స్వాగతం!
కొత్తపల్లిలో పిల్లల రచనలకు ప్రాధాన్యత ఉంటుంది. ఈ పుస్తకంలో సగానికి పైగా కథలు పిల్లలు రాసినవి; మిగిలినవి పిల్లల- కోసం పెద్దలు రాసినవి. బొమ్మలు వేసిన వాళ్ళు కూడా చాలామంది పిల్లలే.
పిల్లలను కలవటం, వాళ్లతో తెలుగులో కథలు రాయించటం, బొమ్మలు వేయించటం, వాళ్ళు పంపిన కథల్ని, బొమ్మల్ని సరిదిద్ది, మిగతా పిల్లలందరికీ నచ్చేట్లు పుస్తకాలుగా తయారు చేయటం, దానికోసం ఓపెన్ సోర్సు ఉపకరణాలను వాడటం, కథల్ని అందరూ ఉచితంగా చదువుకునేట్లు ఇంటర్నెట్‌లో పెట్టటంతోపాటు, కొన్ని ప్రతులు అచ్చు వేసి, పిల్లలచేత చదివించటం మాకు ఇష్టం. అందరి మేలూ కోరి చేసే ఈ పనిలో మీరూ పాలు పంచుకోండి. చేతనైన సాయం చేయండి. పిల్లల కథల ప్రపంచానికి స్వాగతం!
పొడుపు కథలు
-
తలుపుల సందున మెరుపుల గిన్నె. ఏమిటా మెరిసేది?
-
తల్లి దయ్యం, పిల్ల పగడం. ఏంటా తల్లి, ఏంటా పిల్ల?
-
తెల్లకోటు తొడుక్కున్న ఎర్రముక్కు దొర. ఎవరీ దొరగారు?
-
నల్లకుక్కకు నాలుగు చెవులు. ఏంటది?!
-
తల నుండి పొగ చిమ్ముతుంది; భూతం కాదు. కన్నులెర్రగా ఉంటాయి; కానీ రాకాసి కాదు. పాకి పోతూంటుంది. కానీ పాము కాదు. ఏమిటది?!
-
ముక్కు మీదికెక్కు, ముందరి చెవులు నొక్కు, టక్కు నిక్కుల సొక్కు, జారిందంటే పుటుక్కు! ఏంటది?
-
పుట్టెడు శెనగల్లో ఒకటే రాయి.
-
పచ్చని పెట్టెలో విచ్చుకోనుంది! తెచ్చుకోబోతేను గుచ్చుకుంటుంది! ఏంటది?
-
పళ్ళున్నా నోరు లేనిది?
-
అడుగులు ఉన్నా కాళ్ళు లేనిది?
జవాబులు
1. దీపం. 2. రేగుపండు 3. కొవ్వొత్తి 4. లవంగం 5 రైలు 6. కళ్ళజోడు 7. చందమామ 8. మొగలి పువ్వు 9. రంపం 10. గజం కొలిచే బద్ద.
జోకులు
కొత్త మోజు!
భార్య: అదేంటండీ! కొత్త బండిని అలా తోసుకుంటూ వస్తున్నారు?
భర్త: కొత్త బండి కదా, పెట్రోలు ఎంత తాగుతుందో తెలీదు, అందుకని!
ఇంకెవ్వరూ రారండి!
టీచర్: రామూ! ఈ తరగతి మొత్తంలో టైం ప్రకారం నడుచుకునే వారెవరు,చెప్పు?
రాము: గడియారం టీచర్!
సత్యవాది!
రమణ: మీ కొత్త ఫ్రిజ్ ఎలా పని చేస్తుంది?
రాము: కరెంటుతోనేనండి!
కలలు మంచివి!
లత: ఇప్పుడే నాకు ఒక కల వచ్చిందండి- మీరు నాకు రత్నాల హారం కొన్నట్టు.
సురేష్: ఓహొ. అయితే వెంటనే మళ్ళీ కలగను- ఈసారి నేను దాన్ని నీ మెడలో వేసినట్లు.
వేడెక్కించే వార్త!
పిసినారి పుల్లయ్య : బాగా జలుబు చేసిందే! వేడివేడిగా ఏమైనా ఉంటే చెప్పు!
భార్య: ఇప్పుడే షాపింగ్ చేసొచ్చానండి; బిల్లు లక్ష అయింది! ఈ సంగతి మీకెలా చెప్పాలా అని చూస్తుంటే మీరే అడిగారు!
జాలిగుండె!
రవి: మమ్మీ! బయట ఒకాయన ఎండలో నిల్చునీ అరుస్తుంటే, ఇందాక పది రూపాయలు ఇచ్చాను..
అమ్మ: మంచిపని చేశావ్.. ఇంతకీ ఏమని ఆరిచాడు అతను ?!
రవి: ఐస్‌క్రీం.. ఐస్‌క్రీం. ఐస్‌క్రీం..అని.
లోకజ్ఞానం!
టీచర్ : మూడు వందలు, మూడు యాబైలు, మూడు పదులు- కలిపితే మొత్తం ఎన్ని?
స్టూడెంట్: మొత్తం తొమ్మిది నోట్లు టీచర్ !
పద్యం
కాని వాని తోటి కలసి వర్తించెనా
హాని వచ్చు నెంత వానికైన
తాటి క్రింద పాలు తాగిన చందమౌ
విశ్వదాభిరామ, వినురవేమ!
భావం: ఓ వేమా! తాటి చెట్టుకింద కుర్చొని పాలు త్రాగుతున్నా, 'కల్లు త్రాగుతున్నాడ'నే అనుకొంటారు. అదే విధంగా చెడ్డవారితో కలిసి తిరుగుతూ ఉంటే ఎంత మంచివానికైనా చెడ్డ పేరు వస్తుంది.