రామయ్య అమాయకుడు, ఎప్పుడూ మాయ మంత్రాల గురించి ఆలోచిస్తూ ఉండేవాడు. "అల్లాఉద్దీన్ కథలోలాగా నాకు కూడా ఒక మంత్రాల దీపం దొరికితే ఎంత బాగుంటుంది?! భూతం "నీకేం కావాలో చెప్పు. తెచ్చిస్తాను" అని అడిగితే ఎంత బాగుంటుంది?!" అని, గాలిమేడలు కట్టుకుంటూ ఉండేవాడు.

"ఎప్పుడూ అట్లా పడుకొని ఉండకు- కొంచెం పని చెయ్యి!" అని వాళ్ల అవ్వ పోరుతుండేది. చివరికి వాడు ఇంక ఆ పోరును తట్టుకోలేక, పట్నం బయలు దేరాడు.

అయితే దారిలోనే వాడు బాగా అలసిపోయి, ఓ చెట్టు క్రింద చేరగిలబడ్డాడు. మనిషైతే ఆగిపోయాడు కానీ, ఆలోచనలు ఆగవు కదా? అవి వాడిని నడిపించాయి...

ఆ రోజున పట్నంలో ఎక్కడలేని తినుబండారాలు, వింత బొమ్మలు కనిపించాయి వాడికి. తినుబండారాలను చూడగానే వాడికి నోరూరింది; బొమ్మల్ని చూడగానే పనులు చేసిపెట్టే భూతం గుర్తుకొచ్చింది. వాడు అట్లా నిలబడి ఉంటే, దుకాణం అతను "ఏం కావాలి నీకు?" అని అడిగాడు. "మీ దగ్గర అల్లాఉద్దీన్ దీపం లాంటివి ఏమైనా ఉన్నాయా?" అన్నాడు రామయ్య.

దుకాణం అతను నవ్వి, "ఉన్నాయి, అయితే అవి డబ్బులకు దొరకవు. నాకు నువ్వు సొంతంగా కొట్టిన కట్టెలు ఒక బండెడు తెచ్చిస్తే అప్పుడు ఇస్తాను" అన్నాడు. "నేనా? కట్టెలు కొట్టాలా?!" అనుకుంటుండగానే రామయ్యకు మెలకువ వచ్చింది. చూస్తే వాడు ఇంకా మర్రిచెట్టు క్రిందనే కాళ్ళు చాపుకొని పడుకొని ఉన్నాడు!

కలలోనే అయితేనేమి, అసలు తనకు ఒక దీపం దొరుకుతుందన్న ఆలోచన వాడికి చాలా సంతోషాన్నిచ్చింది. వాడు అడవిలో అంతా తిరిగి, ఎండిపోయిన చెట్ల కొమ్మలూ, గట్రా ఏరుకొచ్చి, వాటినన్నిటినీ పేర్చి, ఆ మోపును నెత్తిన పెట్టుకొని పట్నం చేరుకున్నాడు.

అట్లా తిరుగుతూ తిరుగుతూ వాడు ఓ మిఠాయి దుకాణం దగ్గరకు చేరుకున్నాడు. అంగడిలో మిఠాయిలు చూసే సరికి ఇంక వాడికి అడుగు ముందుకు పడలేదు. దుకాణం అతను వీడి వాలకం చూసి, "కట్టెలు అమ్ముతావా?" అని అడిగి, వాడి చేతిలో నాలుగు నాణాలు పెట్టటమే గాక, కొన్ని స్వీట్లు కూడా ఇచ్చాడు.

రామయ్య వాటిని సంతోషంగా అందుకొని, తింటూ "నేను అల్లావుద్దీన్ దీపం లాంటి దీపం కోసం వెతుకుతున్నాను. అవి ఎక్కడ దొరుకుతాయో తెలుసా, మీకు?" అని అడిగాడు దుకాణం అతన్ని.

అతను నవ్వి, "ప్రక్కనే మా అన్న దుకాణంలో ఉంటాయి, కానీ అవన్నీ వట్టి బొమ్మలు. కోరికలు తీర్చేవి ఈమధ్య అట్లా దీపాల్లాగా ఉండట్లేదు" అన్నాడు. "అయ్యో! మరి ఇప్పుడు నా కోరికలు తీరాలంటే ఎలాగ?" అన్నాడు రామయ్య విచారంగా.

"దానిదేముంది? ఇందాక నువ్వు 'మిఠాయిలు కావాలి!' అనుకోగానే నీకు అవి దొరికినై గదా, ఇంకేమి, నీ దగ్గర ఆ దీపం ఉన్నట్లే" అన్నాడు దుకాణం అతను చిరునవ్వుతో.

"మిఠాయిలకు బదులుగా నేను తెచ్చిన కట్టెలు ఇచ్చాను గదా మీకు?" అన్నాడు రామయ్య. దుకాణం అతను నవ్వాడు. ఆ నవ్వుతోటే రామయ్యకు అర్థమైంది: "మన శ్రమ శక్తే మన కోరికలు తీర్చే భూతం. శ్రమించి దేన్నైనా సరే ఉత్పత్తి చేసామంటే, ఇక దానివల్ల మనం ఏమి కోరుకుంటే ఆ కోరిక నెరవేరుతుంది!"

అటు తర్వాత రామయ్య బద్ధకాన్ని వదిలేసి, స్వయంకృషితో దేన్నైనా సాధించుకునే దిశగా అడుగులు వేసాడు. పట్నంలోనే చిన్న పని చూసుకొని, అవ్వకుకూడా సంతోషం కలిగించాడు.