రంగాపురపు గోపాలయ్య కష్టజీవి. అయితే ఆ కష్టంవల్ల గోపాలయ్య సంపాదించిందంతా ఒకే ఒక్క ఆవు; ఓ చిన్నపాటి పొలం. ఆ ఒక్క ఆవువే పాలు-పెరుగు అమ్మి, ఉన్నంతలో పొదుపుగా బ్రతికేవాళ్ళు వాళ్ళు.

'నా తర్వాత మా రాజయ్య ఎట్లా బతుక్కుంటాడు?' అని గోపాలయ్యకు విచారంగా ఉండేది. ఆ విచారానికి కారణం‌ లేకపోలేదు: గోపాలయ్య కొడుకు రాజయ్య చాలా అమాయకుడు. వాడి అమాయకత్వం వల్ల ఒక్కోసారి చాలానే కష్టం అయ్యేది. లౌక్యంతో కూడుకున్న పనులు చెడిపోయేవి. కుటుంబం అంతా ఎగతాళికి గురి అవ్వాల్సి వచ్చేది.

"రాజయ్యకు ఓ మంచి తెలివైన పిల్ల భార్యగా దొరికితే చాలు- వాళ్ళు సుఖంగా బ్రతుక్కుంటారు" అని ఆలోచించిన గోపాలయ్యకు, తన చిన్ననాటి స్నేహితుడు శంకరయ్య గుర్తుకొచ్చాడు. 'శంకరయ్యదీ తమలాంటి కుటుంబమే. వాడిని అడిగితే పొరుగూరిలో ఏమైనా సంబంధాలు చూసి పెడతాడు..'

ఆ ఆశతోటే అతను ఒకనాడు పనిమళ్ళా పోయి శంకరయ్యను కలిసాడు.

"రా! రా! గోపాలా!‌ ఎంతకాలానికి గుర్తొచ్చాను నీకు! మీవాడికి ఐదారేళ్ళు ఉన్నప్పుడు కలిసాం! ఎట్లా ఉన్నావు నువ్వు?! వదినమ్మ ఎలా ఉన్నది?!" అంటూ ఆప్యాయంగా పలకరించాడు శంకరయ్య.

ముచ్చట్లు అవీ పూర్తయ్యాక-"శంకరయ్యా! పిల్లాడు పెళ్ళీడుకు వచ్చాడు. ఎవరైనా మంచి పిల్లని తెచ్చి వాడి పెళ్ళి చేసెయ్యాలని అనుకుంటున్నాను. నీకేమైనా సంబంధాలు తెలిస్తే చూడు. మావాడు కష్టపడి పని చేస్తాడు; కానీ బాగా అమాయకుడు. మాకు ఓ ఆవు, చిన్నపాటి పొలం‌ ఉన్నాయి. ఎట్లాగో అట్లా వాడికి ఓ మంచి తెలివైన అమ్మాయినిచ్చి పెళ్ళి చేస్తే, నా బాధ్యతా తీరుతుంది; మా వాడి జీవితమూ ఒక దారిన పడుతుంది" అని చెప్పాడు గోపాలయ్య.

శంకరయ్య మురిసిపోతూ "గోపాలయ్యా! మీవాడు లక్షణంగా బాగుంటాడు. నీ మాట మీద నమ్మకం ఉంది. అన్ని ఆస్తులూ ఒక ఎత్తు; కష్టపడే లక్షణం మరొక ఎత్తు. ఆ ఒక్క లక్షణం ఉంటే చాలు- ఆస్తిపాస్తులు అన్నీ సమకూర్చుకోవచ్చు. మీ కుటుంబానికి చక్కగా సరిపోతుంది నా బిడ్డ కాత్యాయని. ఆమెని నీ కొడుకుకు ఇస్తే బాగుంటుం-దనిపిస్తుంది..” చెప్పాడు శంకరయ్య.

'అంతకన్నానా! అయితే ముందు నీ కూతురితో నన్ను రెండు మాటలు మాట్లాడనివ్వు!" అన్నాడు గోపాలయ్య

"కాగల కార్యం గంధర్వులు తీర్చటం అంటే ఇదేనేమో" అంటూ తన కూతురు కాత్యాయనిని పిలిచాడు శంకరయ్య.

"కాత్యాయనీ! నా చిన్ననాటి స్నేహితుడు గోపాలయ్య మామయ్య వచ్చాడు; కాసిని మంచి నీళ్ళు పట్టుకురా తల్లీ!" అని. శుభ్రంగా తోమిన గ్లాసులో మంచినీళ్ళు పట్టుకొని వచ్చింది కాత్యాయని. గోపాలయ్య ఆమెను ప్రేమగా పలకరించి, 'నేను నిన్ను రెండు చిన్న ప్రశ్నలు అడుగుతాను, సమాధానం చెబుతావామ్మా?' అని అడిగాడు.

"అడగండి మామయ్యా!" అన్నది కాత్యాయని.

"మన ఇంటికి ఎవరైనా అతిధి వచ్చాడనుకోమ్మా, బాగా ఆకలితో; సరిగ్గా ఆ సమయానికి మన ఇంట్లో కూరలు లేక పోతే ఎలాగ? మనం పెట్టే భోజనం అతనికి రుచిస్తుందా?" అని అడిగాడు గోపాలయ్య.

"ఆకలి రుచి ఎరుగదు అంటారు కదా మామయ్యా! ఇంట్లో ఉన్న పచ్చడి, పెరుగు కూడా అట్లా ఆకలిగా ఉన్న వాడికి పంచ భక్ష్య పరమాన్నాలుగా తోస్తాయి, కూరగాయలే పెట్టాలని ఏమీ లేదు" చెప్పింది కాత్యాయని.

ఆ జవాబుకి గోపాలయ్య తృప్తి చెంది, మరొక ప్రశ్న అడిగాడు- "ఒక వేళ ఎవరైనా తెలివైన అమ్మాయికి అమాయకుడైన భర్త దొరికాడనుకో, అప్పుడు అ అమ్మాయి ఏం చేయాలి?" అని.

"అమాయకుడైతే ఏం నష్టం? మంచివాడు, కష్టపడే తత్వం ఉన్నవాడు అయితే చాలు- అన్నీ‌ సర్దుకుంటాయి" అన్నది కాత్యాయని.

ఆమె మాటలు విన్న తర్వాత గోపాలయ్య మనసు చల్లబడ్డది. అటు తర్వాత ఇరు కుటుంబాల వాళ్ళూ మాట్లాడుకుని, కాత్యాయని, రాజయ్యల పెళ్లి జరిపించారు.

గోపాలయ్యకు ఊరి బయట ఒక ఎకరా భూమి ఉంది. దానిలో ఏదైనా పండించాలంటే బాగా దున్నాలి. దానికి నీటి వసతి కూడా లేదు. దున్నించాలంటే డబ్బు కావాలి; అటు తర్వాత చేనులో పని చేసిన కూలీలకు డబ్బు లివ్వాలి. అంతా చేస్తే తిరిగి ఎంత వస్తుందో తెలీదు. వానలు పడతాయో, లేదో? అసలు గోపాలయ్య దగ్గర పెట్టుబడి పెట్టేందుకు అంత డబ్బు కూడా లేదు!

కాత్యాయని ఒక ఆలోచన చేసింది. ఒక రోజున రాజయ్యను వెంటబెట్టుకొని పొలం దగ్గరకు వెళ్ళింది. తను చెప్పినట్టు చెయ్యమంది రాజయ్యను. ఇద్దరూ‌ చెరొక గడారి (గడ్డపార) తీసుకుని పొలంలో అక్కడక్కడా త్రవ్వటం మొదలు పెట్టారు.

పక్క చేను గురవయ్య అనే భూస్వామిది. అతను వీళ్ళు చేస్తున్న పనిని చూసి, గబగబా వాళ్ల దగ్గరికి వచ్చి, "ఏంచేస్తున్నారు, మీరు?!" అని అడిగాడు.

"ఏం చెయ్యట్లేదన్నా! మా మామగారి తండ్రి ఎప్పుడో ఈ పొలంలో రెండు చిన్న పాత్రల నిండా బంగారం దాచాడట. వాటి కోసం త్రవ్వి చూస్తున్నాము. ఒకవేళ అవి గనక దొరికితే మాదరిద్రం కాస్తా వదిలిపోతుంది!" అన్నది కాత్యాయని.

సాయంత్రం వరకూ అట్లా త్రవ్వి త్రవ్వి, రాజయ్య, కాత్యాయని ఇద్దరూ ప్రశాంతంగా ఇంటికి వెళ్ళిపోయారు. అయితే ఆ రాత్రి గురవయ్యకు నిద్ర పట్టలేదు. ఊరికే వస్తేచాలు- ఏదైనా తీసుకునే రకం అతను. అందుకే అతను, అతని కొడుకు ఇద్దరూ రాజయ్య పొలానికి వచ్చి రాత్రికి రాత్రి చేను అంతా త్రవ్వి పడేశారు. ఎంత త్రవ్వినా వాళ్లకు ఏ బంగారు పాత్రా దొరకలేదు.

రెండో రోజు ప్రొద్దున్నే కాత్యాయని, రాజయ్య వెళ్ళే సరికి పొలం అంతా చక్కగా దున్ని పెట్టి ఉంది! అది గురవయ్య పనే అని కూడా కాత్యాయని కనిపెట్టింది. ఆమె, రాజయ్య ఇద్దరూ ఆ రోజంతా అక్కడ చేనులో‌ జొన్నలు చల్లారు.

మరుసటి రోజున కాత్యాయని తన ఇంటికి తోరణాలు కట్టి, లక్ష్మి పూజ చెయ్యటం మొదలెట్టింది. ఊర్లలో విషయాలు ఆగవు కదా, సంగతి చటుక్కున గురవయ్యకు కూడా చేరింది. "ఓహో! అయితే బంగారు పాత్రలు దొరికి ఉంటాయి వాళ్లకి!" అనుకొని అసూయతో రగిలిపోయాడు గురవయ్య.

"ఈరోజు రాత్రి మా ఇంట్లో దొంగలు పడబోతున్నారు" అని నవ్వుకున్న కాత్యాయని, రాజయ్యను దగ్గరికి పిలిచి, "ఇవాళ్ల రాత్రి నువ్వు నన్ను యీ యీ ప్రశ్నలు అడగాలి, గట్టిగా, ప్రక్క ఇళ్ళ వాళ్లకు కూడా వినబడేలా!" అని అవేంటో చెప్పింది. కాత్యాయని తెలివితేటల మీద పూర్తి నమ్మకం ఉన్న రాజయ్య సరేనన్నాడు.

అనుకున్నట్టుగానే ఆరోజు రాత్రి వాళ్ళింట్లో దొంగతనానికి వచ్చాడు గురవయ్య. అర్థరాత్రి అవుతుందనగా కిటికీ తెరలు ప్రక్కకు జరిపి, దొంగగా లోపలికి చూడటం మొదలెట్టాడు.

అతనికోసమే ఎదురు చూస్తున్న కాత్యాయని భర్తని మోచేత్తో పొడిచి, 'అందరూ‌ పడుకున్నారు. ఇప్పుడు అడుగు, ఏం అడుగుతావో!' అన్నది.

"ఆ బంగారు పాత్రల సంగతేమిటి?" గట్టిగా అడిగాడు రాజయ్య. కిటికీ అవతలినుండి గురవయ్య చెవులు రిక్కించుకొని వింటున్నాడు.

అది చూసుకున్న కాత్యాయని, "అబ్బ! హాయిగా పడుకోవయ్యా! మనకేమీ‌ భయంలేదు. ఎవరైనా దొంగలు వస్తే కష్టం కదా అని, బంగారు పాత్రల్ని మన ఇంటి ఎదురుగా ఉన్న ఆ పెద్ద చెట్టు కొమ్మల్లో దాచాను" అని జవాబిచ్చింది.

అది విన్న గురవయ్య ఇంక ఆలస్యం చేయలేదు- గబుక్కున వెళ్లి ఆ చెట్టు ఎక్కాడు. మసక వెలుతురులో, కొమ్మల మాటున నిజంగానే ఏవో పాత్రల వంటివి కనబడ్డాయి అతనికి. విప్పారిన మొహంతో గబుక్కున వాటిని అందుకోబోయాడు గురవయ్య! అయితే అవి పాత్రలు కాదు ! తేనె పట్టులు!

తక్షణం ఝుమ్మని పైకి లేచిన తేనెటీగలు గురవయ్యని చుట్టు ముట్టి, వళ్ళంతా కుట్టి కుట్టి వదిలాయి. గురవయ్య హాహాకారాలు చేసుకుంటూ చెట్టు మీది నుండి జారి కింద పడ్డాడు!

అతని అరుపులు విన్న రాజయ్య, కాత్యాయని హడావిడిగా ఇంటి బయటికి వచ్చి చెట్టు కింద పడి ఉన్న తేనెపట్టును గిన్నెలోకి ఎత్తుకొని, అట్లానే గురవయ్యను కూడా మర్యాదగా లేవనెత్తి, ఇంట్లోకి తీసుకెళ్ళి, చక్కగా పసరు మందు తెచ్చి రాసి, మంచి నీళ్ళు త్రాపి, తెల్లవారాక మర్యాదగా సాగనంపారు.

ఆ సంఘటనతో గురవయ్యకు జ్ఞానోదయం అయింది. మంచి మనుషులకు అన్యాయం చేయాలని చూస్తే తనకే తగిన శాస్తి జరిగిందని అర్థమైంది. 'వీళ్లతో‌ పెట్టుకుంటే మొదటికే మోసం‌ వస్తున్నది!" అని ఇంక వాళ్ల జోలికి పోకుండా ఊరుకున్నాడు.

అంతలో వానా కాలం రానే వచ్చింది. బాగా త్రవ్వి గింజలు వేసినందున రాజయ్య పొలంలోకి నీరు ఇంకి, ఆ ఏడాది బలే బాగా పండింది.

కాత్యాయని తెలివికి రాజయ్య, గోపాలయ్య ఇద్దరూ ఎంతో సంతోషించారు.

కాత్యాయని సాహచర్యంలో రాజయ్య కూడా అమాయకత్వాన్ని వీడి తెలివిమంతుడైనాడు. కష్టానికి తెలివి తేటలు కూడా తోడవ్వటంతో అటుపైన వాళ్ళిద్దరూ పట్టిందల్లా బంగారమైంది.