జోకులు

డబ్బుల గోల!
డాక్టర్‌: ఏమయ్యా, ఇదేమైనా పద్దతిగా ఉందా? ఫీజుగా నువ్విచ్చిన చెక్‌ బౌన్స్ అయ్యి తిరిగి వచ్చింది.!
పేషంట్‌: మరి క్రితం సారి మీరు నయం చేసిన రోగం నాకు మళ్ళీ తిరిగి వచ్చింది గద సార్?!

తాళాలకోసం!
రాము: మా నాన్నకు నా మీద బొత్తిగా నమ్మకం లేదని తేలిపోయిందిరా..!
సూరి: ఏమయ్యందేంటి..? ఎందుకలా అంటున్నావు..?
రాము: ఏం లేదురా.. పొద్దునే మూర్చ వచ్చినట్లు నాటకమాడాను. దగ్గర్లో బీరువా తాళం ఉన్నప్పటికీ ఇల్లంతా వెతికి ఓ పనికిరాని ఇనుపముక్క తెచ్చి నా చేతిలో పెట్టాడురా..?!

భూగోళం పాఠం!
బాటసారి : బాబూ! ఈ రోడ్డెక్కడికిపోతుంది!
వ్యక్తి: తిన్నగా పోతే దక్షిణానికి. అటు తిన్నగాపోతే ఉత్తరానికి తర్వత తూర్పుకు, ఆఖరుకు పడమరకు తిరిగి చివరకు యిక్కడికే వస్తుంది బాబూ!

గొప్ప అనుభవం! హీరో: నా దగ్గర 'మేకప్‌ మ్యాన్‌'గా పని చేస్తానంటున్నావు... అనుభవం ఉందా..?
పేరయ్య: ఉందండి సారూ... గత పదిహేనేళ్ళుగా తాపీ మేస్త్రీగా పని చేస్తున్నా..!

ఆవాల నవ్వులు!
డాక్టర్:‌ ఆవాలు బరువు తగ్గడానికి చాలా బాగా ఉపయోగపడతాయి.
పేషెంట్: అవునాండి, డాక్టరు గారు! వాటిని ఎలా ఉపయోగించాలి?
డాక్టర్: ఒక కిలో ఆవాలు గిన్నెలో‌ తీసుకోవాలి. తరవాత వాటిని కింద నేలమీద పడేయాలి. ఇప్పుడు కిందకు వంగి, ఒక్కొక్క ఆవాల గింజని ఏరి, మళ్ళీ అదే గిన్నెలో వేయాలి.
ఇట్లా వారానికి మూడు సార్లు చేస్తే కచ్చితంగా బరువు తగ్గుతారు!!!

సగం తెలివి!
అనిల్‌: అదేంట్రా.. రెండూ ఒకే రకం పుస్తకాలెందుకు కొన్నావు?
కుమార్‌: ఈ పుస్తకం చేతిలో ఉంటే సగం పరీక్షలు పాసైనట్లే అని రాసుంది.అందుకే రెండు కొన్నాను.

మంచి బేరగాడు!
పేషెంట్‌: డాక్టరుగారు, ప్లాస్టిక్‌ సర్జరీ కి ఎంత ఖర్చు అవుతుంది..?
డాక్టర్‌: 50.000 వరకు అవుతుంది..
పేషెంట్‌: ఒకవేళా ప్లాస్టిక్‌ మేము తెచ్చుకుంటే...?

సెలవులయ్య!
రాము క్యాలెండర్‌ కావాలంటూ బజారుకెళ్ళాడు. దుకాణదారు క్యాలెండర్లు చూపిస్తుంటే ప్రతీ దాన్నీ వద్దుంటూ, 'ఇంకాస్త మంచిది ఇవ్వండి' అంటున్నాడు.
దుకాణదారు (చికాకుగా): ఇంతకీ నీ దృష్టిలో మంచిదంటే ఏంటి?
రాము: అంటే... స్కూలుకు సెలవులు బాగా ఇచ్చేలా ఎర్రరంగు గళ్ళు ఎక్కువుండాలి..

పద్యాలు 1
ఊరక సజ్జనుండొదిగి యుండిననైన దురాత్మకుండు ని
ష్కారణమోర్వలేక యపకారము చేయుట వాని విద్యగా
చీరలు నూరు టంకములు జేసెడివైనను పెట్టెనుండగా
జేరి చినింగిపోగొరుకు చిమ్మటకేమి ఫలంబు భాస్కరా?!
తాత్పర్యం: వందల కొద్దీ రూపాయల విలువ చేసేవైనా సరే, చీరలు పెట్టెలో‌ ఉన్నాయంటే చిమ్మటలు వచ్చి వాటికి చిల్లులు పెడతాయి. అట్లా అని వాటికి ఏమైనా లాభం ఉంటుందా? ఉండదు. అదే విధంగా, మంచివాడు ఊరికే తన పని తాను చేసుకుంటూ ఒదిగి ఉన్నప్పటికీ, దుష్టుడు అసలు కారణం అంటూ ఏదీ‌ లేకనే- ఓర్వలేక- వాడికి అపకారం తల పెడతాడు. అది వాడికి వచ్చిన ఒకే ఒక విద్య మరి!.

2
అరయ తరచు కల్లలాడెడు వారిండ్ల
వెడల కేల లక్ష్మి విశ్రమించు?
ఓటికుండ నీరు పోసిన చందాన!
విశ్వదాభిరామ వినుర వేమ!
భావం:‌ చిల్లి కుండలో నీళ్ళు పోస్తే నిలవవు కదా, అలాగే ఊరికే అబద్ధాలు చెప్పేవారి ఇళ్ళలో‌ కూడా సంపద నిలవదు.

3
వేరుపురుగు చేరి వృక్షంబు జెరచును
చీడపురుగు చేరి చెట్టు జెరచు
కుత్సితుండు చేరి గుణవంతు జెరచురా
విశ్వదాభిరామ వినురవేమ!
భావం: వేరు పురుగు చెట్టు మొత్తాన్నీ పాడు- చేస్తుంది. చీడ పురుగు మొక్కను నాశనం చేస్తుంది. అట్లాగే చెడ్డ గుణాల వాడు చేరి మంచివాణ్ణి కూడా పాడు చేస్తాడు.

క్రికెట్ క్విజ్! 1. క్రికెట్ ఎప్పుడు పుట్టింది? ఏ దేశంలో‌?
2. T20 క్రికెట్ కు ఆ పేరు ఎందుకొచ్చింది? టీ ట్వెంటీ మ్యాచులు ఎంత సేపు జరుగుతాయి?
3. ఒక్కో క్రికెట్ టీంలోను ఎందరు ఆటగాళ్ళు ఉంటారు?
సమాధానాలు: 1. క్రికెట్ ఆట 18వ శతాబ్దంలో ఆగ్నేయ ఇంగ్లాండ్ లో మొదలైంది.
2. అది ట్వెంటీ ట్వెంటీ క్రికెట్ మ్యాచ్ కు సంక్షిప్త రూపం. ఈ రకం ఆటలో రెండు టీములూ చెరొక ఇరవై ఓవర్ల బంతులను మాత్రమే ఎదుర్కొంటాయి గనక ఆ పేరు.
3. క్రికెట్ టీంలో పదకొండు మంది ఆటగాళ్ళు ఉంటారు. అయితే పన్నెండవ ఆటగాడిని
అదనపు ఆటగాడుగా ఉంచుకుంటారు. అవసరాన్ని బట్టి పన్నెండవ వాడిని ఆడనిస్తారు.

పొడుపు కథలు
1. పొడువాటి మానుకి నీడే లేదు?
2. పైడిపెట్టెలో ముత్యపు గింజ?
3. ఇంతింత ఆకు, ఇంపైన ఆకు, రాజుల మెచ్చిన రత్నాల ఆకు?
4. అడ్డగోడమీద బుడ్డ చెంబు, తోసినా ఇటుపక్క పడదు. అటు పక్క పడదు?
5. మనిషికి రెండే కాళ్లు, ఏడు చేతులు?

జవాబులు: 1. దారి, 2. వడ్లగింజ, 3. తమలపాకు, 4. ఆబోతు మూపురం, 5. నిచ్చెన

వివేకానందుని సూక్తులు
1. బద్దకమే అసలు పాపం, అదే పేదరికానికి కారణం
2. మనిషికి వెలుగునిచ్చి మనోవికాసానికి తోడ్పడేది విద్య.
3. గమ్యం స్థిరంగా ఉండాలి, మార్గం ఖచ్చితంగా నిర్ణయించుకోవాలి, ప్రయత్నం రాజీలేని ధోరణిలో సాగాలి అపుడే విజయం మనదవుతుంది
4. నిరంతరం వెలిగే సూర్యున్ని చూసి చీకటి భయపడుతుంది. నిరంతరం శ్రమించేవాణ్ని చూసి ఓటమి భయపడుతుంది."
5. విలువైన వస్తువు విలువైన వారి దగ్గర ఉంటే దానికి మరింత విలువ పెరుగుతుంది.
6. నాటకం అన్ని కళలలోకి కష్టతరమైంది
7. అసత్యం కన్నా సత్యం అనంత రెట్లు బరువైనది, మంచితనం కూడా అంతే
8. "సిరి సంపదలు మంచితనాన్ని తీసుకురావు. మంచితనం మాత్రం అభిమానాన్ని దీవెనలను తీసుకువస్తుంది."
9. నీ ఆశయ సాధనలో వెయ్యిసార్లు విఫలం చెందినా ప్రయత్నం విరమించకు
10. ఓర్పుతో అసాధ్యమైన కార్యాన్ని సుసాధ్యం చెయ్యవచ్చు
11. మనిషి లక్ష్యం న్యయం కంటే మించినది
12. నిరుపేదల కష్టాలను చూచీ ద్రవించే హృదయం కలవాడే మహాత్ముడు
13. మనసా వాచా కర్మణా పవిత్రతను పాటించు.