అడవిలో అద్భుతంగా కనిపించే విషపు పూలు ఉంటాయి; చాలా ముద్దుగొలిపే మాంసాహార జీవులు, క్రూర మృగాలు ఉంటాయి.
మేం అందరం ఒకసారి అట్లాంటి ఓ అడవిలో చిక్కుకుపోయాం. ఇప్పుడు ఆ సంగతులు తలచుకుంటే 'అయ్య బాబోయ్' అనిపిస్తుంది.
మా బాబాయి వాళ్ళు ఆఫ్రికాలో ఉంటారు. పోయిన ఏడాది సెలవల్లో మేం‌ వాళ్ళింటికి వెళ్ళాం. "ఆఫ్రికాలో ఉన్నన్ని దట్టమైన అడవులు మరెక్కడా ఉండవు. ఆఫ్రికన్ సఫారీ ప్రపంచ ప్రసిద్ధి గాంచింది. నిజంగా అట్లాంటి అనుభవం మాటల్లో చెప్పలేం" అన్నాడు బాబాయి తన్మయత్వంతో కళ్ళు మూసుకొని. దాంతో ఇంకేముంది, అందరం ఎగిరి గంతేసి బయలుదేరాం.

"సఫారీ" అనే పద్ధతే అసలు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. అడవిలో జంతువులన్నీ వాటి ఇష్టం వచ్చినట్లు తిరుగుతూ ఉంటాయి. మనుషులు కార్లలోను, వ్యాన్లలోను కూర్చొని ఆ అడవిలో తిరుగుతారు. ఒక్కోసారి అవి వ్యానులకు చాలా దగ్గరగా కూడా వస్తాయి. అయితే వ్యాన్ల కిటికీలకు అన్నిటికీ ఇనప వలలు ఉంటాయి కాబట్టి అంత భయపడే అవసరం ఉండదు.
అందరం సఫారీ టిక్కెట్లు కొనుక్కున్నాం. ఆ టిక్కెట్లు చూపిస్తే గార్డులు అందరినీ గేటు లోపలికి వదిలారు. తరవాత పిల్లలని, పెద్దవాళ్ళని వేరు వేరు వ్యానులలో కూర్చోపెట్టి అడవిలోనికి పంపించారు.
మా వ్యాను డ్రైవర్‌ పేరు బిల్. అతను దృఢంగా , నల్లటి జుట్టుతో, తెల్లని చర్మంతో, చేతిలో రైఫిల్‌ పట్టుకొని ఉన్నాడు భయం పుట్టేట్లు. కానీ అతను మమ్మల్ని పలకరించిన తీరు చూస్తే మటుకు చాలా బాగా అనిపించింది. బలే స్నేహంగా ఉన్నాడు.
వ్యాను క్రమక్రమంగా అడవిలో చాలా లోపలికే పోయింది. నక్కలు-తోడేళ్ళు, జింకలు, అడవి దున్నలు, రకరకాల పక్షులు, అక్కడక్కడా కొన్ని పులులు- అన్నీ కనిపిస్తున్నాయి. చూస్తూండగానే చుట్టూ అంతా చీకటి అలుముకున్నది- అంత దట్టంగా ఉన్నాయి చెట్లు.
దగ్గర్లోనే ఏదో సరస్సు ఉండి ఉంటుంది. గాలి వాసన తేమగా, ఒక రకంగా బరువుగా వస్తోంది.
అక్కడ ఒక చోట వ్యానును ఆపి ఇంజన్ ఆఫ్ చేసాడు బిల్. "ఏ మాత్రం చప్పుడు చేయకుండా- నిశ్శబ్దంగా వినండి- ఈ ప్రాంతంలో వేరే త్రాగు నీళ్ళ ఆధారం లేదు. అందుకని రకరకాల జంతువులు నీళ్లకోసం ఇటువైపుగానే వస్తాయి. మనం ఇక్కడ కొద్దిసేపు ఆగుదాం" అన్నాడు.

మేము అందరం నిశ్శబ్దంగా కూర్చున్నాం, అన్ని వైపులకూ జాగ్రత్తగా చూస్తూ. ఎక్కడా ఆకు కూడా కదలట్లేదు. ఆ సమయంలో కొంచెం దాహం అనిపిస్తే నీళ్లు తాగుదామని నా వాటర్‌ బాటిల్‌ తీసాను. మూత తీస్తుండగానే బాటిల్‌లో నీళ్ళు వణకటం మొదలు పెట్టాయి! ముందు నా చెయ్యి వణుకుతున్నదేమో అనుకున్నాను గానీ, చూస్తే బస్సు మొత్తంగానే వణుకుతున్నది! అనుమానంతో నిలబడి చెట్ల మధ్యన ఉన్న సందుల్లోంచి అవతలికి చూసాను: చూస్తే కొంచెం ఆవలగా ఓ‌ ఏనుగుల గుంపు! నీళ్ళు చిమ్ముకుంటూ ఇటువైపే వస్తున్నది!
"బిల్!‌ఏనుగుల గుంపు! వ్యాను స్టార్ట్ చెయ్యి! గబగబా పోనియ్యి!" అరిచాను నేను. బిల్ హడావిడిగా వ్యాను స్టార్ట్ చెయ్యబోయాడు గానీ, దానికేమైందో ఏమో- అది "గుయ్య్ గుయ్య్" మన్నది తప్ప స్టార్ట్ అవ్వలేదు.
నేను వెంటనే నాసంచిని తీసుకొని వ్యాను దిగేస్తూ అరిచాను: "అందరూ! త్వరత్వరగా మీమీ వస్తువులు తీసుకొని బస్సులోంచి దిగిపోండి! లేకపోతే ఏనుగుల తొక్కిసలాటలో మనం ఇంక మిగలము!" అని.
బస్సులో‌ కలకలం మొదలైంది. ఒకరినొకరు నెట్టుకుంటూ, తోసుకుంటూ అందరూ గందరగోళంగా బస్సు దిగేసారు.. ఏనుగుల గుంపు మాకు చాలా దగ్గర్లోనే ఉన్నది. అడ్డు వచ్చిన చెట్లనల్లా ధ్వంసం చేసుకుంటూ మావైపే వస్తున్నది..
బిల్‌ మటుకు బస్సులోనే ఉన్నాడు. ఇంజన్ స్టార్టు చేసేందుకు ప్రయత్నిస్తున్నాడు. బస్సు దిగిన పిల్లలం అందరం మాకు ఎటు తోస్తే అటు పరుగు పెట్టాం. కొద్ది సేపు ప్రయత్నించిన తర్వాత బిల్‌ కూడా వ్యాను నుండి బయటకు దూకాడట మరి..
ఇక క్రిందికి దూకేసిన మేం పిల్లలం అందరం ఏనుగులు వచ్చే వైపుగా కాక, చెదురు మదురుగా వేరు వేరు వైపులకు పరుగు పెట్టాము. నేను, మా తమ్ముళ్ళు కృష్ణ, విష్ణు అలా తప్పించుకొనే ప్రయత్నంలో సూటిగా అడవిలోకే పరుగెత్తాము. ఎంత సేపు పరుగెత్తామో తెలీదు- ఎవ్వరమూ వెనక్కి మాత్రం చూడలేదు!

'ఇంక పరుగెత్తలేము' అన్నంత ఆయాసం వచ్చేంత వరకూ పరుగుపెట్టాక, అప్పుడు వెనక్కి తిరిగి చూసి, నెమ్మదించాం ముగ్గురం. ఏనుగులు మా వెంట పడట్లేదు. అయితే ఆ సరికి మాకు ఇక ఎక్కడున్నామో తెలీలేదు! అందరం అక్కడే ఓ చెట్టుక్రింద విశ్రాంతిగా కూర్చున్నాము.
"ఇప్పుడెలా?" అన్నాడు కృష్ణ.
"చూద్దాం" అన్నాను నేను. "అడవిలో ఏదో జరిగి ఉండాలి. ఏ వేటగాళ్ళో, గ్రామప్రజలో వాటిని భయపెట్టి ఉండాలి. మామూలుగా-నైతే ఏనుగులు పెద్ద శబ్దాలకు బెదురుతాయి. మీకెవరికైనా ఏమైనా శబ్దాలు వినబడ్డాయా?"
వాళ్ళిద్దరూ అడ్డంగా తల ఊపారు.
"ఇప్పుడు మనం ఏం తినాలి? అసలే ఆకలి వేస్తోంది. మధ్యాహ్నం దాటిపోయింది కూడా!" అన్నాడు విష్ణు బిక్కమొహం‌ వేస్తూ.
"తినేందుకు ఏమున్నై, ఏమీ లేవు. అడవిలో ఆకులు తిందాంలే, ఆగు!" అన్నాడు కృష్ణ వాడిని సముదాయిస్తున్నట్లు. అంతలో నాకు గుర్తుకొచ్చింది- "చాలా ఏళ్ళ క్రితమే మనిషి నిప్పుని తయారు చేయటం నేర్చుకున్నాడు. ఫ్రిక్షన్ ద్వారా నిప్పుని తయారు చేయచ్చు!" అని.
వెంటనే మా సైన్సు సర్ ని గుర్తుకు చేసుకొని, అక్కడ దగ్గర్లో ఉన్న ఎండు మొద్దుకి ఒక దానికి 'V’ ఆకారంలో ఒక రంధ్రం చేసాడు కృష్ణ. నా దగ్గరున్న కటర్‌తో రెండడుగుల కట్టె ముక్కని ఒకదాన్ని కోసుగా చెక్కి, ఆ రంధ్రంలో పెట్టి తిప్పేందుకు అనువుగా చేసాను. విష్ణు వెళ్ళి అక్కడక్కడా ఉన్న బెరడు ముక్కలు, ఎండు గడ్డి ఏరుకొచ్చాడు. ముగ్గురం కలిసి కష్టపడి చిలికి, చివరికి ఒక చిన్న నిప్పుకణికని తయారు చేసాం. దాన్ని ఊది-ఊది, పెంచి-పెంచి, చివరికి దానితోటే రెండు కాగడాలు అంటించాం!
ఆ తర్వాత ముగ్గరమూ మండే కాగడాలు పట్టుకొని కొంచెం దూరాన ఉన్న వాగు దగ్గరికి వెళ్లాం! వాగులో నీళ్ళు ఏమంత వేగంగా పారటం లేదు. వాటిలోనే చేపలు గంతులు వేస్తున్నాయి. నీళ్లలో ఆడుకుంటూ ఆడుకుంటూనే తలా మూడు చేపలు పట్టాము. ఇక ఆ రాత్రి వాటిని కాల్చుకొని తిన్నాము.
"రాత్రికి మనం ఇక్కడే పడుకుంటాము" అన్నాను నేను.
"నాకు భయం.." అన్నాడు విష్ణు.
"మనకు ఏమీ కాదులే, చెట్టు మీదికి ఎక్కి కొమ్మల్లో పడుకుందాం. నువ్వు క్రింద పడకుండా కొమ్మలతో‌ కట్టేస్తాం ఏమీ‌ పర్లేదు" అని నవ్వాడు కృష్ణ.
అందరం ఓ పెద్ద చెట్టు ఎక్కి కొమ్మల్లో పడుకున్నాం.
నేను మధ్య మధ్య లేచి చూస్తూనే ఉన్నాను. తెల్లవారు జాము వరకూ కాగడాలు అంటిస్తూ వచ్చాను.
చూస్తూండగానే తెల్లవారింది. ముగ్గురం చెట్టు దిగి క్రిందికి వచ్చాము. కొలనులో నీళ్ళు త్రాగి వెనక్కి బయలుదేరాము. అట్లా ఒక రెండు మైళ్ళు నడిచిన తరువాత వింత కంపు ఒకటి వచ్చింది. "ఇక్కడ ఒక సింహం ఉంది" అన్నాను నేను. కృష్ణ, విష్ణు ఇద్దరూ గుటకలు మ్రింగుతూ నిలబడి పోయారు. "గంటక్రితం ఇక్కడే ఉంది అది" గట్టిగా వాసన పీలుస్తూ చెప్పాను నేను.
వెళ్తూన్న కొద్దీ వాసన ఎక్కువవుతున్నది.. మాకు అడుగులు ముందుకు పడట్లేదు. ఏ క్షణాన అయినా సింహం ఎదురు పడచ్చు.. కానీ వేరే వైపుకు వెళ్ళాలంటే ఇష్టం అవ్వలేదు- 'మేం‌ వెళ్ళాల్సింది ఇటే' అని గట్టిగా అనిపిస్తున్నది.

సరిగ్గా ఆ క్షణానే బండ మీద సేద తీరుతున్న సింహం ఒకటి కనిపించింది మాకు. ఇక మా కాళ్ళు మా మాట వినలేదు. ఒకటే పరుగు పెట్టాయి.
త్వరలోనే మాకు ఘాట్ రోడ్డు కనబడింది. మేం వచ్చింది అటునుండే. మాకు ప్రాణం‌ లేచి వచ్చినట్లయింది. పరుగెత్తుతూనే ఘాట్‌రోడ్డుకు చేరాము. వెనక్కి చూస్తే సింహం లేదు! ఇప్పుడు ఆలోచిస్తే అనిపిస్తుంది- "అది బహుశ: అసలు మా వెంట పడనే లేదు- లేకపోతే దాని వేగం ముందు మేమెంత?" అని.

ఇంకో యాభై అడుగులు వేసామో, లేదో- మాకోసం వెతుక్కుంటూ వస్తున్న వ్యాన్లు ఎదురయ్యాయి. సఫారీ వాళ్ళు, పోలీసులు రాత్రంతా వెతుకుతూనే ఉన్నారట! దొరికిన పిల్లల్ని దొరికినట్లు బయట ఉన్న గెస్టు హౌసుకు చేర్చారట! అందరు పిల్లలూ‌ క్షేమంగా ఉన్నారు- మేం ముగ్గురమేనట, వాళ్లకు దొరకనిది! అందరూ చాలా భయపడ్డారట!
సఫారీ వాళ్ళు మాకు క్షమాపణలు చెప్పుకున్నారు. 'ఏమైతేనేం వీళ్ళు క్షేమంగా తిరిగి వచ్చారు అంతే చాలు!' అని అమ్మ, నాన్న సంతోషపడ్డారు.