రెజిల్ దేశంలో ఒక కోటీశ్వరుడి దగ్గర ప్రపంచంలోకెల్లా అతి ఖరీదైన కారు ఒకటి ఉండేది. ఒకసారి ఆయన తన ఆ కారుని "ఫలానా రోజున పాతి పెట్టబోతున్నాను" అంటూ ప్రకటన ఇచ్చాడు:
"నేను ఈ కారుని ఎందుకు పాతిపెట్టేస్తున్నానో కూడా చెబుతాను. ఇప్పుడు వాడుకునేందుకు అయితే నాకు వేరే కార్లు ఉన్నాయి. ఇక ఒకసారి నేను చనిపోయాక, ఇంక ఈ కారు వలన నాకు ఏలాంటి ప్రయోజనమూ లేదు! అందుకని ఈ కారుని ఇప్పుడే పూడ్చిపెట్టటం అన్నివిధాలుగానూ సరైన పని!" అని ఆ ప్రకటనలో తెలియజేసాడు.
అందరూ దీన్ని గురించి రకరకాలుగా వ్యాఖ్యానించారు. కొందరు "ఈ కోటీశ్వరుడికి డబ్బులు ఎక్కువైనాయి" అన్నారు.
కొందరు "అయ్యో! డబ్బులు ఉన్నాయిగానీ వీడు బలే తెలివి తక్కువ దద్దమ్మ" అన్నారు.
"ఇంత విలువైన కారుని వృధా చేస్తున్నాడు. ఎంత పొగరో చూడండి" అన్నారు కొందరు- మొత్తం మీద ఆయన్ని ఎరిగిన వారిలో ఆయనను తిట్టుకోనివారు లేరు.
చివరికి కారును పాతిపెట్టే రోజు రానే వచ్చింది. ఆ కార్యక్రమం ఎలా జరుగుతుందో చూడటానికి జనం అంతా వచ్చారు. కారుని పాతిపెట్టడానికి చాలా గొప్ప ఏర్పాట్లు చేశాడు కోటీశ్వరుడు. వచ్చినవాళ్లందరికీ విందు ఏర్పాటు చేసాడు; కారు పట్టేంత పెద్ద గుంత త్రవ్వి ఉంచాడు; ఆ గుంతలోకి కారును దించేందుకు క్రేన్లు వగైరాలు అన్నీ ఏర్పాటు చేసాడు; కార్యక్రమాన్ని చూసేందుకు అక్కడికి చేరిన ప్రజలంతా సుఖంగా కూర్చునేందుకు ఏర్పాట్లు చేసాడు.
అందరూ గుమికూడి ఉత్సాహంతోటీ మరియు అశ్చర్యంతోటీ వేచి చూస్తున్నారు. అంతలోనే కోటీశ్వరుడు వచ్చాడు. అక్కడికి చేరిన ప్రజలందరినీ పేరు పేరునా పలకరించాడు. కరచాలనాలు చేసాడు. తనేదో చాలా గొప్ప పని చేస్తున్నట్లు పోజు కొట్టాడు.
దాంతో అక్కడికి వచ్చిన వాళ్ళకు అందరికీ రోషం పెల్లుబికింది. అందరూ కోపంతో ఉడికిపోతూ "అయినా మీరెందుకు, ఇంత విలువైన కారుని వృధా చేస్తున్నారు? మీరు చనిపోయాక ఇది మీకు పనికి రాకపోవచ్చు. అంత మాత్రాన దీనిని ఊరికే పాతిపెడతారా?! ఎవరికైనా ఇవ్వచ్చు కదా?! ఇంత విలువైన దానిని నాశనం చేసే అధికారం మీకు ఎవరు ఇచ్చారు?" అని అతన్ని ప్రశ్నించారు.
కోటీశ్వరుడు నవ్వి, ఇలా సమాధానం ఇచ్చాడు. "ఇంత విలువైన కారుని సమాధి చెయ్యడానికి నేనేమీ బుద్ధి తక్కువ వాడిని కాను. దీని ద్వారా నేను అందరికీ ఒక సందేశాన్ని ఇవ్వాలనుకున్నాను.
చూసారుగా, నిజంగానే ఈ కారు చాలా విలువైనది. అయినా నేను దీన్ని పాతి పెట్టాలని నిర్ణయం తీసుకున్నందుకు మీ అందరికీ నా మీద ఎంత కోపం వచ్చింది?! కదా?!
కానీ మీరెవ్వరూ గమనించని సంగతి ఇంకోటి ఉన్నది. మన శరీరంలో ఎంతో విలువైన గుండె, కళ్ళు, ఊపిరితిత్తులు, మూత్ర- పిండాలు ఇలా ఎన్నెన్ని అవయవాలు ఉన్నాయి? ప్రతి అవయవమూ మానవ సమాజానికి ఉపయోగపడేవే! వెల కట్టలేనంత విలువ వీటిది! అయినా, మనం చచ్చిపోగానే ఈ అవయవాలన్నీ మనతోపాటే అనవసరంగా, వృధాగా మట్టిలో కలిసిపోవట్లేదా? వాటిని గురించి ఎవ్వరికీ ఏ మాత్రం చింత ఎందుకు లేదు?
కారు పోయినా, డబ్బు పోయినా మళ్లీ తిరిగి వస్తాయి; కానీ మన అవయవాలు తిరిగి రావు కదా, మరి మనం ఎందుకు, వాటిని ఇతరులకు పనికొచ్చేట్లు బహుమతిగా ఇవ్వట్లేదు?
మీకు తెలుసా? ప్రతి ఏటా కొన్ని లక్షల మంది అవయవ దానం కోసం ఎదురు సూస్తున్నారు. మనం అనుకుంటే వాళ్లకు చాలా సాయం చేయచ్చు! ఆలోచించండి! అవయవదానం చెయ్యడానికి నిర్ణయించు-కోండి. అవయవ దానం ఎంత అవసరమో అందరూ గుర్తించేలా చేసేందుకే నేను ఈ నాటకం ఆడాను!" అన్నాడు.