ఆ రోజున ఆలస్యంగా నిద్రలేచాం, నేను, మా చెల్లి ఇద్దరం. గడియారం చూసుకొని, ఆదరాబాదరాగా తయారై బడికి పరుగు పెట్టాము.
ఆ సరికే మా తెలుగు క్లాసు మొదలయిపోయింది. తెలుగు టీచర్ గారు అడవి గురించి, అడవి జంతువుల గురించి చెబుతున్నారు. నేను "లోపలికి రావచ్చా టీచర్" అని అడిగి, వెళ్ళి సర్దుకుని కూర్చునే సరికి, టీచరుగారు ఏనుగుల గురించి చెబుతున్నారు. వేరే ఆలోచించే అవకాశం ఏమీ లేకనో, ఏమో, ఆవిడ చెప్పిన సంగతులన్నీ బాగా ఎక్కాయి నా మనుసులోకి.
అందుకనే ఆ రోజు రాత్రి పడుకునేముందు నానమ్మని ఏనుగు కథే చెప్పమన్నాను. రోజూ నానమ్మ చెప్పే కథలు వింటూ పడుకోవటం అలవాటు నాకు..
ఒకసారి నేను, మా చెల్లి, బడిపిల్లలు, ఉపాధ్యాయులు అందరం కుంతలగుండు అడవి చూసేందుకని వెళ్లాం. అడవిలో కొంచెం దూరం పోయాక, డ్రైవరు బస్సుని ఒక మలుపులో ఆపి, "అల్పాహారం తిని రండి!" అన్నాడు. ఆ సరికి అందరమూ మంచి ఆకలి మీద ఉన్నాం. గబగబా ఎవరు తెచ్చుకున్న టిఫిన్ బాక్సులు వాళ్లం పట్టుకొని బస్సు దిగాం. నేను, మా చెల్లి కొంచెం దూరం వెనక్కి నడిచి, అక్కడ చెట్ల నీడలో కూర్చున్నాం. అయితే మేం టిఫిన్ తిని చూసేసరికి, మా బస్సు కాస్తా వెళ్ళిపోయింది!
ఇక మా చెల్లి ఏడుపు మొదలెట్టింది. "చెల్లీ! నువ్వు ఇదేనా, నేర్చుకున్నది? బడిలోనూ, ఇంట్లోనూ మనకు ఏం చెప్పారు- 'కష్టతర పరిస్థితులలో ధైర్యంగా ఉండాలి' అని చెప్పారా, లేదా?" అని కాస్త ధైర్యం ఇచ్చాను. నిజానికి నాకు కూడా ఏడుపొచ్చేలా ఉంది; కానీ 'నేను ఏడుస్తూ ఉంటే నాకన్నా చిన్నది- అది ఊరుకుంటుందా?' అని, అలా నేను చాలా ధైర్యంగా ఉన్నట్టు నటించానన్నమాట.
అయినా ఎటు నుండి ఏ జంతువు మీదికి దూకుతుందో ఏమో' అని నాకైతే ప్రాణాలు ప్రాణాల్లో లేవు; ఏదో ఓ పెద్ద చెట్టుకింద కూర్చున్నాంగానీ.
అడవిలో వాతావరణం అంతా తేమగా, చల్లగా ఉంది. కొద్ది సేపటి తర్వాత గాలి అంతా బరువు బరువుగా కూడా అనిపిం-చింది. ఆకాశం మొత్తం నల్లటి మేఘాలతో మూసుకొని ఉంది. "వానపడుతుందేమో" అన్నది చెల్లి.
ఇంతలో దగ్గర్లో ఏదో పిడుగు పడ్డట్టు పెద్ద శబ్ధం వినిపించింది. ఇద్దరం చెంగున ఎగిరి పడ్డాం.
మా చుట్టూతా పొగమంచు కమ్ముకున్నది. ఆశ్చర్యమే- అంతకు ముందు కనిపించిన రోడ్డు మాకు ఇప్పుడు కనిపించట్లేదు. ఐదారు అడుగుల దూరం తర్వాత, ఇంక అంతా మంచే.
అంతలో ఆ పొగమంచులో మసకగా ఏదో ఆకారం కనిపించి, ఇద్దరం బిర్ర-బిగుసుకుపోయాం. అదేదో సింహం కావచ్చు.. సరిగా కనిపించట్లేదు.. ఒకటి కాదు- రెండు ఉన్నట్లున్నాయి. ఒకటి చిన్నగాను, ఒకటి పెద్దగాను.. "కదలకు. కదిలితే మనం ఇక్కడున్నట్లు తెలుస్తుంది వాటికి!" అన్నాను చెల్లెతో గుసగుసగా.
కొద్ది సేపటికి, ఆ ఆకారాలు మరింత దగ్గరికి వచ్చాక, తెలిసింది- మాకు ముందుగా కనిపించింది ఒక ఏనుగు పిల్ల. ఆ ప్రక్కన ఉన్నది వాళ్ల అమ్మో, నాన్నో అయి ఉండచ్చు, చాలా పెద్దగా ఉంది, ఇంతింత పెద్ద కోరలతో. ఏనుగులు రెండూ మాకు అల్లంత దూరాన నిలబడ్డాయి.
మమ్మల్ని చూడగానే అవి రెండూ ఆగిపోయి బొమ్మల్లాగా నిలబడినై. ఇక్కడ మేం కూడా అంతే. అంతలోనే పెద్ద ఏనుగు తొండం పైకెత్తి గట్టిగా ఘీంకరించటం మొదలెట్టింది. చిన్న ఏనుగు దాని కాళ్ళ చుట్టూ తిరగటం మొదలు పెట్టింది.
మాకు ఏం చేయాలో తెలీలేదు. "ఈ ఏనుగేదో దాని తోటి మందని పిలుస్తున్నట్లుంది. అవన్నీ కలిస్తే మనల్ని ఏం చేస్తాయో!" అన్నాను నేను.
"అదేమీ కాదు. నాకు అర్థమైంది. ఆ ఏనుగు మనల్ని దగ్గరికి రమ్మంటోంది. దానికి ఏదో సమస్య ఉందని చెబుతున్నది అది" అన్నది చెల్లి. కొంచెం సేపటికి ఏనుగు ఘీంకరించటం అయిపోగానే దానివైపుకు రెండు అడుగులు వేసాను నేను.
వెంటనే అది మళ్ళీ అరవటం మొదలెట్టింది.
ఆపగానే నేను ఇంకొంచెం దగ్గరికి వెళ్ళాను. చిన్న ఏనుగు ఇప్పుడు దాని వెనకకాళ్ల చుట్టూ తిరుగుతూ నాకేసే భయం భయంగా చూస్తోంది.
"అన్నయ్యా! మన బ్యాగులో డజను అరటిపళ్ళున్నై కదా, దీనికి పెట్టు పాపం" అంది చెల్లి, నా వెనకనుండి. నేను వెనక్కి తిరిగి వెళ్ళి తన చేతిలోంచి అరటిపళ్ళు తీసుకున్నాను. ఆలోగా రెండు ఏనుగులూ మా దగ్గరికే వచ్చేసాయి. నేను ఇచ్చిన అరటిపళ్లను తల్లి ఏనుగు తీసుకొని, కొన్ని పిల్లకు ఇచ్చి, కొన్ని తను తిన్నది. ఆలోగా చెల్లి ఆ ఏనుగుల చుట్టూ తిరిగి వచ్చి చెప్పింది- "దీని సమస్య అర్థమైంది. వెనక కాలికి కుడి వైపుగా పెద్ద గాయం అయ్యింది దీనికి" అని. "నానమ్మ చెప్పే కథల్లో లాగా ఏమైనా ఆకులు తీసుకొచ్చి కట్టు కడదాంరా దీనికి, పాపం" అంది.
"సరే" అని నేను వెళ్ళి నాకు తోచిన ఆకులన్నీ తెచ్చాను. వాటినన్నిటినీ నేను, చెల్లి ఇద్దరం అక్కడున్న రాళ్ళమీద నూరాం. అంతసేపూ ఏనుగులు రెండూ ప్రశాంతంగా నిలబడి చూసాయి. దాంతో మాకు అవంటే భయం పోయింది.
ఆ ఆకులన్నిటినీ మేం తెచ్చుకున్న "టవల్" లో వేసి, "నీ కాలికి కడతాం" అని సైగలు చేసుకుంటూ మెల్లగా పోయాను ఏనుగు దగ్గరికి. వెంటనే చిన్న ఏనుగు దూరంగా పరుగు తీసింది. "పెద్ద ఏనుగు ఏమంటుందో" అని ఒక్క క్షణం భయపడ్డాను కానీ, అది ఏమీ అనలేదు. పై పెచ్చు వెనక్కి తిరిగి దాని కాలుని నాకు దగ్గరగా జరిపింది!
"ఏనుగు చాలా తెలివైన ప్రాణి" అని గుర్తు చేసుకున్నాను నేను. దాని వెనకనే నేలమీద కూర్చొని, దాని కాలికి కట్టు కట్టాను. అలోగా చిన్న ఏనుగు కూడా మా దగ్గరికి వచ్చి, ఆప్యాయంగా మమ్మల్ని రుద్దుకున్నది. దాని చర్మం అంతా గరుకుగాను, మురికిగాను ఉన్నదిగాని, ఆ సమయంలో మాకు అది సంతోషమే అనిపించింది. మేం కూడా ఆ చిన్న ఏనుగు చెవులు పట్టుకుని సరదాగా నవ్వుకున్నాం.
ఇంతలో బస్సు హారన్ వినబడింది. మమ్మల్ని వెతుక్కుంటూ వచ్చారు మా ఉపాధ్యా-యులు. మాకు ఎదురుగా ఏనుగుల్ని చూడగానే వాళ్ళు నిశ్చేష్టులై-పోయారు. "ఏయ్! జాగ్రత్త! వైల్డ్ ఎలిఫెంట్స్! కాళ్లతో తొక్కేస్తై! ప్రమాదం!" అని ఏవేవో చెప్పబోయారు వాళ్ళు. అయితే అంతలోనే నేను అడ్డుపడి విషయం వివరించాను.
మేం బస్సులో ఎక్కేందుకు పోతుంటే ఏనుగులు రెండూ మా వెనకనే నడుస్తూ వచ్చాయి. బస్సెక్కాక తొండాలు ఊపి టాటా చెప్పాయి!
అంతలోనే అమ్మ వచ్చి గట్టిగా కుదిపింది- "నిద్రలేరా! బడికి సమయం కావస్తోంది!" అని! అప్పుడర్థమైంది- ఇది కల అని! అయినా ఎంత చక్కని కల, కదా?!