రామయ్య ఒక పెద్ద మోతుబరి రైతు. ఆయన కొడుకు పెళ్ళీడుకు వచ్చాడు. తనకు కాబోయే కోడలుకు పనీ-పాట, శుచీ-శుభ్రం అన్నీ‌ బాగా తెలిసి ఉండాలి; డబ్బు లేకున్నా పరవాలేదు గానీ, సుగుణాల రాశి అయి ఉండాలి' అని రామయ్యకు గట్టి కోరిక.

'అట్లాంటి పిల్లను తనే స్వయంగా వెతకాలి' అని ఒక రోజున ప్రత్యేకంగా ఆ పని మీదే బయలుదేరాడు. ఎద్దుల బండి నిండా రేగిపళ్ళు నింపుకుని చుట్టు ప్రక్కల గ్రామాలలో అమ్మబోయాడు. వీధుల వెంట బండిని తోలుకుంటూ, "పళ్లో పళ్ళు-రేగిపళ్ళు- చెత్తకు తగు పళ్ళు ఇస్తాం!" అని అమ్ముతున్నాడు. ఎంత చెత్త ఇస్తే అన్ని రేగిపళ్లు!

"ఈయనెవరో బాగున్నాడు- చెత్తకు బదులుగా రేగిపళ్ళు ఇస్తాడట!" అని, ఊళ్ళలో ఆడవాళ్లంతా అప్పటికప్పుడు ఇళ్ళూ వాకిళ్ళూ ఊడవటం మొదలు-పెట్టారు. ఎప్పటినుండో పేరుకుపోయిన చెత్తనంతా పోగు చేసి, గోనె సంచుల్లోను, గంపల్లోను ఎత్తి పట్టుకొచ్చారు. రామయ్య వాళ్లందరి దగ్గరా చెత్తను తీసుకొని, ఆ బరువుకు తగినట్లు రేగిపళ్ళు ఇస్తూ పోయాడు.

త్వరలోనే హడావిడి మొదలైంది: "చూడు, నేనెంత చెత్త పోగు చేసుకొచ్చానో? నీకంటే ఎక్కువ!" అని అంతా పోటీలు పడసాగారు. పెద్దాయన చిరునవ్వుతో వాళ్ళ పోటీని ప్రోత్సహించ సాగాడు.

ఇంతలో ఒక అమ్మాయి ఓ చిన్న చాటలో కాసింత చెత్తను పట్టుకొని వచ్చింది. అక్కడున్న అమ్మలక్కలంతా ఆ చిన్న చాటని చూసి ఎగతాళిగా నవ్వారు.

"ఏంటి తల్లీ, ఇంత తక్కువ చెత్తను తీసుకు వచ్చావు?! ఈ కాస్త చెత్తకు ఎన్ని పళ్లు ఇమ్మంటావు?" అన్నాడు రామయ్య, ఆ కాస్త చెత్తా తీసుకుంటూ.

"అయ్యో! ఏదో‌ రేగిపళ్ళ మీది మోజుతో తెచ్చాను గాని, ఇది కూడా మా ఇంటిది కాదయ్యా! మా ఇంట్లో అసలు చెత్తనే లేదు; మా ప్రక్కవాళ్ళ ఇంటి ముందు దొరికింది ఇది!" అంది ఆ అమ్మాయి, సిగ్గుపడుతూ.

తన ఉద్దేశం నెరవేరినందుకు తనలో తాను సంతోషపడ్డాడు రామయ్య. రేగిపళ్ళు ఇచ్చే సాకుతో ఆ అమ్మాయితో పాటు వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళి చూసాడు. నిజంగానే ఇల్లు అద్దంలా మెరిసిపోతున్నది. పొదుపు, శుభ్రత రెండూ ఉన్న ఆ అమ్మాయి త్వరలోనే రామయ్య ఇంటి కోడలైంది.