విదేహ రాజ్యాన్ని విమలవర్ధనుడు పరిపాలిస్తున్న కాలంలో, పొరుగున ఉన్న సుదేహ రాజ్యాన్ని వీరవర్ధనుడు పరిపాలించేవాడు. ఇరుగు పొరుగు రాజ్యాలు ఐనప్పటికీ వాటికి తాతలనాటి నుండీ పరస్పర మైత్రి లేదు. యుద్ధానికి ఎప్పుడు ఏ చిన్న అవకాశం దొరుకుతుందా అని ఇరు రాజ్యాల ప్రభువులూ వేచి చూసేవాళ్ళు.

అయితే విమల వర్థనుడూ, వీర వర్ధనుడూ మటుకు ఒకే గురువుగారి దగ్గర, ఒకే సమయంలో విద్యలు నేర్చుకున్నారు. చదువుకునే నాటినుండీ ఇరువురి మధ్యా వ్యక్తిగత సాన్నిహిత్యం ఉంది. కానీ, రాజ్యభారం తలకెత్తుకున్నాక, ఇద్దరికీ కూడా తమ తమ మంత్రి సామంతుల మాట వినకపోతే వీలయేట్లు లేదు. వ్యవస్థ మొత్తం పాత ప్రభువుల ధోరణిలోనే, కొట్లాటల మధ్య కొనసాగుతున్నది.

'ఈ కొట్లాటలకు పూర్తిగా మంగళం పాడాలి' అని నిశ్చయించుకున్న వీరవర్థనుడు తన వారితో "మంత్రులారా!‌ యుద్ధాల వల్ల ఇరు రాజ్యాల ప్రజలూ ఇక్కట్ల పాలవుతారు తప్ప, మరే లాభమూ ఉండదు. ఇన్నేళ్ళుగా మనం చూస్తూనే ఉన్నాం కదా?" అన్నాడు.

"మనం మంచివారమే ప్రభూ! కానీ అవతలి వారు దుర్మార్గులు. మన స్నేహానికి పాత్రులు కారు. వారికి తెలివితేటలు శూన్యం. మనం కావాలని యుద్ధం చేస్తామా ఎప్పుడైనా? తప్పంతా వారిదే.." అన్నారు మంత్రులు.

ఇలా కొంత చర్చ జరిగిన తర్వాత వీరవర్థనుడు "సరే, అయితే ఒక పని చేద్దాం. మీరు అంతా కలిసి మూడు ప్రశ్నలను తయారు చేయండి. మన తరపున రాయబార బృందం‌ ఒకటి వారి రాజ్యానికి వెళ్ళి, వారి రాజును ఈ మూడు ప్రశ్నలూ అడుగుతుంది. ఆ ప్రశ్నలకు తగిన సమాధానం వస్తే మనం వారిని సమ ఉజ్జీలుగా గుర్తించి, మిత్రత్వంతో మసలుదాం. లేదంటే వారితో తక్షణం‌ యుద్ధం చేసి, వారి రాజ్యాన్ని కైవశం చేసేసుకుందాం" అన్నాడు స్థిరంగా.

దాంతో సుదేహ మంత్రి బృందం ఒకటి బయలుదేరి విదేహరాజ్యానికి వెళ్ళింది. విమలవర్థనుడు, అతని మంత్రి పరివారం వారికి స్నేహపూర్వకంగా స్వాగతం పలికారు. ఆనాటి ఉదయం విమలవర్ధనుడు కొలవుతీరి ఉండగా వారు తమ రాజుగారు వ్రాసి ఇచ్చిన లేఖను ఒకదాన్ని అందించారు.

అందులో ఇలా ఉన్నది:
"విదేహ ప్రభువులు మహారాజశ్రీ విమలవర్థనులవారికి, సుదేహరాజ్య అధినేత వీరవర్థనుడు పంపిన లేఖ:
1. మంచి వాళ్ళలో చెడ్డవారు ఎవరు?
2. చెడ్డవాళ్ళలో మంచి వారు ఎవరు?
3. శరీరం వుండి తలలేని జీవి ఏది?
పై మూడు ప్రశ్నలకూ తమ రాజ్యం నుండి సరైన సమాధానం వస్తే తమరిని మాతో సమ ఉజ్జీలుగా భావించి, శాశ్వత మైత్రికి పునాదులు వేస్తాము. అలా కాని పక్షంలో మనం శాశ్వత శత్రువులమౌతాం. యుద్ధం తప్పదని తెలుస్తుంది"

అది చదివి విమలవర్ధనుడు బిత్తరపోయాడు. తన మంత్రులను సలహా అడిగాడు. వారు కూడా అప్పటికప్పుడు ఏమీ సమాధానం చెప్పలేకపోయారు. వారి కంగారును చూసి సుదేహరాజ్యపు రాయబారులు ముసిముసి నవ్వులు నవ్వుతున్నారు.

అప్పుడు సభలో వున్న నందనుడు అనే యువకుడు లేచి "మహారాజా! తమరు అనుమతిస్తే వీరి ప్రశ్నలకు నేను సమాధానాలు చెబుతాను. అయితే వాటిని వారి రాజ్యంలోనే, నేరుగా వారి ప్రభువులకు చెప్పవలసి ఉంది. ఇక్కడ చెప్పలేను" అన్నాడు.

రాజుగారు సుదేహ రాజ్య మంత్రి బృందం వైపుకు చూసారు. వారు 'సరే' అన్నట్లు తల ఊపారు. వెంటనే రాజుగారు నందనుడిని వారితో బాటు సుదేహ రాజ్యానికి పంపించారు.

మంత్రులు చెప్పిన విశేషాలు విని, వీరవర్థనుడు చిరునవ్వు నవ్వాడు. తన అంత:పురానికి దగ్గర్లోనే ఒక గదిలో నందనుడికి వసతి కల్పించాడు.

అయితే తెల్లవారు జామున, అంత:పురంలో గందరగోళం రేగింది. 'రాణిగారి నగలన్నీ‌ మూటగట్టుకుని పారిపోబోతున్న నందనుడు మూటతో సహా పట్టుబడ్డాడు' అన్న వార్తతో రాజ్యం మొత్తం కుతకుతలాడింది. శత్రు రాజ్యపు ఈ మోసగాడిని చూసేందుకు, అతనికి ఏం శిక్ష విధిస్తారో తెల్సుకునేందుకు, వందలాది మంది ప్రజలు ఉదయాన్నే సభకు వచ్చి కూర్చున్నారు. కాళ్ళు చేతులకు సంకెలలతో నందనుడు వీరవర్ధనుడి ముందు ప్రవేశపెట్టబడ్డాడు.

"పొరుగు రాజ్యపు దూతగా వచ్చాడు వీడు. తన రాజ్య గౌరవాన్ని కూడా మన్నించకుండా ఇంత దురాగతానికి ఒడిగట్టాడు. వీడికి ఏం శిక్ష విధించాలి?" అడిగారు రాణిగారు. రాజుగారు తన మంత్రులవైపు చూసారు. "మరణశిక్ష" అన్నారు మంత్రులు ఏకగ్రీవంగా.

"ఈ విషయంలో నువ్వు చెప్పుకునేది ఏదైనా ఉందా?" అడిగారు రాజుగారు, నందనుడిని.

"ఉన్నది ప్రభూ! తమరు మా రాజ్యాన్ని అడిగిన మూడు ప్రశ్నలకు జవాబులు చెబుదామని ఉంది. ముందుగా నేను దొంగిలించుకొని పోతున్న ఆ మూటను తెప్పించి, ఇక్కడ పదుగురి ముందూ తెరవమనండి" అన్నాడు నందనుడు.

భటులు మూటని తెచ్చి పెట్టారు. రాణిగారి చీరతో కట్టబడిన ఆ మూటని జాగ్రత్తగా విప్పారు. అందులో పాత బట్టలు తప్ప మరేవీ‌ లేవు!

నందనుడు నవ్వాడు. "ప్రభూ! నిన్న నడి రాత్రి సమయంలో నేను బయటికి వెళ్ళి, ఈ మూటని తెచ్చి గదిలో పెట్టాను. అదేమిటని అడిగిన అంత:పుర చెలికత్తెకు 'ఇవి రాణిగారి నగలు- ఈ సంగతి ఎవ్వరికీ చెప్పకు!' అని గుసగుసగా చెప్పి, పడుకున్నాను. మూటలో ఏమున్నదీ చూడకనే, ఆ చెలికత్తె, ఈ సంగతిని రాణిగారికి చేరవేసింది. ఆవిడ కూడా తన నగలు ఏమి పోయినాయో చూసుకోలేదు! తన మంచితనం కొద్దీనే, అవతలివారిపైన అభాండాలు వేసిన చెలికత్తె మంచివారిలో చెడ్డది" అన్నాడు ధైర్యంగా. మరి, "దొంగల్లో మంచివారు ఎవరు?" అడిగారు రాజుగారు.

"ప్రభూ! నిన్న రాత్రి నిజంగానే అంత:పురంలో దొంగతనం చేసేందుకు వచ్చాడు, మీ రాజ్యపు గజదొంగ గంగన్న. అయితే ఆ సరికే నా గురించిన చర్చ అంత:పురం అంతా మారుమ్రోగుతుండటం చూసి, అతను నా దగ్గరికి వచ్చి, బలవంతంగా నా యీ మూటని విప్పి చూసాడు. అందులో ఎలాంటి నగలూ లేవు! కావాలనుకుంటే అతను ఆ సమయంలో కూడా రాణిగారి ఆభరణాలను దొంగిలించుకొని పోయి ఉండచ్చు! ఆ నేరం నా మీద మోపబడి ఉండేది! అయితే రాజ్య శ్రేయస్సును కోరే ఆ దొంగ అలా చేయలేదు; వట్టి చేతులతో తిరిగి వెళ్ళిపోయాడు. అతను చెడ్డవారిలో మంచివాడు!" అన్నాడు నందనుడు.

సభికులు అందరూ నిశ్చేష్టులు అయిపో-యారు.

మరి "శరీరం ఉండి కూడా తలలేని వాడు?" అడిగారు రాజుగారు.

"నిజంగా అంత:పురంలో నగలు పోయిందీ లేనిదీ తెలుసుకోకుండానే నన్ను దండించమని భటులను పంపించారు తమరు; మరణశిక్ష విధించారు తమ మంత్రులు! క్షమించాలి, మీరు, శరీరం ఉండి కూడా తల లేని వారు" అన్నాడు నందనుడు నిర్భయంగా.

సభ మొత్తం నిశ్శబ్దం అయిపోయింది.

ఆ నిశ్శబ్దం నడుమన వీరవర్ధనుడు లేచి నందనుడిని ఆలింగనం చేసుకుంటూ, "నీ వంటి తెలివితేటలు, ధైర్య సాహసాలు, స్వదేశాభిమానమూ, మర్యాదా మన్ననలూ ఉన్నవారు మా పొరుగున ఉండటం మాకు గర్వకారణం. మీరే మన రెండు దేశాలకూ సాంస్కృతిక సారధులు. మన రెండు దేశాలకు మధ్యనున్న వైషమ్యాలకు పూర్తిగా తెరపడింది. ఇకపై మన మధ్య యుద్ధాల ప్రస్తావనే ఉండదని మాట ఇస్తున్నాం. మన రెండు దేశాలూ ప్రపంచంలోని అన్ని దేశాలకూ మార్గదర్శకులం కావాలి!" అన్నాడు.

సభికులంతా ఆయన నిర్ణయాన్ని ఆమోదిస్తూ హర్షధ్వానాలు చేసారు.