అర్ధ రాతిరి వరకు
చదివి చదివీ చదివి
వేకువన లేచాడు
మరల చదవగ వేణు
పొత్తములు మూసేసి
చదివినది తలచాడు
గుర్తేది రాకను
తెగ కృంగి పోయాడు
మనవ డేడ్పును విని
తాతయ్య వచ్చారు
కారణం తెలుసుకొని
కడు జాలి పడ్డారు
వెంటనే మనవడిని
మేడ నెక్కించారు
పరిసరాల నొక పరి
చూడమని కోరారు
కొండలు గుట్టలు
వేణు నలరించాయి
పచ్చనీ తోటలు
కను విందు చేశాయి
లేలేత సూరీడు
మెల మెల్ల గొచ్చాడు
రంగుల్ల మబ్బులతొ
సంతోష పరిచాడు
నింగిలో పక్షులు
కలకలము చేశాయి
చెట్ల మీదను వాలి
ముదము చేకూర్చాయి
వేణు వాటిని చూచి
మైమరచి పోయాడు
తానేడ్చు విషయమును
పూర్తిగా మరిచాడు
అది మంచి సమయమని
తాతయ్య తలచారు
మనవడిని ఈ తీరు
బుజ్జగించారు:
"ప్రకృతిని చూడగా
పరవశించెదము
అలసటను మైమరచి
ఉత్తేజ మొందెదము
"ఆట పాటలు, కళలు
ఒత్తిడిని పోగొట్టు
చదువుతో పాటుగా
ఇవి యన్ని పాటించు
"కొనసాగ గలదపుడు
నీ చదువు దర్జాగ
బేజారు పడదపుడు
నీ మెదడు పిచ్చిగ"
తాత చూపిన బాట
మనవడు పయనించె
కొత్త ఊపిరి తోడ
చదువులో రాణించె