మంగాపురంలో ఉండే శశి, లోకేష్, వివేక్, పవన్, ప్రసన్న ఐదుగురూ బాగా కలిసి తిరిగేవాళ్ళు. అందరూ కలిసే ఉంటారు; కలిసి తింటారు; కలిసి పని చేస్తుంటారు; కలిసి ఆడుకుంటారు; అందరి వయసూ ఇరవై సంవత్సరాలలోపే వుంటుంది.
అయితే వీళ్లలో ప్రసన్న మటుకు కొంచెం వేరుగా ఉండేవాడు. మిగతా నలుగురితోటే అని కాదు; అందరితోటీ అతను కొంత ఎడంగా ఉండేవాడు. మిగతావాళ్లంతా సహజంగా, మనస్ఫూర్తిగా కలిస్తే, ఇతను మటుకు తనదంటూ కొంత గిరి గీసుకున్నట్లు ప్రవర్తించేవాడు.
మిగతా నలుగురి మధ్యా డబ్బుల లావాదేవీలు బాగా నడిచేవి. ఒకే వయసులోని యువకులు కావటంతో అందరూ డబ్బు సాయాలు బాగా చేసుకునేవాళ్ళు. కానీ ప్రసన్న మాత్రం తన సొంతం తను చూసుకునేవాడు. వేరే ఎవరికీ ఏమాత్రం సాయం చేసేవాడు కాదు. "డబ్బు విషయంలో వేరే ఎవ్వరినీ నమ్మకూడదు" అని అతని భావన.
ఒకసారి లోకేష్ వాళ్ల నాన్నకు ఆరోగ్యం పాడైంది; ఆయన పరిస్థితి చాలా ప్రమాదంలో ఉండింది. ఆయన్ని ఆసుపత్రికి తీసుకు వెళ్ళేందుకు డబ్బులు లేక లోకేష్ చాలా తంటాలు పడ్డాడు. ఆ సమయంలో మిత్రులు ముగ్గురూ అతనికి తమ దగ్గరున్న డబ్బులు ఇచ్చి సాయపడ్డారు; వాళ్ల అమ్మానాన్నల్ని అడిగి మరిన్ని డబ్బులు కూడా సమకూర్చారు. కానీ ప్రసన్న మాత్రం "నా దగ్గర ఏమీ లేవురా!" అన్నాడు తన చదువు తాను చదువుకుంటూ. ఒక్క రూపాయి కూడా సాయం చేయలేదు.
ఎలాగైతేనేమి, మొత్తానికి లోకేష్ వాళ్ల నాన్నకు ఆరోగ్యం కుదురుకున్నది. ఆయన మిత్రులందరికీ ధన్యవాదాలు చెప్పటమే కాక, లోకేష్ వాళ్లనుండి తీసుకున్న డబ్బుల్ని అణా పైసల్తో సహా తిరిగి ఇచ్చేసాడు. అయితే ప్రసన్న ప్రవర్తన వల్ల లోకేష్ మనసులో బాగానే గాయమైంది. ఒకరోజు అతను శశితో "శశీ, ఈ ప్రసన్న గాడు మా నాన్నకు ఆరోగ్యం బాగా లేనప్పుడు ఏ మాత్రం డబ్బు సాయం చేయలేదు; కనీసం చూడటానికి కూడా రాలేదు కదూ!" అనేసాడు.
సరిగ్గా ఆ సమయానికి అటుగా వెళ్తున్న ప్రసన్న ఆ మాటల్ని పట్టుకొని మిగిలిన నలుగురి మీదా యుద్ధం ప్రకటించేసాడు. "మీరంతా ఒక్కటి కదా, అలాగే కానివ్వండి- ఇకపై నాతో మాట్లాడకండి!" అని మొండిగా వాళ్లనుండి విడిపోయాడు.
కాల క్రమంలో వీళ్లంతా చిన్నా చితకా పనుల్లో స్థిరపడ్డారు. అందరికీ ఏవో చిన్నా, పెద్దా కష్టాలు వస్తూనే ఉండేవి; మిత్రులు నలుగురూ ఒకరికొకరు సాయాలు చేసుకుంటూ వాటినుండి గట్టెక్కుతూ వచ్చారు.
అయితే వాళ్లలో కలవని ప్రసన్న మటుకు తన సమస్యలతో తానే ఒంటరిగా పోరాడాల్సి వచ్చింది. ఒకసారి వాళ్ళ అమ్మకు ఆరోగ్యం బాగా లేక, ఇంట్లో ఉన్న డబ్బంతా హాస్పిటళ్ళకు ఇవ్వాల్సి వచ్చింది. ఎంత చేసినా ఆవిడ ఆరోగ్యం బాగవ్వక, మరిన్ని డబ్బులకోసం ఇల్లు అమ్మేయాల్సి వచ్చింది ప్రసన్నకు. అయినా పాపం, ఆవిడ బ్రతకనే లేదు.
అట్లా అనేక ఆటుపోట్లకు గురయ్యాక గానీ అతనికి తన స్నేహితులు గుర్తుకు రాలేదు. చూస్తే వాళ్ళు నలుగురూ ఇంకా కలిసి కట్టుగానే ఉన్నారు; అందరూ కులాసాగా ఉన్నారు! 'కలిసి బ్రతకటంలో బలం ఉంది' అని ప్రసన్నకు అప్పుడు అర్థమైంది. "స్నేహితులు ఉన్నంత కాలం వారి విలువ తెలియలేదు; తీరా దూరమయ్యాక అర్థమైంది- వారి విలువ!" అని పశ్చాత్తాప పడ్డాడు.
వెంటనే తనంతట తానుగా మిత్రుల దగ్గరికి వెళ్ళి, తన తప్పును ఒప్పుకున్నాడతను- "నన్ను క్షమించండిరా! నేను మీతో చాలా దుర్మార్గంగా ప్రవర్తించాను. దానికి ఫలితం అనుభవించాను" అన్నాడు బాధగా మొహం పెట్టి.
వాళ్ళు అతన్ని ఊరడించి, నవ్వించి- "నలుగురికంటే ఐదుగురం ఇంకా బాగుండేవాళ్లం రా! ఇప్పటికైనా మళ్ళీ ఐదుగురం అయ్యాం! మంచిదే!" అంటూ ప్రసన్నని తమలో కలుపుకున్నారు.