శశాంక మహారాజుకు అడవులన్నా, అడవుల్లో తిరిగే జంతువులన్నా చాలా ఇష్టం. 'అడవి జంతువులకు సహజంగా అహారం దొరికితే, అవి ఇక జనాలుండే చోట్లకు రావు' అని ఆయన విశ్వసించేవాడు.

క్రూరమృగాల కోసం ఆయన అడవుల్లో చిన్న చిన్న కుంటలు త్రవ్వించటం, గట్లు వేయించటం వంటి చర్యలు చాలానే చేపట్టాడు. తన రాజ్యంలో అంతటా వేటను నిషేధించాడు కూడా.

ఆయన రాజ్యంలో మహేంద్రుడు అనే వేటగాడు ఉండేవాడు. రాజుగారు వేటను నిషేధించినా, వేటగాళ్లకు పునరావాసం కల్పించినా, మహేంద్రుడు మటుకు కరుడు గట్టిన తన అలవాటును మానుకోలేక పోయాడు. ఎప్పుడు తోస్తే అప్పుడల్లా అడవికి వెళ్ళి, దొరికినన్ని జంతువుల్ని వేటాడి వాటిని రహస్యంగా అమ్ముకొనేవాడు. అట్లా కొద్ది కాలంలోనే చాలా ధనాన్ని కూడబెట్టాడు కూడా. అయినా అతనికి డబ్బు మీద యావ పోలేదు.

ఒకసారి అట్లా వేటకోసం అడవికి వెళ్ళిన మహేంద్రుడికి గుంపులు గుంపులుగా పోతున్న జింకల మందలు కనిపించాయి. అతను వాటి వెంట పడి పరుగెడుతూనే విల్లెత్తి బాణం వదిలాడు. అది సూటిగా పోయి ఒక జింకకు తగిలింది. అయితే ఆశ్చర్యంగా, ఆ జింక కాస్తా ఒక వన దేవతగా మారింది: "ఓయీ మహేంద్రా! జీవులను హింసించాలనే నీ క్రూరమైన ఆలోచనను మాను. మన రాజ్యంలో వేట నిషేధింప-బడిందని నీకు తెలియదా?" అన్నది.

మహేంద్రుడు ఆశ్చర్యపోతూనే "తల్లీ! వేటాడటకపోతే నా పొట్ట ఎట్లా నిండుతుంది, చెప్పు?! ఆకలి తీర్చుకునేందుకు గాను ఏ పని చేసినా తప్పు లేదు కదా!" అన్నాడు.

"దానిదేమున్నది?! నీ దగ్గర చాలానే డబ్బు ఉన్నది కదా, ఆ డబ్బుతో హాయిగా జీవించవచ్చు!" అన్నది వనదేవత.

"తింటూ కూర్చుంటే కొండలైనా కరిగి పోతాయట కద తల్లీ?!" అన్నాడు మహేంద్రుడు తెలివిగా.

వన దేవత కొంచెం ఆలోచించి, చిరునవ్వు నవ్వి, "సరేలే! మంచి మనిషిగా మారేందుకు నీకు కూడా అవకాశం రావాలిగా? అలాగే కానివ్వు. ఇప్పుడు నీకో పాత్రను ఇస్తాను. ఆ పాత్ర ప్రతిరోజూ ఒక తులం బంగారం ఇస్తుంది. నీ ఖర్చులకు అది చాలా ఎక్కువే.

అట్లా నీ అవసరాలకు పోగా మిగిలిన సొమ్మును దాన ధర్మాలకు వినియోగించు. నీకు మంచి కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి. ఇక జంతుహింసను మానెయ్యి" అంటూ ఒక పాత్రని అతని చేత పెట్టి అదృశ్యం అయిపోయింది.

మహేంద్రుడికి చాలా సంతోషం వేసింది. అయితే మరుక్షణం "ఒక్క తులమేనా?" అని విచారం కూడా వేసింది- "ఇట్లాంటి పాత్రలు మరిన్ని కావాలి! ఒక్క తులం అంటే చాలా తక్కువ!"

దురాశాపరుడైన మహేంద్రుడు తన వేటని కొనసాగించాడు. మరొక జింక మీదికి బాణం వదిలాడు. "ఇట్లాంటి పాత్రలు మరో పది ఇమ్మంటాను, వనదేవతని!" అనుకున్నాడు.

అతను విడిచిన బాణం జింకకు తగిలింది. అది ప్రాణం విడిచింది; కానీ వనదేవత మాత్రం తిరిగి రాలేదు. అంతలోనే అటుగా వచ్చిన సైనికులు మహేంద్రుడిని పట్టి బంధించారు. పాత్రతో సహా వాడిని రాజుగారి ముందు ప్రవేశపెట్టారు. రాజుగారు పాత్రను ఖజానాకు పంపారు; వన్య ప్రాణిని వేటాడిన మహేంద్రుడికి యావజ్జీవ కారాగార శిక్ష పడింది!