ఛీ! ఏం బతుకయ్యా?!" అని ముఖం మీదే తిట్టేవాళ్ళు. అలాంటి సందర్భాలలో కూడా ప్రతాప్ లేచి పని చేసేవాడు కాదు: మంగమ్మే, తను చేస్తున్న పనిని ఆపుకొని వచ్చి, వాళ్ళకు కావలసిన కూరగాయలు ఇచ్చి పంపేది!

అయినా, కాయగూరలు అందరికీ అవసరమే కాబట్టి, మంగమ్మ మాట తీరు బాగుంటుంది కాబట్టి, ఆమె వ్యాపారం బాగానే సాగింది.

రాను రాను ప్రతాప్ బరువు పెరగసాగాడు. నడిస్తే కూడా ఆయాసం అవుతున్నది. మంగమ్మకు భర్త ఆరోగ్య విషయమై భయం వేసింది. దీనికోసం ఏంచేయాలో చెప్పమని తనకు పరిచయం ఉన్న ఓ డాక్టర్‌ గారిని సలహా అడిగింది.

ఆ డాక్టరుగారు స్థానికుడు,; ప్రతాప్‌ గురించి చిన్నప్పటినుండి బాగా తెల్సినవాడు- కనుక అతనితో చనువుగా "ప్రతాప్! మీ ఇంటి ముందు చాలా స్థలముంది కదా, అక్కడ ఆకు కూరలో, కాయగూరలో పండించకూడదూ? నీకూ బాగుంటుంది, మంగమ్మ కూరగాయల అంగడికీ కొంత ఆదాయం వస్తుంది?!" అని చెప్పి చూసాడు. కానీ ప్రతాప్‌కు ఆయన మాటలు చెవికి ఎక్కలేదు.
చూస్తూ చూస్తూండగానే ఒకనాడు ప్రతాప్‌ జబ్బు పడ్డాడు. మంగమ్మ అతన్ని ఆస్పత్రిలో చేర్చింది. డాక్టరుగారు రకరకాల పరీక్షలు చేయించి, 'శరీరంలో చెడు క్రొవ్వు చాలా పేరుకుపోయింది ప్రతాప్! నీ రక్తనాళాలు మూసుకుపోతున్నాయి. రక్తపోటు ఎక్కువైంది. నువ్వు ఇట్లాగే ఉంటే తొందరలో గుండెజబ్బుతోపాటు, చక్కర రోగం లాంటివి కూడా వచ్చే ప్రమాదం ఉంది! దీనికి గాను నీ శరీరానికి బాగా ఎక్సర్‌సైజులు అవసరం. రోజూ ఉదయం పూట చకచకా నడవాలి, చెమట ఓడ్చే పనులు చెయ్యాలి, పట్నంలో నాకు తెలిసిన జిమ్ ఒకటి ఉన్నది. వాళ్ళు డబ్బులు తీసుకొని, నీకు చెమటలు తెప్పిస్తారు' అన్నాడు.

'శరీరంలో కొవ్వు పేరుకోవటం; పట్నం, జిమ్‌, ఎక్సర్‌సైజు, డబ్బులు' అనగానే ప్రతాపుకు తెలివి మేలుకున్నది.

"నేను ఇక్కడే బాగా శ్రమ పడతాను డాక్టరు గారు, మూటలు మోస్తాను, చెమటలు వచ్చేట్లు నేలను దున్నటం, కలుపు తియ్యటం, నీళ్ళు కట్టటం చేస్తాను. పట్నం వెళ్లకుండా సరిపోదా?" అన్నాడు.

"ఇక్కడ ఉంటే నువ్వు పని చేయవు ప్రకాశ్; చూస్తున్నాను కదా. ఇంట్లో ఉన్న చోటినుండి లేవవు నువ్వు. జిమ్‌ వాళ్లకైతే నీలాంటి వాళ్లచేత ఎట్లా ఎక్సర్ సైజులు చేయించాలో బాగా తెలుసు. నువ్వు వాళ్ల దగ్గరికి వెళ్తేనే నయం" అన్నారు డాక్టరు గారు.

"ఈసారి ఆ మాటలు ప్రతాప్ మనసులో బాగా ప్రభావం చూపాయి. ఇంటికి వెళ్లగానే అతను పూనుకొని, పెరడునంతా బాగా గుల్ల చేసి, చదును చేసి, పాదులు కట్టి, తడి పెట్టాడు. సాయంత్రం కాగానే విత్తనాల అంగడికి పోయి. అక్కడ ఆకుకూరల, కాయకూరల విత్తనాలు తెచ్చి నాటాడు..

ఆ రోజు అతను చాలా అలసిపోయాడు. శారీరక శ్రమ చేయటం వల్ల అతనికి ఇప్పుడు బాగా చెమట పట్టింది. రాత్రంతా కదలకుండా పడుకున్నాడు. మామూలుగా రాత్రిళ్ళు అసలు నిద్ర అన్నది ఎరుగక అలమటించే ప్రతాప్, ఆ రోజున ఒళ్ళు మరచి నిద్రించాడు. నిద్ర సుఖం ఎంత తియ్యనిదో అతనికి ప్రత్యక్షంగా తెలిసి వచ్చింది.

ఇక అలా అతను ప్రతిరోజూ అతను ఉత్సాహంగా పనిచేయసాగాడు. చూస్తుండగానే వారాలు గడిచిపోయాయి. ఆకుకూరలు కోతకు వచ్చాయి. బీర, వంగ, మిరప, టమేటా వంటి కాయగూరల చెట్లన్నీ ఏపుగా పెరిగినై. కాత మొదలైంది. రోజులు గడిచే కొద్దీ వారికి వచ్చే ఆదాయం కూడా బాగా పెరిగింది. అంతకుముందు మజ్జుగా, సోమరిగా ఎక్కడబడితే అక్కడ కూలబడే ప్రతాప్ ఇప్పుడు తన పనిని తాను కల్పించుకుంటున్నాడు. ఉత్సాహంగా కూడా ఉన్నాడు. మూడు నెలల తర్వాత మంగమ్మ అతను కలిసి డాక్టరు గారి దగ్గరికి వెళ్ళారు మళ్ళీ. ఈసారి పరీక్షల్లో‌ అతను పూర్తి ఆరోగ్యంగా ఉన్నట్లు తేలింది!

"శ్రమ చేసే శరీరం చూసావా, ఇలా చలాకీగా ఉంటుంది" అని డాక్టరుగారు అంటే మంగమ్మ, ప్రతాప్ ఒకరినొకరు చూసుకొని నవ్వుకున్నారు.