పిసినారి పాపయ్య ఎప్పుడూ ఒక్క రూపాయి ఖర్చు పెట్టేవాడు కాదు; తీసుకున్న అప్పు తిరిగి ఇచ్చేవాడూ కాదు. కానీ అతనికి దైవ భక్తి మెండు. రోజూ ఇంట్లో పూజ చేసేవాడు. అతని ప్రార్థన ఎప్పుడూ "దేవుడా, నాకు ఇవాళ్ళ వంద రూపాయలు దొరికేటట్లు చూడు దేవుడా, నీకో కొబ్బరి కాయ కొడతాను!" అని ముగిసేది.

ఒక రోజున అట్లా ప్రార్థన చేసి బయటికి వెళ్ళిన పాపయ్యకు రోడ్డు ప్రక్కనే పెళపెళలాడే వందరూపాయల నోటొకటి కనిపించింది.

'ఇది దేవుడిచ్చిన సొమ్ము! కొబ్బరి కాయ కొట్టాల్సిందే' అనిపించింది అతనికి. కానీ‌ వెంటనే "అయ్యో! టెంకాయ కొంటే ఇరవై రూపాయలు ఖర్చు' అని కూడా అనిపించింది.

అంతలోనే ఎదురుగుండా రెండు కొబ్బరికాయల అంగళ్ళు కనబడ్డాయి. వాటిని చూడగానే అతనికి ఒక ఆలోచన వచ్చింది. నేరుగా ఒక అంగడికి వెళ్ళి, "ఇదిగో, నువ్వు కుళ్ళిపోయిన టెంకాయలు అమ్ముతావట కదా?" అని అడిగాడు. దుకాణం వాడు పళ్ళు కొరుకుతూ "ఎవరు చెప్పారు నీకు?" అని అరిచాడు.

"అదిగో ఆ ప్రక్క దుకాణం వాడు" అన్నాడు పాపయ్య సంతోషంగా.

"ఆగు, ఇప్పుడే వస్తాను. వాడితో కొంచెం మాట్లాడేది ఉంది" అని పాపయ్యని అక్కడే వదిలి ప్రక్క దుకాణం మీదికి పోయాడు అతను.

అంతే.. ఇక పాపయ్య క్షణం ఆలస్యం చెయ్యకుండా ఒక టెంకాయని తీసుకొని సంచీలో వేసుకొని జారుకున్నాడు.

ఆ సంతోషం కొద్దీ మరునాటి నుండీ దేవుడికి మరింత భక్తితో పూజ చెయ్యసాగాడు పాపయ్య: "దేవుడా! మళ్ళీ వంద రూపాయలు దొరికించు. అట్లాగే నీ చలవతో కొబ్బరి కాయ కూడా దొరికేట్లు చెయ్యి. నీ రుణం‌ ఉంచుకోను" అని.

కొద్ది రోజులకే పాపయ్యకు మరో వంద రూపాయల నోటు దొరికింది. "ఆహా! దేవుడు దయామయుడు" అనుకొని, పాపయ్య మళ్ళీ తన పాత ఉపాయాన్నే ప్రదర్శించబోయాడు.

అయితే ఈసారి అంగళ్ళ వాళ్ళు మోసపోలేదు. “నువ్వు కుళ్ళిపోయిన టెంకాయలు అమ్ముతావట గదా?” అనగానే, "అవును. ఎన్ని కావాలి?” అన్నాడు అంగడాయన. పాపయ్యకు వెంటనే ఏమనాలో‌ తెలీక నీళ్ళు నమిలాడు.

ఆలోగా వెనకనుండి వచ్చిన మనుషులు కొందరు పాపయ్యను పెడరెక్కలు విరిచి పట్టుకున్నారు. దుకాణాల వాళ్ళు అందరూ కలిసి అతన్ని చితకబాదారు.

అసుపత్రి ఖర్చులు తడిసి మోపెడైనాయి. అటుపైన పాపయ్య ప్రార్థనలో ఎన్నడూ వంద రూపాయల ప్రస్తావన రాలేదు.