ఒక ఊళ్లో ఆసిఫ్‌, ధనోజ్‌ అనే ఇద్దరు మంచి స్నేహితులు ఉండేవాళ్ళు. ఏ పని చేసినా ఇద్దరూ కలిసే చేసేవాళ్ళు. ఆటలు-పాటలు అన్నింటిలోనూ ఒకరికొకరు తోడుగా ఉండేవాళ్ళు. వాళ్ళకి ఇద్దరికీ ప్రకృతిలో తిరగటం అంటే చాలా ఇష్టం. అందరూ 'ప్రమాదం' అని భయపడే చోట్లకు వెళ్ళి అక్కడ నిజంగా అంత ప్రమాదకరమైనవి ఏమున్నాయో తెలుసుకోవటం అంటే కూడా చాలా ఇష్టం.

అట్లా ఓ ఆదివారం పూట అంబరపల్లి అడవికి పోవాలని పథకం వేసారు వాళ్ళు. అంబరపల్లి అడవి చాలా దట్టంగా ఉంటుంది- లోపల ఎంత చీకటి ఉంటుందంటే, సూర్యుడు అసలు ఉన్నాడో లేదో తెలీదట! లోపల అందమైన వాగులు, జలపాతాలు ఉంటాయని, వాటిని కాపలా కాసే భూతాలు రాక్షసులు కూడా ఉంటాయని చెప్పుకుం-టారు అంతా.

కానీ వీళ్ళిద్దరూ మటుకు అడవిని చూడగానే మురిసిపోయారు. అడవి బయటి వరసల్లోనే ఏపుగా పెరిగిన చెట్లు! రకరకాల పండ్లతో‌ బరువుగా వ్రేలాడుతున్న కొమ్మలు! ఎక్కడ చూసినా రంగు రంగుల పూలు! మిత్రులిద్దరూ అడవిలోపలికి దూరే దారి కోసం వెతికారు. ఆశ్చర్యం, ఎటునుండి అడుగుపెడదామన్నా వీలు లేకుండా దట్టమైన తీగలు, ముళ్ళ పొదలు అడవి అంచులనిండా ఉన్నాయి! అయినా మిత్రులిద్దరూ లోనికి వెళ్ళేందుకు దారిని వెతుక్కుంటూ పోయి, చివరికి ఒక గుహలోకి ప్రవేశించారు.

గుహలో వాతావరణం అంతా తేమగా, నిశ్శబ్దంగా, రహస్యంగా అనిపించింది. ఏనాటిదో వాసన ఒకటి, గుహ అంతటా పరచుకొని ఉన్నది. గుహ గోడలనిండా ఏవేవో చిత్రాలు గీసి ఉన్నాయి. మరింత లోనికి వెళ్ళేందుకు ఒక సొరంగం కూడా ఉందక్కడ.

మిత్రులిద్దరూ ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు. "లోపలికి దూరదామా?" అడిగాడు ధనోజ్ కొంచెం భయపడుతూ. "ఇంకేమీ ఆలోచించద్దు- ముందుకు పోయేదే" అన్నాడు ఆసిఫ్, తను కూడా కొంచెం వణుకుతూ.

అంతలో ఇద్దరికీ ఏదో మబ్బు కమ్మినట్లు అయ్యింది. కొద్ది సేపటికల్లా వాళ్ళిద్దరూ అడవి లోపల ఉన్నారు. చుట్టూతా భయంకరమైన శబ్దాలు వినబడుతున్నాయి.

మెల్లగా ఇద్దరూ ఆ శబ్దాలు వినబడే వైపుకు నడిచారు.

అకస్మాత్తుగా వాళ్ల ముందుకు దూకాడు ఒక పచ్చని రాక్షసుడు. వాడు వీళ్ళని చూడగానే చేతులు చాచి, చెరొక చేతిలోనూ పట్టేసుకొని, వికటంగా నవ్వుతూ "దొరికారు! నాకు తెలుసు, ఇవాళ్ళ మీరు వస్తారని! అందుకనే నేను ఇక్కడ ఉన్నాను! నాకు రెండు రోజుల ఆహారం దొరికింది ఇవాళ్ళ!" అంటూనే నోరు తెరిచి ధనోజ్‌ని నోట్లో వేసేసుకున్నాడు. దాన్ని చూడలేక ఆసిఫ్ రెండు కళ్ళూ గట్టిగా మూసేసుకున్నాడు.

అయితే వాడు కళ్ళు తెరిచి చూసే సరికి ఆశ్చర్యం, వాడి ముందు ధనోజ్ నిలబడి ఉన్నాడు!

"నువ్వు బాగానే ఉన్నావారా?" అని వాడిని ముట్టుకోబోయాడు ఆసిఫ్. కానీ వాడు వెనక్కి జరిగి బిగ్గరగా నవ్వుతూ "ఇది వాడు కాదురా, ఇది నేను!" అన్నాడు.

'రాక్షసుడికి ధనోజ్ రూపం వచ్చిందని అర్థమైంది ఆసిఫ్‌కి. అయితే ధనోజ్ ఏమైనట్టు?"

"వాడి పేరు ధనోజా?!" మళ్ళీ‌ నవ్వాడు ధనోజ్ రూపంలో ఉన్న రాక్షసుడు. "వాడు లేడు. వాడి బదులు నేను ఉన్నా" అని జోడిస్తూ.

ఆసిఫ్ భోరున ఏదవటం మొదలు పెట్టాడు. రాక్షసుడు వాడిని ఓదారుస్తూ "ఏమీ పర్లేదు. అసలు నా కథ తెలిస్తే నువ్వు ఇంకా గట్టిగా ఏడుస్తావు" అన్నాడు.

"ఇంకా గట్టిగానా?" అని ఆసిఫ్ భయంతో వణికి పోయాడు. రాక్షసుడు విషాదంగా మొహంపెట్టి అన్నాడు- "నేను కూడా ఒకప్పుడు నీలాంటి మనిషినే. కానీ శాపం వల్ల, ఇదిగో ఇట్లా మారిపోయాను" అని.

"అదెలాగ?" అని అడిగిన ఆసిఫ్‌కి వాడు ఏదేదో చెప్పుకొచ్చాడు: "నేను నీలాగానే, ఇట్లా అడవిలో తిరుగుకుంటూ‌ హాయిగా ఉన్నప్పుడు, కుందేలు ఒకటి నా దగ్గరకు వచ్చింది. నాకు అనుమానం వచ్చింది- అదేదో మాయ కుందేలు అని. అయినా ఆ సమయంలో నేను బాగా ఆకలిమీద ఉన్నాను. అందుకని నేను ఆ కుందేలును గబగబా తినేశాను. అంతలో నా ముందు ఒక మంత్రగత్తె ప్రత్యక్షం అయ్యింది. "నా కుందేలును నాకు ఇచ్చెయ్యి" అని పట్టుకున్నది.

నేనేం చెయ్యను? "నా వల్లకాదు" అని చెప్పేసాను. దాంతో‌ ఆమెకు కోపం వచ్చి 'నువ్వు రాక్షసుడైపో!' అని శపించింది!" ఇది చెబుతూ రాక్షసుడు వెక్కి వెక్కి ఏడ్చాడు.

వాడి ఏడుపును చూసి ఆసిఫ్‌ "సరేలే!‌ ఇప్పుడు మరి ధనోజ్ మళ్ళీ రావాలంటే ఏం చేయాలో చెప్పు" అన్నాడు.

"ముందు నేను మనిషినైతే, అప్పుడు వాడు తిరిగొస్తాడు!" అన్నాడు రాక్షసుడు. "మరి నువ్వు మనిషివి ఎట్లా అవుతావు?" అడిగాడు ఆసిఫ్.

రాక్షసుడు త్రికోణం ఆకారంలో ఉన్న వస్తువునొకదాన్ని ఇచ్చాడు వాడికి. దీని సహాయంతో నువ్వు అక్కడికి వెళ్ళి, కుందేలును పట్టుకు రావాలి" అన్నాడు. "ఎక్కడికి పోవాలి?" అన్నాడు ఆసిఫ్ భయంగా. కానీ రాక్షసుడు సమాధానం‌ ఇవ్వక మునుపే వాడు కాస్తా మాయమైపోయాడు!

ఇప్పుడు చూస్తే ఆసిఫ్ చెట్ల మరుగున నిలబడి ఉన్నాడు. కొద్ది దూరంలోనే ఇద్దరు పిల్లలు మాట్లాడుకుంటున్నారు. వాళ్ళిద్దర్లో ఒకడు "నేను ఇంటికి వెళ్ళి అన్నం మూట తెస్తాను" అంటున్నాడు. "సరే" అని రెండోవాడు అనగానే, వాడు వెనక్కి తిరిగి ఎటో వెళ్లిపోయాడు.

ఇక్కడున్నవాడు అటు ఇటు తిరిగి ఒక కుందేలును పట్టుకున్నాడు. వాడు దాన్ని తినేందుకు ప్రయత్నిస్తుండగానే ఆసిఫ్ తనకు ఏదో అర్థమైనట్లు వాడి ముందుకు దూకి, వాడి చేతిలోంచి కుందేలును లాక్కున్నాడు. గబుక్కున త్రికోణాన్ని రెండు చేతుల్తోటీ‌ పట్టుకొని "పోవాలి! పోవాలి!" అని అరిచాడు. మరుక్షణం వాడు అక్కడ మాయమై, ధనోజ్ ముందు ప్రత్యక్షం అయ్యాడు. ధనోజ్ రూపంలోని

రాక్షసుడు ఇతని ధైర్య సాహసాలను చాలా మెచ్చుకున్నాడు. అయితే అంతలోనే మంత్రగత్తె అక్కడికి చేరుకున్నది- "మాయకుందేలూ! నా యవ్వనం నాకు తిరిగి ఇవ్వు" అన్నది ఏడుస్తూ. కుందేలు ఏమీ అనలేదు. "మంత్రగత్తె 'తథాస్తు' అను నాయనా" అంది ఆసిఫ్‌తో. సరేలే, ఏం పోతుంది? అని ఆసిఫ్ 'తథాస్తు' అన్నాడు. అనగానే మంత్రగత్తె కాస్తా అందమైన యువతిగా మారిపోయింది.

వెంటనే రాక్షసుడు కూడా ఏడుస్తూ "నా శాపం పోవాలి ప్లీజ్" అని ప్రాథేయపడ్డాడు కుందేలును. ఆసిఫ్ సరేనని 'తథాస్తు' అనగానే మాయకుందేలు ప్రభావంవల్ల రాక్షసుడు కూడా మనిషి అయిపోయాడు. ధనోజ్ కూడా తిరిగి వచ్చేసాడు!

అటుపైన వాళ్ళు ఇంకేదీ‌ అడగకనే, ఆసిఫ్ "మంత్రగత్తె శక్తులు, నీ శక్తులు మొత్తం పోయి మీరిద్దరూ కూడా మామూలు అయిపోవాలి- తధాస్తు" అని కోరుకునేసాడు కుందేలును. దాంతో మంత్రగత్తె శక్తులన్నీ‌ పోయాయి. కుందేలు శక్తులన్నీ‌ కూడా పోయి, అది గంతులు వేసుకుంటూ ఎటో వెళ్ళిపోయింది.

అంతలోకే వాళ్ళకు మబ్బు కమ్మినట్లయింది. కళ్ళు తెరిచి చూస్తే వాళ్ళు అడవి అవతల గుహలోపల ఉన్నారు! ఆసిఫ్, ధనోజ్ ఇద్దరూ ఒకరి ముఖాలొకరు చూసుకొని, గబగబా ఇళ్లకు పరుగు పెట్టారు. వాళ్లకు ఇప్పటికీ‌ అనుమానమే, ఆ రోజున జరిగిందంతా 'నిజమా, కలా?' అని.
,br>