కొత్తపల్లిలో ఉండే కళ్యాణ్ కు మతిమరుపు. అతని భార్య బయ్యమ్మకు కూడా మతిమరుపే. వాళ్ల మతిమరుపు గురించి అందరూ కథలు కథలుగా చెప్పుకుంటారు.
ఒకసారి బయ్యమ్మకు తన మతిమరుపుతో విసుగు వచ్చేసి, "ఇగో, ఏదో ఒకటి చెయ్యప్పా, నాకు ఈ మతిమరుపుతో చానా కష్టంగా ఉంది" అంది.
"ఏం చెయ్యమంటావో చెప్పు, నాకు గుర్తుంటే చేస్తాను" అన్నాడు కల్యాణ్.
సరిగ్గా ఆ సమయానికి వాళ్ళ ఇంటి గుమ్మం ముందునుండి పోతున్నది ఒక గాడిద. "గాడిద పాలు త్రాగితే మతిమరుపు నయం అవుతుంద"ని ఎవరో చెప్పినట్లు గుర్తొచ్చింది బయ్యమ్మకు.
"నాకు గాడిద పాలు తెచ్చి పెట్టు" అంది.
"సరే" అని కల్యాణ్ గాడిద కోసం ఊరంతా తిరగటం మొదలెట్టాడు. అయితే గాడిదలన్నీ రేవు చేరాయో ఏమో, వాడికి ఒక్క గాడిద కూడా కనిపించలేదు ఊళ్ళో. చివరికి వాడు వాళ్ళ ఊరి ప్రభుత్వ ఆసుపత్రిలో నెంబరు తీసుకొని, లైన్‌లో నిలబడ్డాడు.
వాడి నెంబరు వచ్చాక డాక్టరుగారు అడిగారు- "ఏంటి, నీ సమస్య?" అని.
"నాకు ఏమీ గుర్తుండట్లేదు" అన్నాడు కల్యాణ్, కొంచెం సేపు ఆలోచించి.
"మతిమరుపు మందులు సప్లై ఉండవప్పా, బలానికి ఏదైనా టానిక్ ఇమ్మంటే ఇస్తాను" అన్నాడు డాక్టరు. "మరి గాడిద పాలు?" అనేసాడు అకస్మాత్తుగా ఆ సంగతి గుర్తొచ్చిన కల్యాణ్.
"దేవుడా! నీకు నిజంగానే మతిమరుపు మందులు కావాలి. కానీ పాలు మాత్రం ఆసుపత్రిలో అమ్మరు నాయన్నా! పోయి పొలాల్లో పనిచేసే రైతుల్ని అడుగు!" అని చెప్పి పంపాడు డాక్టరు గారు.
కల్యాణ్ మళ్ళీ మర్చిపోతానేమోనని భయం కొద్దీ "గాడిద పాలు-గాడిద పాలు" అని మంత్రం చదువుకుంటూ రైతుల దగ్గరికి పోయాడు. రైతులు నవ్వి, "పాలన్నీ ఇప్పుడు డైరీలోనేనప్పా, ఉండేది" అని వాళ్ల దగ్గరికి పంపారు.
కల్యణ్ పాలవాడి దగ్గరికి వెళ్ళి పది లీటర్ల గాడిద పాలు కావాలన్నాడు.
అప్పుడు ఆ పాలవాడు కల్యాణ్‌నే ఎగాదిగా చూస్తూ "ఇదేదో మంచి బేరమే! ఎవరైనా ఆవుపాలో, మేకపాలో అడుగుతారు. వీడికి గాడిద పాలు కావాలట!" అని అనుకొని, "అవి చాలా రేటు. లీటరు రెండొందల వరకూ ఉంటుంది!" అన్నాడు.
"సరేలే, అవేవో నాకు దొరికితే చాలు! ఒక ఐదు లీటర్లు కానివ్వు" అంటూ కల్యాణ్ వాడికి వెయ్యి రూపాయలిచ్చాడు. "ఇక్కడే వుండు, నేను పోయి తెచ్చిస్తాను నీకు!" అని చెప్పి, వాడు తనకు తెల్సిన చాకలి వాని దగ్గరికి పోయి లీటరు గాడిద పాలు కొని, వాడికి వందరూపాయలు ఇచ్చి వచ్చాడు. "ఈ లీటరు గాడిద పాలకు నాలుగు లీటర్లు అవుపాలు కలుపుతాను" అనుకున్నాడు వాడు.
అయితే పాలని చూడగానే ఎగిరి గంతేసిన కల్యాణ్ వాడికి ఆ అవకాశం ఇవ్వనే లేదు. ఆ లీటరు పాలూ పట్టుకొని, పాలవాడికి ధన్యవాదాలు చెప్పుకుంటూ ఇల్లు చేరుకున్నాడు. తనకు అదనంగా నాలుగు లీటర్ల ఆవుపాలు మిగిలినందుకు పాలవాడు కూడా సంతోషపడి, ఊరుకున్నాడు.
అయితే ఆ సరికి బయ్యమ్మ తను గాడిద పాలు తెమ్మన్న సంగతి మరచే పోయింది. కల్యాణ్ కూడా తను తెచ్చింది గాడిద పాలు అని మరచే పోయాడు. ఇద్దరూ కలిసి ఆ పాలతో టీ పెట్టుకొని త్రాగారు!
తర్వాతి రోజున కల్యాణ్‌కి గుర్తొచ్చింది- "అవునే, నేను తెచ్చిన గాడిదపాలు ఎన్ని లీటర్లు?" అని అడిగాడు. "ఏమోనండి, లీటరంటే ఎన్ని పాలొస్తాయో నాకెక్కడ గుర్తుంటుంది?" అన్నది బయ్యమ్మ.
అయితే కల్యాణ్ జేబులో చూసుకుంటే డబ్బులు బాగా తక్కువ కనిపించాయి. దాంతో అతను "పాలవాడి దగ్గరికే వెళ్ళి అడుగుతాను- నాకు ఎన్ని పాలు ఇచ్చాడో, ఎంతకి ఇచ్చాడో" అని ఊళ్ళోకి బయలు దేరాడు.
పట్టుదలగా తనవైపుకే వస్తున్న కల్యాణ్‌ని దూరం నుండే చూసాడు పాలవాడు. 'అంతకు ముందు రోజు తను వాడిని మోసం చేసినందుకు ఏమంటాడో' అని అతను హడలిపోయాడు. అయితే అతని ఆలోచన తెగేలోగా కల్యాణ్ అతని దగ్గరికి రానే వచ్చాడు.
"అవునూ," అని మొదలు పెట్టాడుగానీ, ఆ తర్వాత తను ఎందుకొచ్చాడో మరచిపోయాడు కల్యాణ్.
"నిన్న నువ్వు ఇచ్చిన డబ్బుల గురించి కదా, ఇదిగో- దీన్ని నేను నాకోసం కొనుక్కున్నాను, కానీ నువ్వు అడిగావని ఇచ్చేస్తున్నాను. ఇది ఇక నీదే.. పూర్తిగా నీదే. ఇవాళ్ల సాయంత్రమే దీని డ్రా తీస్తారు.. ఎంత బహుమతి వచ్చినా అది నీకే!" అని తను అంతకు ముందు కొన్న ఓ లాటరీ టిక్కెట్టును కల్యాణ్ చేతిలో పెట్టాడు పాలవాడు.
కల్యాణ్ ఏదో గుర్తుకొచ్చినట్లు అనబోతుంటే అతను అటూ ఇటూ చూసి, అక్కడే ఓ టబ్బు దగ్గర తిరుగుతున్న తాబేలును ఒకదాన్ని తీసి కల్యాణ్ చేతిలో పెట్టి, "ఇదిగో! ఈ తాబేలు కూడా నీకే! తీసుకో! మన లెక్క దీంతో సరిపోయింది!" అని చెబుతూ గబగబా లేచి వెళ్ళిపోయాడు, గట్టిగా ఊపిరి పీల్చుకుంటూ.
ఆ లాటరీ టిక్కెట్టును, తాబేలును పట్టుకొని సంతోషంగా ఇంటికొచ్చాడు కల్యాణ్. "చూడు! ఇవాళ్ళే డ్రా తీస్తారట! ఈ తాబేలునేమో.. మరి.. ఎందుకిచ్చాడో మర్చిపోయాను- ఏదో చెప్పి ఇచ్చాడు నాకు" అన్నాడు, బయ్యమ్మతో.
రంగు రంగుల ఆ టిక్కెట్టుని చూసి మురిసిపోయింది బయ్యమ్మ. అయితే ఆ రోజు సాయంత్రం లాటరీలో మొదటి బహుమతి కోటి రూపాయలు కల్యాణ్ చేతిలో ఉన్న టిక్కెట్టుకే వచ్చాయి!
ఆ డబ్బుల చెక్కుని అందుకుంటూ కల్యాణ్ "నాకు ఈ టిక్కెట్టు కొనిపెట్టిన నా భార్యకు కృతజ్ఞతలు!" అని చెబుతుంటే, అక్కడే ఉన్న పాలవాడు వీళ్ల మతిమరుపును తలచుకొని స్పృహ తప్పి పడిపోయాడు!
బహుమతిని అందుకుంటూ మురిసిపోతున్న కల్యాణ్ వీడియోని లాటరీ వాళ్ళు ఇంటర్నెట్లో పెట్టారు. ఆ వీడియోలో అటూ ఇటూ తిరుగుతూన్న తాబేలుని చూసి, జూ అధికారి ఒకడు గుర్తుపట్టాడు- అది చాలా అరుదైన రకం తాబేలు! అతను చెప్పటంతో కదిలిన అధికార యంత్రాంగం కల్యాణ్‌ని అడిగింది- "ఇది మీకు ఎక్కడ దొరికింది?" అని. "ఏమో, గుర్తులేదు. పాల దుకాణం దగ్గర కాబోలు, దొరికింది" అన్నాడు కల్యాణ్. "దీన్ని మా జూకు ఇవ్వరాదూ? మీకో చక్కని బహుమతి ఇస్తాం" అని వాళ్ళు తాబేలుని తీసుకెళ్ళి, వీళ్లకు పదివేల రూపాయల బహుమతినిచ్చారు!
అట్లా ధనవంతులైన కల్యాణ్, బయ్యమ్మ పట్నంలో మంచి ఆస్పత్రికెళ్ళి. తమ మతిమరుపును బాగు చేయించుకున్నారు.