స్వాగతం! కొత్తపల్లిలో పిల్లల రచనలకు ప్రాధాన్యత ఉంటుంది. ఈ పుస్తకంలో సగానికి పైగా కథలు పిల్లలు రాసినవి; మిగిలినవి పిల్లల- కోసం పెద్దలు రాసినవి. బొమ్మలు వేసిన వాళ్ళు కూడా చాలామంది పిల్లలే.

పిల్లలను కలవటం, వాళ్లతో తెలుగులో కథలు రాయించటం, బొమ్మలు వేయించటం, వాళ్ళు పంపిన కథల్ని, బొమ్మల్ని సరిదిద్ది, మిగతా పిల్లలందరికీ నచ్చేట్లు పుస్తకాలుగా తయారు చేయటం, దానికోసం ఓపెన్‌ సోర్సు ఉపకరణాలను వాడటం, కథల్ని అందరూ ఉచితంగా చదువుకునేట్లు ఇంటర్నెట్‌లో పెట్టటంతోపాటు, కొన్ని ప్రతులు అచ్చు వేసి, పిల్లలచేత చదివించటం మాకు ఇష్టం. అందరి మేలూ కోరి చేసే ఈ పనిలో మీరూ పాలు పంచుకోండి. చేతనైన సాయం చేయండి. పిల్లల కథల ప్రపంచానికి స్వాగతం!

కవితలు

(రచన: మౌనిక,6వ తరగతి, మహాత్మా జ్యోతిబా ఫులే తెలంగాణ గురుకుల పాఠశాల, కీసర, తెలంగాణ.) వందనాలు వందనాలు అభివందన చందనాలివీ-
మా అభివందన చందనాలివీ!
నాకు జన్మనిచ్చిన మా అమ్మకు-
నడక నేర్పిన మా నాన్నకు-
స్వేదం ఓడ్చి పని చేసే మా అమ్మానాన్నలకు
అభివందన చందనాలివి- నా అభినందన చందనాలివి!
ఎక్కడా తలదించని నాన్నకు- మంచి చెప్పే మా అమ్మకు-
ఆట పాటలు నేర్పించే మా అమ్మానాన్నలకిద్దరికీ
అభినందన చందనాలివి! చల్ల చల్లని చందనాలివి!
చదువు చెప్పె మా అమ్మకు- తప్పులు దిద్దే మా నాన్నకు
వేల వేల వందనాలివి- వేల కోటి వందనాలివి!

మా మంచి టీచర్!
నాకు చదువు చెప్పేది టీచర్‌
మంచి చేయమని చెప్పేది టీచర్‌
ఆటపాటలు నేర్పించేది టీచర్‌
నా తప్పులు సరిదిద్దేది టీచర్‌
ఆపద ఒస్తే అడ్డుకోమనేది మా టీచర్‌
ఇవన్నీ మాకు ఇచ్చి తాను ఏమి
ఆశించని మా గురువు లందరికీ ఇవే నా
నమస్కార సుమాంజలులు.

అమ్మ-గురువు-స్నేహితుడు-లక్ష్యం
గుడి తలుపులు తెరిస్తే దేవుడు కనిపిస్తాడు
బడి తలుపులు తెరిస్తే గురువులు కనిపిస్తారు.
నా గుండె తలుపులు తెరిస్తే మా అమ్మ కనిపిస్తుంది.

ఆకాశం ఎత్తుకన్నా
సముద్రం లోతుకన్నా
అమ్మ ప్రేమ మిన్న

కనీళ్ళు తుడిచేవాడు స్నేహితుడు కాని
కనీళ్ళ తెప్పించేవాడు స్నేహితుడు కాదు.
కష్టాలను పంచుకునేవాడు స్నేహితుడు కాని
కష్టాలను తీర్చనివాడు స్నేహితుడు కాదు
మేలు చేసేవాడు స్నేహితుడు కాని
కీడు చేసేవాడు స్నేహితు డు కాదు.

స్నేహం అన్నిటికన్నా బెస్ట్
కలకాలం ఉంటే స్వీటెస్ట్
చెరిగిపోకుండా ఉంటే గ్రేటెస్ట్
ఇది ఇలాగే ఉండాలని నా యొక్క చిన్న రిక్వెస్ట్

పది పనులు ఉన్నా కంటికి నిద్దురమరిచిపోవద్దు
వంద పనులు ఉన్నా కడుపుకు తిండి మరిచిపోవద్దు.
వేయి పనులు ఉన్నా గురువులను మరిచిపోవద్దు.
పది వేల పనులు ఉన్నా తల్లిదండ్రులను మరిచిపోవద్దు.
లక్ష పనులు ఉన్నా లక్ష్యాన్ని మరిచిపోవద్దు.

వంద మంది స్నేహితులు ఉన్నా వంద ఆపదలు వచ్చాక ఆదుకోవడానికి ఒక మంచి
స్నేహితుడు ఉంటే చాలు నేస్తమా!...

యుగ యుగాల చరిత మనది
తరతరాల చరిత మనది
ఒడిదుడుకులు ఎన్ని ఉన్నా ఒడిపోని
ఘనత మనది.
అందుకే కధం తొక్కి కదలవోయి భారతీయుడా
భావిత్వయం నాదే నొయ్యి ఓ నా భారతీయుడా!

(రచన: కావ్యశ్రీ, 7వ తరగతి , మహేశ్వరి, 8వ తరగతి- మహాత్మా జ్యోతిబా ఫులే తెలంగాణ గురుకుల పాఠశాల, కీసర, తెలంగాణ.)

సూక్తులు:
ఈరోజు మనం ఏం చేస్తాం అన్నదానిమీదనే మన భవిష్యత్తు ఆధారపడుతుంది.

జోకులు
ఠపీ
టీచర్ : పిల్లలూ! నేను అడిగిన ప్రశ్నలకు వెంటనే ఠపీమని సమాధానం‌ ఇవ్వాలి. చెప్పండి- మన దేశం పేరేంటి?
పిల్లలు: ఠపీ!

సెల్ ఫోన్ తెలివి!
టీచర్: ఒరే రవీ! భూమి లోపల కరిగి ఉండే రాళ్ళ ద్రవాన్ని ఏమంటారు?!
రవి: లావా అంటారు సర్!
మరి వెంకటేశూ, భూమి పైన ఎత్తుగా పెరిగి ఉండే నిర్మాణాల్ని ఏమంటారు?
వెంకటేశు: 'ఓపో' అనో, 'వివో' అనో అంటారనుకుంటా సర్!

తెలివైన పిల్లాడు!
టీచరు: సెమిస్టరు విధానం వల్ల లాభాలు ఏంటో చెప్పు రామూ!
రాము: బలే లాభాలున్నై మేడం. పరీక్షలు రెండు సార్లు రాయచ్చు; ఆ సమయంలో క్లాసులు జరగవు... అంతే కాదు ఒకసారి చదివినదాన్ని ఆర్నెల్లకే మర్చిపోవచ్చు- ఏడాది పాటు గుర్తుంచుకునే శ్రమ ఉండదు.

ఆత్మాభిమానం
టీచర్: చింటూ, మన టెక్నాలజీ మారిపోతున్నది కదా? పదేళ్ల క్రితం లేనివి మనకు ఈ రోజున ఉన్నాయి.
దీనికి ఒక ఉదాహరణ చెప్పు!
తొమ్మిదేళ్ల చింటూ : నేనే టీచర్. పదేళ్ల క్రితం లేను, ఇప్పుడున్నాను చూడండి!

పొడుపు కథలు
( సౌజన్యం‌: డా. పత్తిపాక మోహన్‌, రాజన్న సిరిసిల్ల జిల్లా.) 1. ఎర్రని కోటలో తెల్లని కావలి వాళ్ళు 2. ఎలుకలు తినని పాము పంటలకు ప్రియుడు 3. ఎవరు దిగని బావిలో భీముడు దిగుతాడు. 4. ఎంత వాదినా అరగని బిళ్ళ, కరగని బిళ్ల 5. ఏటిలో కర్రముక్క ఎదురు వెళుతుంది 6. ఏడాకుల మర్రిచెట్టు ఎక్కలేరు, దిగలేరు 7. ఏడు ఎకరాల మాను వంగి నీరు తాగుతుంది. 8. ఏటి అవతల ఒక పండు, ఏటి ఇవతల ఒక పండు జవాబులు: 1.పండ్లు 2.వానపాము 3.తెడ్డు 4.అరుగు 5.పడవ 6.పట్టెమంచం 7.ఇంద్రధనస్సు 8.పెదవులు