గాలిలో భరించలేనంత పొగ.
నేలలో రసాయనాలు. ఆకాశంలో ఓజోన్ పొరకు చిల్లి.
నదుల్లో వరదలు, సముద్రాల్లో సునామీలు, కొండల్లో భూకంపాలు, మహానగరాల్లో మంచి గాలిని కొనుక్కోవాల్సిన పరిస్థితులు, పల్లెల్లో మంచి నీళ్లను కొనాల్సిన పరిస్థితులు.
వానలు ఊరించటమే తప్ప, నిజంగా పడట్లేదు. పడ్డచోట్ల వరదలు, లేని చోట్ల తుఫానులు, కరువులు.
మొక్కలకు, చెట్లకు అందనంత లోతుల్లో భూగర్భజలాలు. తగ్గి పోతున్న అడవులు, కష్టాల్లో వన్యమృగాలు.
అంతటా వ్యాపించిన రేడియేషన్, వివిధ రకాల తరంగాలు పక్షుల జీవితాల్నే కాక మానవ శరీరాల్ని కూడా ప్రభావితం చేసే స్థాయిలలో.
తరిగిపోతున్న పెట్రోలు నిల్వలు. పెరిగిపోతున్న ప్లాస్టిక్ వినియోగం.
పర్యావరణ సంక్షోభం అంటే ఇవన్నీ.
వీటన్నిటికీ వెనక మనం విచక్షణ లేకుండా కొట్టేస్తున్న చెట్లు, నాశనం చేస్తున్న అడవులు, దోచేస్తున్న శిలాజ ఇంధన వనరులు ఉన్నాయి. మనం వాడే పెట్రోలు, డీజిల్, నైలాన్-రేయాన్ వంటి బట్టలు, ప్లాస్టిక్ వస్తువులు, సింథటిక్ ఉత్పాదనలు అన్నీ భూగర్భంలో ఎంతో లోతుల్లో -కోట్ల సంవత్సరాల క్రితం- నిక్షిప్తం అయిపోయిన అడవులు, జంతు కళేబరాలు నుండి తయారైన ఇంధనపు ఉత్పాదనలే. మనం ఆ ఇంధనాన్ని వాడుకునే క్రమంలో ప్లాస్టిక్కులను ఉత్పత్తి చేస్తున్నాం. ఒకవైపున ఈ వనరులు తగ్గిపోతూ కంగారు పుట్టిస్తుండగా, మరో వైపున వాటి మితిమీరిన వినియోగం పర్యావణ సమస్యల్ని తెచ్చిపెడుతున్నది.
అమెరికా, కెనడా వంటి దేశాల్లో ప్లాస్టిక్ వినియోగం చాలా ఎక్కువగా, తలసరిన 136 కిలోలు ఉండగా, మనదేశంలో 36 కిలోలు ఉంది. ఇక ప్లాస్టిక్ వ్యర్థాల పరంగా, చైనా మొత్తం 60 మిలియన్ టన్నుల చెత్తను ఉత్పత్తి చేస్తే, అమెరికా 38 మిలియన్ టన్నులతో రెండోస్థానంగా ఉంది. మన దేశం బాగా వెనకనే, 5.6 మిలియన్ టన్నుల ప్లాస్టిక్ చెత్తను ఉత్పత్తి చేస్తూన్నది లెండి. ఈ చెత్తలో అధిక భాగాన్ని ఏ దేశానికాదేశం సముద్రం పాలు చేస్తున్నది. దీన్ని కాలిస్తే ఒక దోషం, కాల్చకుంటే ఒక కష్టం అవుతున్నది.
దీన్ని దృష్టిలో ఉంచుకొని మనందరం మన జీవితాలలో ప్లాస్టిక్ వినియోగాన్ని బాగా తగ్గించటం అవసరం. ప్లాస్టిక్ బ్యాగుల బదులు బట్ట బ్యాగులు, ప్లాస్టిక్ బట్టల బదులు నూలు బట్టలు వాడాలి. చెట్లను బాగా పెంచి, కాగితపు ఉత్పాదనల్ని పొదుపుగా ఉపయోగించుకోవాలి. ప్లాస్టిక్ వస్తువుల్ని వాడుకుండా చూసుకోవాలి. డిస్పోజబుల్ వస్తువులు కాక, మళ్లీ మళ్లీ వాడే వస్తువులకు పెద్దపీట వేయాలి.
ప్రమాదకరమైన రసాయనాల్ని కలిగి ఉండే బ్యాటరీలు, ఫోటోగ్రఫీ సాధనాలు, ఎసి యంత్రాలు, ఫ్రిజ్‌ల వంటివి అదుపు తప్పకుండా చూసుకోవాలి. రేడియేషన్ వల్ల కలిగే ప్రమాదాన్ని దృష్టిలో ఉంచుకొని, శాస్త్ర సాంకేతిక ఉత్పాదనల పట్ల మనకున్న మోజుకు కళ్లెం వేయటం కూడా చాలా అవసరం. కోరికలు ఎక్కువైన కొద్దీ మనిషి తనను తాను కష్టపెట్టుకోవటమే కాక, మనకు ఆవాసమైన భూమిని కూడా కష్టాల పాలు చేస్తున్నాడు కదూ?
ప్లాస్టిక్‌ల వాడకాన్ని, రసాయనాల వినియోగాన్ని తగ్గిస్తూ పర్యావరణాన్ని కాపాడే దిశగా అడుగులు వేస్తున్న మీకందరికీ అనేకానేక శుభాకాంక్షలతో
కొత్తపల్లి బృందం.